ఏపీలో ప్రజాతీర్పు రిజర్వ్‌లో వుంది. సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికలు ముగిశాయి. గతంలో కంటే ఈ దఫా ఓటర్లు ఎక్కువగా పోలింగ్ బూత్‌లకు క్యూ కట్టారు. జగన్ పాలనపై ఈవీఎంలలో తమ తీర్పు ప్రకటించారు. జూన్ 4న ఈవీఎంలలో నిక్షిప్తమైన ప్రజాతీర్పు వెల్లడి కానుంది. ఈవీఎంలలో దాగిన తీర్పుపై రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలు తమ అభిమానాన్ని బట్టి అంచనా వేస్తున్నారు.
ఏపీలో ఓటింగ్‌కు వెల్లువెత్తడం చూస్తే, ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిబింబిస్తోందని చెప్పేవాళ్లు లేకపోలేదు. ముఖ్యంగా అర్బన్ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం గతంలో కంటే పెరిగిందని, ఇది ముమ్మాటికీ కూటమికి అనుకూల వాతావరణాన్ని తెలియజేస్తోందని కొందరు అభిప్రాయపడుతున్నారు.
భారీగా ఓటింగ్ నమోదు కావడం వైసీపీకి అనుకూలమని మరికొందరు చెబుతున్నారు. పట్టణాల్లో మొదటి నుంచి వైసీపీకి వ్యతిరేకత వుందని, గత ఎన్నికల్లో కూడా ఆ పార్టీ పెద్దగా గెలిచిన దాఖలాలు లేవంటున్నారు. 2019తో పోలిస్తే, ఈ దఫా వైసీపీకి సీట్లు తగ్గొచ్చు తప్ప, అధికారం పక్కా అని గట్టిగా వాదించే వాళ్ల సంఖ్య ఎక్కువే. మరీ ముఖ్యంగా మహిళలు, వృద్ధులు భారీగా ఓట్లు వేయడానికి రావడం వైసీపీకి అనుకూలమని అంటున్నారు.
దీనికి తోడు గ్రామీణ ప్రాంతాల్లో ఓట్లు వేయడానికి వెల్లువెత్తడానికి ప్రధాన కారణం… సంక్షేమ పథకాల లబ్ధిదారుల అభిమానమే దాగి వుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి జూన్ 4వ తేదీ వరకూ తమ అభిమానానికి అనుగుణంగా అధికారం తమదంటే తమదని చెబుతుంటే, వినాల్సిన పరిస్థితి.