తన సినిమాకు కలిసొచ్చే ఏ చిన్న అంశాన్ని విడిచిపెట్టడం లేదు మంచు విష్ణు. కన్నప్ప ప్రాజెక్టును పాన్ ఇండియా సినిమాగా మార్చేందుకు చాలా కష్టపడుతున్న ఈ నటుడు, ఇప్పుడీ సినిమాను అంతర్జాతీయ వేదికపై నిలబెట్టాలని చూస్తున్నాడు. ఇందులో భాగంగా కాన్స్ ఫిలింఫెస్టివల్ ను ఎంచుకున్నాడు.
కాన్స్ ఫిలిం ఫెస్టివల్ లో ఈ నెల 20న కన్నప్ప టీజర్ ను ఆవిష్కరించబోతున్నారు. అలా అంతర్జాతీయ విపణిపై కన్నప్పను నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు విష్ణు. “మన కథలు, సాంస్కృతిక వారసత్వాన్ని అంతర్జాతీయ ప్రేక్షకులకు తెలియజెప్పడనే నా లక్ష్యం” అంటూ ఈ సందర్భంగా ప్రకటించాడు విష్ణు.
“ది వరల్డ్ ఆఫ్ కన్నప్ప”గా ఈ సినిమాను చిత్రోత్సవంలో ప్రదర్శించబోతున్నారు. దాన్నే టీజర్ గా యూట్యూబ్ లో విడుదల చేయబోతున్నారు. అయితే ఈ టీజర్ లో ప్రభాస్ కనిపిస్తాడా అనే చర్చ మొదలైంది.
ఎందుకంటే, ఈమధ్యే సెట్స్ పైకొచ్చాడు ప్రభాస్. ప్రస్తుతం మంచు విష్ణు, ప్రభాస్ మధ్య సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఇంకా వారం రోజులు టైమ్ ఉంది కాబట్టి, మేకర్స్ గట్టిగా ప్రయత్నిస్తే టీజర్ లో ప్రభాస్ విజువల్ ను ఇరికించడం పెద్ద సమస్య కాదు.
తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో ఈ సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. టీజర్ ను ఎన్ని భాషల్లో విడుదల చేస్తారనేది ఇంకా బయటకురాలేదు.