అనంతపురం, కర్నూలు జిల్లాల్లో చేనేత కార్మికుల సంఖ్య గణనీయంగా ఉంటుంది. కొన్ని నియోజకవర్గాల్లో వీళ్లే డిసైడింగ్ ఫ్యాక్టర్ అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అనంతపురం జిల్లాలోని ధర్మవరం నియోజకవర్గంలో అయితే నేత కులానికి చెందిన వారు, చేనేత పని చేసుకునే ఇతర కులాల వారి సంఖ్య వేలల్లో ఉంటుంది. ధర్మవరం టౌన్లో వీరి ఓట్లు అభ్యర్థుల విజయావకాశాలను నిర్దేశిస్తూ ఉంటాయి.
ఇక హిందూపురం చుట్టుపక్కల ప్రాంతంలోనూ, పెనుకొండ నియోజకవర్గం పరిధిలోకి వచ్చే ప్రాంతంలో కూడా చేనేత పని చేసుకునే వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. కర్నూలు ఎంపీ సీటు పరిధిలోనూ వివిధ నియోజకవర్గాల్లో నేత సామాజికవర్గం వారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. అలాగే చిత్తూరు జిల్లా మదనపల్లి నియోజకవర్గం లో కూడా చేనేతల ఉనికి ఉంటుంది.
విశేషం ఏమిటంటే.. బీసీ వర్గానికి చెందిన నేత సామాజికవర్గంలో తెలుగుదేశం పార్టీకి మొదటి నుంచి గట్టి పట్టుంది. నేసే వాళ్లలో మెజారిటీ మంది తెలుగుదేశం పార్టీ సానుభూతి పరులుగా ఉంటారు. తెలుగుదేశం పార్టీ జెండా మోసే కార్యకర్తల్లాంటి వాళ్లు వీళ్లంతా. అయితే వీళ్లను తెలుగుదేశం పార్టీ రాజకీయంగా ఉద్ధరించింది ఏమీ లేదు. అయినా కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి చేనేత వర్గాల వారు అటే మొగ్గు చూపుతూ వచ్చారు. గత ఎన్నికల్లో కూడా ధర్మవరం వంటి చోట్ల చేనేత వర్గాల ఓట్లు తెలుగుదేశం వైపే పడ్డాయని క్షేత్ర స్థాయి పరిశీలనలు స్పష్టం చేశాయి.
అయితే అలాంటి వారికి చంద్రబాబు నాయుడు ఏనాడూ అమలు చేయని సంక్షేమ పథకాలను జగన్ అమలు చేస్తూ ఉన్నారు. వారికి రొటీన్ గా అందే ఫలాలతో పాటు.. ఇటీవలే ఏడాదికి 24 వేల రూపాయల మొత్తాన్ని అందించారు. ఈ వృత్తి పని వాళ్లలో వాళ్లూ, వీళ్లు అని లేకుండా.. అందరికీ తలా 24 వేల రూపాయల చొప్పున డైరెక్టుగా ఖాతాల్లోకి జమ చేశారు.
ఒక ఏడాదికి పరిమితం కాకుండా.. ప్రతి యేటా ఈ పథకాన్ని అమలు చేయబోతున్నట్టుగా జగన్ ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఇన్నాళ్లూ తామేం ఉద్ధరించకపోయినా రుణపడినట్టుగా తమకు ఓట్లేసే వర్గాన్ని ఇలా జగన్ సంక్షేమ పథకాలతో ఆకట్టుకుంటూ ఉండటంతో తెలుగుదేశం పార్టీ వర్గాలు ఆందోళన చెందుతూ ఉన్నాయి. అందుకే టీడీపీ నేతలు రంగంలోకి దిగారు. ఇంకా చేనేతలు కొందరికి జగన్ పథకాల లబ్ధి అందండం లేదని వారు ఆరోపిస్తూ ఉన్నారు. అయితే అర్హత కలిగిన వారికి రికార్డు స్థాయిలో జగన్ ప్రభుత్వం డైరెక్టుగా క్యాష్ ను జమ చేసింది. దీంతో తెలుగుదేశం పార్టీ నేతల వాదనకు పెద్ద విలువ లేకుండా పోతోంది. మొత్తానికి తెలుగుదేశం పార్టీ దశాబ్దాల ఓటు బ్యాంకుకు పెద్దగండే పడేట్టుగా ఉంది.