'దేశమంటే మట్టి కాదోయ్..దేశమంటే మనుషులోయ్' అన్నారు సుప్రసిద్ధ సాహితీవేత్త గురజాడ అప్పారావు.
కానీ ‘దేశం’ అంటే పార్టీ కాదోయ్…‘దేశం’ అంటే నా కులమేనోయ్ అంటున్నారు టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు. మాటల్లో మాత్రం కుల రహిత పార్టీ, వ్యక్తిని తానని చెప్పుకునే చంద్రబాబునాయుడు…ఆచరణలోకి వచ్చే సరికి మాత్రం పచ్చి కుల సంఘం నాయకుడిలా వ్యవహరించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.
ఇందుకు నిలువెత్తు నిదర్శనం గురించి మాట్లాడుకుందా. రెండు రోజుల క్రితం విజయవాడ రమేశ్ ఆస్పత్రిలో చోటు చేసుకున్న అగ్ని ప్రమాదంలో పది మంది మృత్యువాత పడ్డారు. అలాగే పలువురు గాయాలపాలయ్యారు. ఈ ఘటనకు సంబంధించి ఏపీ సర్కార్ ఇప్పటికే రమేశ్ ఆస్పత్రి యాజమాన్యాన్ని బాధ్యులుగా గుర్తించి ముగ్గురిని అరెస్ట్ చేసింది. అరెస్ట్ అయిన వారిలో ఆస్పత్రి చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ (సీవోవో) డాక్టర్ కొడాలి రాజగోపాలరావు, స్వర్ణ ప్యాలెస్ కోవిడ్ కేర్ సెంటర్ ఇన్‌చార్జి, ఆస్పత్రి జీఎం డాక్టర్ కె.సుదర్శన్‌తోపాటు కోవిడ్ కేర్ సెంటర్ కోఆర్డినేటింగ్ మేనేజర్ పల్లెపోతు వెంకటేశ్ ఉన్నారు.
ఇదిలా ఉండగా ఈ ఘటనపై ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నోరు మెదపకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతు న్నాయి. చంద్రబాబే కాదు ఆయన అనుకూల మీడియా కూడా ఈ ఆస్పత్రి ప్రమాదంలో నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించడం గమనార్హం. పది మంది ప్రాణాలు కోల్పోయినా బాబులో చలనం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. సహజంగా రాష్ట్రంలో ఎక్కడేం జరిగినా ప్రభుత్వ వైఫల్యం అంటూ ఎగిరెగిరి పడే ప్రధాన ప్రతిపక్షం…రమేశ్ ఆస్పత్రి దుర్ఘటనపై మాత్రం ఎందుకు మౌనం పాటిస్తోందనే అనుమానాలు తలెత్తక మానవు.
ఈ ప్రశ్నలు, అనుమానాలన్నింటికి ఒకే ఒక్క కారణం…చంద్రబాబు సామాజిక వర్గానికి చెందిన డాక్టర్ రమేశ్‌బాబు సదరు ఆస్పత్రి యజమాని కావడమే. గుంటూరులోని రమేశ్ ఆస్పత్రిలోనే మాజీ మంత్రి అచ్చన్నాయుడు ప్రస్తుతం సేద తీరు తున్నారు. అంతేకాదు, ఇటీవల చంద్రబాబు జూమ్ వీడియోలో కరోనాపై నిర్వహించిన సమావేశంలో డాక్టర్ రమేశ్‌బాబు పాల్గొనడమే కాకుండా…కరోనా నియంత్రణలో జగన్ సర్కార్ విఫలమైందంటూ విమర్శలు గుప్పించడం విశేషం.
విశాఖలో మే 7వ తేదీ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటన చోటు చేసుకున్నప్పుడు ఏ విధంగా స్పందించారో తెలుసుకుందాం. అలాగే విజయవాడ ఆస్పత్రి దుర్ఘటనపై ఎలా రియాక్ట్ అయ్యారో తెలుసుకుని…ఆయన ప్రజల పక్షమా? కుల పక్షమా? అనే రెండింటిలో ఏ పక్షం నిలిచారో నిర్ధారించుకుందాం. ముందుగా విజయవాడ రమేశ్ ఆస్పత్రి నిర్వహణలోని కోవిడ్ సెంటర్‌లో అగ్ని ప్రమాదా నికి గురై 10 మంది మృత్యువాతపై బాబు స్పందన ఏంటో చూద్దాం.
