Advertisement

Advertisement


Home > Movies - Reviews

CSI Sanathan Review: మూవీ రివ్యూ: సి.ఎస్.ఐ సనాతన్

CSI Sanathan Review: మూవీ రివ్యూ: సి.ఎస్.ఐ సనాతన్

చిత్రం: సి.ఎస్.ఐ సనాతన్
రేటింగ్: 1.5/5
తారాగణం: ఆది సాయికుమార్, మిషా నారంగ్, ఆలి రెజా, నందిని రాయ్, తారక్ పొన్నప్ప, మధు సింగంపల్లి, రవిప్రకాష్ తదితరులు 
కెమెరా: గంగనమోని శేఖర్
సంగీతం: అనీష్ సోలొమన్
నిర్మాతలు: శ్రీనివాస్ చాగంటి, అజయ్ చాగంటి 
దర్శకత్వం: శివశంకర్ దేవ్
విడుదల తేదీ: 10 మార్చ్ 2023

ఆది సాయికుమార్ అనే హీరో ఒకతను ఉన్నాడని తెలుసు కానీ అసలు ఏ సినిమాలు చేస్తున్నాడో, ఏది ఎప్పుడు వచ్చి ఎప్పుడు పోతొందో తెలియని పరిస్థితి. అయినా అతను బిజీగా సినిమాలు చేస్తూనే ఉన్నాడు..తీస్తున్న నిర్మాతలూ ఉంటున్నారు. ఒక సూపర్ హిట్ పాట కారణంగా "శశి" అనే సినిమా ఒకటి వచ్చిందని జనానికి గుర్తుండొచ్చేమో గానీ ఆ తర్వాత అతను హీరోగా వచ్చిన ఐదారు సినిమాలు జనాభా లెక్కల్లో కనపడకుండా పోయాయి. ఇప్పుడు "సి.ఎస్.ఐ సనాతన్" వచ్చింది. అసలీ సినిమా వస్తోందని కనీస సమాచారం కూడా జనాన్ని చేరలేదు. పబ్లిసిటీ అంత వీక్. 

కథలోకి వెళ్లితే విక్రం చక్రవర్తి (తారక్ పొన్నాడ) అనే ఒక బడా వ్యాపారవేత్త హత్య చేయబడతాడు. అనుమానితులు చాలామంది ఉంటారు. అయితే ఆ హత్య చేసిందెవరన్నది ఛేదించడానికి "క్రైం సైట్ ఇన్వెస్టిగేషన్" నిపుణుడు సనాతన్ (ఆది) రంగంలోకి దిగుతాడు. అంటే ఇతనొక ఫోరెన్సిక్ నిపుణుడున్నమాట. చివరికి హత్యచేసిన వ్యక్తిని పట్టుకోవడంతో సినిమా ముగుస్తుంది. 

ఇలాంటి కథని నడిపించేది ఉత్కంఠభరితమైన స్క్రీన్ ప్లే. అదే ఇక్కడ లోపించింది. ఎక్కడా టెన్షన్ కానీ, ఏమయ్యుంటుందా అనే ప్రశ్న కానీ ప్రేక్షకులకి కలగదు. అంత పేలవంగా ఉంది కథనం. కథనం కాస్త అటు ఇటుగా ఉన్నా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాని నిలబెట్టాలి. కనీసం అదన్నా ఉండాల్సిన విధంగా ఉందా అంటే లేదు. 

గూడచారి, హిట్2 లాంటి థ్రిల్లర్స్ వస్తున్న నేపథ్యంలో ఆ జానర్లో సినిమాని అటెంప్ట్ చేస్తున్నప్పుడు వాటిని తలదన్నే విధంగా స్క్రీన్ ప్లేని రాసుకోవాల్సిన ప్రయత్నం బలంగా కనపడాలి. ఆడియన్స్ కి ఉండే ఐక్యూ కంటే దిగువ స్థాయిలో తెర మీద కథ నడుస్తున్నప్పుడు అది ఫెయిలౌతుంది. ఇక్కడ ఆ పొరపాట్లు జరిగాయి. మరీ 'ఏ' ఫర్ ఏపిల్ అన్నట్టుగా రాసుకున్న కొన్ని డైలాగులు అవసరమా అనిపిస్తాయి. 

