Advertisement

Advertisement


Home > Politics - Telangana

షర్మిలపై విమర్శలకు సబితా ఇంద్రారెడ్డి?!

షర్మిలపై విమర్శలకు సబితా ఇంద్రారెడ్డి?!

ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి మొదటిసారిగా వైఎస్ షర్మిలను కూడా ప్రత్యర్థి పార్టీగా గుర్తిస్తోంది. ఆమెను పరిగణనలోకి తీసుకుంటోంది. ఆమె విమర్శలకు కూడా కౌంటర్లు ఇవ్వాలని భావిస్తోంది.

సరదాగా చెప్పాలంటే.. ‘ఏడు చేపల కథ’లో.. చిట్టచివరికి చీమ ‘‘నా బంగారు పుట్టలో వేలు పెడితే కుట్టనా..’’ అంటూ సీక్రెట్ చెప్పినట్టుగా.. షర్మిల రాష్ట్రమంతా మూడున్నర వేల కిలోమీటర్లు పాదయాత్ర చేస్తే పట్టించుకోని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇప్పుడు, ఆమె తన ప్రగతి భవన్ వరకు వచ్చేసరికి ఇటువైపు దృష్టి సారిస్తున్నారు.

అయితే ఆమె మీద ప్రతివిమర్శలతో విరుచుకుపడడానికి సమఉజ్జీగా మోహరించాల్సింది ఎవరిని? ఎవరిని అస్త్రంగా సంధించి షర్మిల మీదకు ఎక్కుపెట్టాలి? అనేక రకాల కాంబినేషన్ల తర్వాత.. అందుకు తగ్గ పేరుగా.. మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. 

సాధారణంగా రాజకీయాల్లో ఎవరైనా విమర్శలు చేసినప్పుడు, అధికారంలోని వాళ్లు అదే తీరులో ప్రతి విమర్శలు చేస్తారు. ఇలా టెన్నిస్ లో ర్యాలీ షాట్ల లాగా అవి నడుస్తూనే ఉంటాయి. సాధారణంగా విమర్శించిన వారికి సమఉజ్జీని తమ పార్టీనుంచి మోహరిస్తారు. కానీ మన రాజకీయాలు మొత్తం కులాధారం నడిచేవి గనుక.. ఎవరైతే విమర్శించారో వారి కులానికి చెందిన వారితో మాట్లాడిస్తారు. ఇది సహజం.

ఏపీ రాజకీయాలను గమనించినప్పుడు.. పవన్ విమర్శలకు కౌంటర్లు ఇచ్చే ప్రతిసారీ దాదాపుగా కాపు నాయకులు వస్తుంటారు. చంద్రబాబు మీద అందరూ విరుచుకుపడతారు గానీ కమ్మకులానికే చెందిన కొడాలి నానికి కాస్త అగ్రపీఠం దక్కుతుంటుంది. దళిత నాయకులు మాట్లాడితే దళితులే సమాధానం ఇస్తారు.. అలాగే మహిళా నాయకుల విమర్శలకు జవాబు కూడా అటునుంచే వస్తుంది. 

సార్వజనీనమైన ఈ సూత్రాన్నే కేసీఆర్ కూడా షర్మిల విషయంలో అనుసరించబోతున్నారు. ఈ రెండురోజుల అరెస్టు, ఉద్రిక్తతల ఎపిసోడ్ ల వల్లనే షర్మిలకు అనవసరమైన ప్రయారిటీ దక్కించామని కేసీఆర్ అనుకుంటున్నట్టు సమాచారం. అయితే షర్మిల విమర్శలు, రాజకీయ అడుగులు ఇంకాస్త ముదిరితే.. ఆమె మీద ప్రత్యర్థిగా తమ పార్టీ తరఫున మోహరించడానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి ని పరిగణిస్తున్నట్టు సమాచారం. 

సబితా ఇంద్రారెడ్డి వైఎస్ఆర్ కు చాలా సన్నిహితురాలు. ఆయన సబితను తన చేవెళ్ల చెల్లెమ్మగా  అభివర్ణించేవారు. చేవెళ్ల నుంచే వైఎస్ఆర్ అప్పట్లో పాదయాత్ర ప్రారంభించారు. ఒకటే కులం అవుతుంది. 

ఇన్నాళ్లపాటు షర్మిల పార్టీని టీఆర్ఎస్ పట్టించుకోలేదు. పాదయాత్ర చేస్తే చేసిందిలే.. ప్రతి సెగ్మెంటులో ఓ వెయ్యో రెండువేలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు చీలితే.. అది తమకే లాభం అని మిన్నకుండిపోయింది. ఇప్పుడిక ఆమెను ప్రత్యర్థిగా భావించాల్సి వస్తే.. సబితను రంగంలోకి దించుతారు. అయితే.. వైఎస్ఆర్ ఆత్మీయతను సొంత చెల్లెలిలాగా పొందగలిగిన సబిత, తన కోడలు షర్మిల పట్ల ఏ స్థాయిలో విరుచుకు పడగలరో వేచిచూడాలి.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?