గత శుక్రవారం ప్రధానంగా కృష్ణమ్మ, ప్రతినిధి-2 సినిమాలు రిలీజ్ అయ్యాయి. సత్యదేవ్ ట్రాక్ రికార్డ్ దృష్ట్యా కృష్ణమ్మపై తక్కువమంది చూపు పడింది. ప్రతినిధి-2 పై మాత్రం చాలామంది ఫోకస్ పెట్టారు. దీనికి 2 కారణాలు.
నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీ ఇది. పైగా ఎన్నికల సీజన్ లో వస్తున్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ మూవీ కూడా. అందుకే సినిమాను కొంచెం ఆలస్యం చేసి మరీ, సరిగ్గా పోలింగ్ కు 3 రోజుల ముందు రిలీజ్ చేశారు. ఇంత ప్లాన్ చేసినప్పటికీ ఏదీ కలిసిరాలేదు.
ప్రతినిధి-2 థియేటర్లలో ఫ్లాప్ అయింది. సాధారణ ప్రేక్షకుల సంగతి పక్కనపెడితే, టీడీపీ అభిమానులు కూడా ఈ సినిమాను పట్టించుకోలేదు. కొన్ని వారాలుగా థియేటర్లలో నడుస్తున్న స్లంప్ ను ప్రతినిధి-2 మరింత ముందుకు తీసుకెళ్లింది.
ప్రతినిధి-2 కాస్తయినా సక్సెస్ అయితే, ఈ ఫ్రాంచైజీని అలాగే ముందుకు తీసుకెళ్లాలని అనుకున్నాడు నారా రోహిత్. పైగా ఈ సినిమా సక్సెస్ తో టాలీవుడ్ లో మళ్లీ సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలనుకున్నాడు. కానీ అతడి ప్లాన్స్, ఆశలు ఏవీ నెరవేరలేదు.
ప్రతినిధి-2తో పోలిస్తే, కృష్ణమ్మ కాస్త బెటర్. ఈ సినిమాకు ప్రపంచవ్యాప్తంగా రెండున్నర కోట్ల రూపాయల గ్రాస్ వచ్చింది. ఇదేమంత పెద్ద నంబర్ కాకపోయినా, ప్రత్యేకంగా ఎందుకు చెప్పుకోవాల్సి వచ్చిందంటే, సత్యదేవ్ గత చిత్రాలతో పోలిస్తే కృష్ణమ్మ కాస్త బెటర్.
మొత్తమ్మీద ఈ వారం కూడా బాక్సాఫీస్ లో కళ కనిపించలేదు. ఆక్యుపెన్సీ బొత్తిగా లేదు. ప్రతి వారం సినిమాలు ఇలా వస్తున్నాయి, అలా వెళ్తున్నాయి. ఇక ఈ నెలలో మిగిలిన సినిమాల్లో కాస్త అంచనాలతో రాబోతున్న మూవీ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మాత్రమే.