ఉదాహరణకి పోలీస్ స్టేషన్లో కొరియర్ బాయ్ సన్నివేశమొకటి పెట్టారు. హీరోకి ఏదో ఐడియా తెప్పించడానికి పెట్టిన ఆ సన్నివేశం హాస్యాస్పదంగా ఉంది. అలాగే బోన్ బులెట్ కాన్సెప్ట్ కూడా ఇలాంటి క్రైం థ్రిల్లర్ లో "అతి"గా అనిపించింది. 

ఒక్కోసారి ప్రేక్షకులకి విషయం కన్వే అయిపోయినా దానిని సాగదీసి డైలాగ్ రూపంలో ఇచ్చే వివరణ చిరాకు తెప్పిస్తుంది. ప్రేక్షకుల తెలివితేటల్ని మరీ తక్కువగా అంచనా వేసి రాసుకున్న స్క్రిప్ట్ ఇది. 

నటీనటవర్గానికి వస్తే ఆది సాయికుమార్ గుర్తుంచుకునే పర్ఫార్మెన్స్ ఏమీ ఇవ్వలేదు. 

నిజానికి ఈ సినిమా పేరు చెబితే తారక్ పొన్నాడ గుర్తుస్తాడెమో తప్ప ఆది పెద్దగా గుర్తుకురాడు. తారక్ పాత్రకి సంబంధించిన ఒక సన్నివేశం ఎం.ధర్మరాజు ఎం.ఎ నుంచి స్ఫూర్తి పొంది లేపేసినట్టుగా ఉంది. 

మిషా నారంగ్ జస్ట్ ఓకే. 

నందినీ రాయ్ ది విగ్రహపుష్టే తప్ప నటనాప్రతిభని చూపించే అవకాశం పెద్దగా లేదు. 

ఆలి రేజ కాప్ పాత్రలో బానే ఉన్నాడు. మినిస్టర్ పాత్రలో మధు సింగంపల్లి ఒదిగిపోయాడు. 

టెక్నికల్ గా చూస్తే కెమెరా వర్క్ బాగుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం దయనీయం. పాటలు అసలే బలహీనంగా ఉన్న కథనానికి అడ్డు పడి విసిగించడానికి ఉపయోగపడ్డాయి. 

దర్శకుడు శివశంకర్ దేవ్ ఉత్కంఠబరితమైన కథని తెరకెక్కించడంలో పూర్తిగా సఫలీకృతుడు కాలేకపోయాడు. అవసరమైన డ్రామాని కూడా పండించలేకపోయాడు. ఈ తరహా సినిమా తీయడానికి అతనింకా చాలా కృషి చేసుండాల్సింది. కిడ్నాప్ అయిన హోం మినిస్టర్ కూతురు ఎక్కడుందో కనిపెడతాడు ఫోరెన్సిక్ నిపుణుడైన మన హీరో. వెంటనే సీన్లోకి పోలీసులు వెళ్తారేమో అనుకుంటాం. కానీ ఈ ఫోరెన్సిక్ హీరోయే ఆ స్పాట్ కి ఒంటరిగా వెళ్లి ఫైట్ చేసేసి పాపని విడిపిస్తాడు. ఎంత హీరో మీద హీరోయిజం చూపించాలనుకుంటే మాత్రం..ఆడియన్స్ ని మరీ జీరోలనుకోవడం ఓవర్ కాంఫిడెన్స్ అయినా అయ్యుండాలి, తెలియని తనమైనా అయ్యుండాలి. 

ఫస్టాఫ్ ఇలా ఉంది, సెకండాఫ్ అలా ఉంది అని విడిగా చెప్పడానికి లేదు..ఎందుకంటే ఆది నుంచి అంతం వరకు ఆదిబాబు చేసే నేరపరిశోధనే. అయితే క్లైమాక్స్ ట్విస్ట్ కాస్తంత పర్వాలేదనిపిస్తుంది. పబ్లిసిటీ లేకుండా వచ్చిన ఈ సినిమాకి కంటెంట్ పరంగా మౌత్ పబ్లిసిటీ కూడా తోడు రావడం కష్టమే. 

అయినా సరే, దీనికి సీక్వెల్ రాబోతోందన్ని హింట్ ఇచ్చి వదిలారు. ఈ సినిమాని మనస్ఫూర్తిగా మెచ్చుకోలేకపోయినా సీక్వెల్ తీయడానికి ఆలోచించిన దర్శకనిర్మాతల ఆత్మస్థైర్యాన్ని మాత్రం మెచ్చుకోవచ్చు. 

బాటం లైన్: తప్పులు జాస్తి-ఫలితం నాస్తి

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?