‘ఈ ప్రమాదం తీవ్ర మనస్తాపం కలిగించింది. తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సంతాపాన్ని తెలుపుతున్నా. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’…ఇంతే. ఇంతకు మించి అగ్ని ప్రమాదంలో కోల్పోయిన వారి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
విశాఖ ఎల్జీ పాలిమర్స్ దుర్ఘటనలో 11 మంది మృత్యువాత పడడంతో పాటు వందలాది మంది అస్వస్థతకు గురయ్యారు. ఈ దుర్ఘటన మే 7న తెల్లవారుజామున చోటు చేసుకొంది. ఆ ఘటనపై చంద్రబాబు ఏమన్నారో చూద్దాం.
‘విశాఖలో ముఖ్యమంత్రి పరిహారం గురించి, ఉద్యోగాల గురించి మాట్లాడారు. లీకేజికి కారణమైన కంపెనీ ప్రముఖ కంపెనీ అని కితాబిచ్చారు. ఆయన మాటల్లో సీరియస్‌నెస్ కనిపించలేదు. ఆ కంపెనీపై చిన్న చిన్న సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఫ్యాక్టరీ యాజమాన్యం కూడా పైపైన కారణాలు చూపిస్తూ ప్రకటన చేసింది. ఈ ముఖ్యమంత్రికి అవగాహన లోపం. చెబితే వినడు. ఎవరితో మాట్లాడడు’ అని అన్నారు. అలాగే అంతటితే బాబు ఊరుకోలేదు. ఇంకా ఏమన్నారో చూడండి…
‘గ్యాస్ లీకేజీకి కారణమైన కంపెనీని తక్షణం మూసివేయాలి. కోటి రూపాయల పరిహారంతో పోయిన మనుషులు తిరిగి వస్తారా? నా మనసంతా విశాఖలోనే ఉంది. రాత్రి సరిగా నిద్ర కూడా పట్టలేదు. కేంద్రం అనుమతి కోసం ఎదురు చూస్తున్నా. లాక్‌డౌన్ ఆంక్షలు బాగా బలంగా ఉన్నాయి. దానివల్లే అనుమతి రావడంలో జాప్యం జరుగుతోందని భావిస్తున్నా. ఎప్పుడు వస్తే అప్పుడు వెంటనే వెళ్తా ’
మరి ఇప్పుడు విజయవాడ రమేశ్ ఆస్పత్రి యాజమాన్యం గురించి చంద్రబాబు ఎందుకు మాట్లాడ్డం లేదు? బాధితులను పరామర్శించడానికి ఎందుకు రాలేదు? విశాఖ ఘటన చోటు చేసుకున్నప్పుడు లాక్‌డౌన్ నిబంధనలున్నాయంటే సరిపెట్టు కోవచ్చు. ఇప్పుడు అలాంటి కట్టుబాట్లు ఏవీ లేవు కదా? మరెందుకు విజయవాడకు రాలేదు? కనీసం ఆయన కొడుకైనా కన్నెత్తి ఎందుకు చూడ్డం లేదు? పరిహారంపై బాబు మాట్లాడకపోవడానికి కారణం ఏంటి?
విజయవాడ దుర్ఘటనతో బాబులో ఎంత కులాభిమానం ఉందో అర్థం చేసుకోవచ్చు. పది మంది మనుషుల ప్రాణాల కంతే తనకు తన కుల యజమాని ప్రయోజనాలే ముఖ్యమయ్యాయి. కులంపై అభిమానం ఉంటే తప్పులేదు. కానీ ఆ కులాభిమానం దురభిమానంగా మారడమే ప్రమాదకరం. బాబులో ఆ ధోరణులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దీనికి నిలువెత్తు నిదర్శనం విజయవాడ దుర్ఘటనపై స్పందన కరవు కావడమే. ఇప్పుడర్థమైందా…బాబు కులపక్షమే తప్ప ప్రజల పక్షం కాదని.