Advertisement

Advertisement


Home > Politics - Telangana

క‌విత‌కు ష‌ర్మిల చుర‌క‌లు

క‌విత‌కు ష‌ర్మిల చుర‌క‌లు

బీఆర్ఎస్ ఎమ్మెల్సీ క‌విత‌కు వైఎస్సార్‌టీపీ అధినేత్రి వైఎస్ ష‌ర్మిల మ‌రోసారి చుర‌క‌లు అంటించారు. ఒక ఆడ మ‌నిషివై వుండి ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్‌కు పాల్ప‌డ్డానికి సిగ్గు లేదా? అని ష‌ర్మిల తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శించిన సంగ‌తి తెలిసిందే. మ‌హిళ‌ల‌కు 33 శాతం రిజ‌ర్వేష‌న్ క‌ల్పించాల‌నే డిమాండ్‌పై ఢిల్లీలో క‌విత నేతృత్వంలో దీక్ష చేప‌ట్టారు. ఈ నేప‌థ్యంలో క‌విత‌పై ష‌ర్మిల విరుచుకుప‌డ్డారు.

బీఆర్ఎస్‌లో మ‌హిళా రిజ‌ర్వేష‌న్ లేద‌ని మండిప‌డ్డారు. ఢిల్లీలో కాదు, కేసీఆర్ ఇంటి ముందు దీక్ష చేయాల‌ని క‌విత‌కు ష‌ర్మిల హిత‌వు చెప్ప‌డం గ‌మ‌నార్హం. గ‌వ‌ర్న‌ర్‌ను అవ‌మానించిన‌ప్పుడు క‌విత ఎందుకు ప్ర‌శ్నించ‌లేద‌ని ష‌ర్మిల నిల‌దీశారు. లిక్క‌ర్ స్కామ్‌లో ఇరుక్కోవ‌డం వ‌ల్లే క‌విత‌కు మ‌హిళా రిజ‌ర్వేష‌న్ గుర్తొచ్చింద‌ని ష‌ర్మిల ఎద్దేవా చేశారు. లిక్క‌ర్ స్కామ్‌పై టీపీసీసీ అధ్య‌క్షుడు రేవంత్‌రెడ్డి ఎందుకు స్పందించ‌డం లేద‌ని ష‌ర్మిల ప్ర‌శ్నించారు.

ఢిల్లీలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని క‌విత పొగుడుతారని, తెలంగాణ‌లో రేవంత్ రెడ్డి మాట్లాడకపోవడంలో ఆంతర్య మేంటని ష‌ర్మిల నిల‌దీశారు. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే వీళ్లంతా ఏకమవుతున్నట్టుగానే భావించాల్సి వ‌స్తోంద‌ని ఆమె అన్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కుటుంబంపై ష‌ర్మిల చెల‌రేగిపోతున్నారు. కానీ వారు మాత్రం అప్పుడ‌ప్పుడు మిన‌హాయించి, ష‌ర్మిల వ్యాఖ్య‌ల‌పై స్పందించ‌డం లేదు.

కేసీఆర్ కుటుంబ స‌భ్యులు కాకుండా, ఇత‌ర నేత‌లు మాత్ర‌మే ష‌ర్మిల‌పై తీవ్ర‌స్థాయిలో స్పందిస్తున్నారు. తెలంగాణ‌లో రాజ‌కీయంగా ఉనికి చాటుకోడానికే కేసీఆర్, ఆయ‌న కుటుంబ స‌భ్యుల‌పై ష‌ర్మిల ఘాటు విమ‌ర్శ‌లు చేస్తున్నార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఒక‌ట్రెండు సంద‌ర్భాల్లో ష‌ర్మిల ట్రాప్‌లో బీఆర్ఎస్ ప‌డింది. ఆ త‌ర్వాత ష‌ర్మిల వ్యూహాన్ని ప‌సిగ‌ట్టి అందుకు త‌గ్గ‌ట్టు వ్య‌వ‌హ‌రిస్తుండ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?