Advertisement

Advertisement


Home > Politics - Telangana

జీరో పోలింగ్.. వార్తల్లోకెక్కిన గ్రామాలు

జీరో పోలింగ్.. వార్తల్లోకెక్కిన గ్రామాలు

ఓటును వాడుకోవడం అంటే పోలింగ్ బూత్ కు వెళ్లి ఓటు వేయడం మాత్రమే కాదంటున్నారు తెలుగు రాష్ట్రాల్లోని కొన్ని గ్రామాల ప్రజలు. ఓటింగ్ వేళ సమయం చూసి నిరసన తెలపడం కూడా హక్కులో భాగమేనని చెబుతున్నారు. అలా ఇప్పటివరకు పోలింగ్ జరగని ప్రాంతాలు (జీరో పోలింగ్) కొన్ని ఉన్నాయి.

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండలం అమరగిరి చెంచుగూడెంలో 3 రోజులుగా కరెంట్ లేదు. ఈ గ్రామానికి మంచినీటి సౌకర్యం లేకపోవడం, రేషన్ కార్డుల సమస్యలు కూడా ఉన్నాయి. తమను ఎవ్వరూ పట్టించుకోవడం లేదంటూ గ్రామస్తులు పోలింగ్ ను బహిష్కరించారు. రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. వెంటనే స్పందించిన విద్యుత్ శాఖ, కరెంట్ ను పునరుద్ధరించింది. అయినా కూడా గ్రామస్తులు కదల్లేదు. అధికారులు హామీ ఇస్తేనే ఓట్లు వేస్తామని కూర్చున్నారు.

నిర్మల్ జిల్లా కడెం మండలం అల్లంపల్లెలో గ్రామస్తులు ఓటింగ్ లో పాల్గొనలేదు. రోడ్డు వేస్తామని హామీ ఇచ్చి ఇప్పటివరకు రోడ్డు వేయలేదని, దానికి నిరసనగా పోలింగ్ ను బహిష్కరిస్తున్నట్టు తెలిపారు. అటు బోధ్ మండలంలోని మాన్కాపూర్ లో కూడా ఊరంతా పోలింగ్ ను బ్యాన్ చేసింది.

రంగారెడ్డి జిల్లా కొత్తూరు మండలంలోని ఓ తాండా వాసులు ఎలక్షన్ కమిషన్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ తాండాలో పోలింగ్ బూత్ ఏర్పాటుచేయలేదు కాబట్టి ఓట్లు వేయమని వీళ్లంతా అల్టిమేటం జారీ చేశారు. ఎమ్మార్వో రంగంలోకి దిగి మరోసారి ఇలా జరగకుండా చూస్తానని హామీ ఇవ్వడంతో, పక్కనే ఉన్న తాండాకు వెళ్లి ఓటేసి వచ్చారు

బూదాన్ పోచంపల్లి మండలం కనుముక్కల గ్రామంలో కూడా పోలింగ్ ను బహిష్కరించారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేస్తేనే ఓట్లు వేస్తామని నిరసనకు కూర్చున్నారు. ఇలా తెలుగు రాష్ట్రాల్లోని చాలా పల్లెల్లో ఉదయం 10 గంటల వరకు జీరో పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత చాలా పల్లెల్లో పరిస్థితిని అధికారులు చక్కదిద్దారు.

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?