విలక్షణ నటుడు ప్రకాష్‌రాజ్ కేవలం నటుడు మాత్రమే కాదు. ఆయనలో ఓ అభ్యుదయ వాది ఉన్నాడు. సమాజ సంక్షేమం కోరే దార్శనికుడున్నాడు. అన్నిటికీ మించి ఆయనో గొప్ప మానవతా వాది. సమస్యలకు భయపడని నైజం ఆయన సొంతం. ప్రాణాలను సైతం లెక్కచేయని ధైర్యం ఆయన ఆస్తి. ఇప్పటికే ఆయన అనేకసార్లు మోడీ సర్కార్‌పై తీవ్ర విమర్శలు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఆయన జాతీయ మీడియాపై తనదైన శైలిలో సంచలన కామెంట్స్ చేశాడు. ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అబద్ధ వార్తల్ని అమ్ముకోవడానికి మీడియాను కొనుగోలు చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. దీనిని చట్టబద్దమైన హెచ్చరికగా ఆయన పేర్కొన్నాడు. జస్ట్ ఆస్కింగ్ అనే హ్యాష్‌ట్యాగ్ దీనికి జత చేశాడు.
అర్ణాబ్ గోస్వామి, రాహుల్ సర్దానా, రుబికా లిఖాయత్, రాహుల్ శివశంకర్, నవిక కుమార్, భూపేంద్ర చౌబే, అమిశ్ దేవ్గన్, రాహుల్ కన్వాల్, రజత్ శర్మ, శ్వేతా సింగ్, సుధీర్ చౌదరిల ఫొటోలతో తయారు చేసిన ఓ ఇమేజ్ను తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ప్రకాష్ రాజ్.. ‘‘చట్టబద్దమైన హెచ్చరిక.. వారు తప్పుడు వార్తల్ని అమ్ముకోవడానికి మీడియాను కొనుగోలు చేస్తున్నారు’’ అని రాసుకెళ్లాడు.
ప్రకాష్ రాజ్ ప్రస్తావించిన ఈ జాతీయ జర్నలిస్టులంతా మోడీ సర్కార్‌కు అనుకూలంగా వార్తా కథనాలు వండుతారనే విమర్శలున్నాయి. ప్రకాష్‌రాజ్ హాట్ కామెంట్స్ తెలుగు మీడియాకి కూడా వర్తిస్తాయనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.
ప్రకాష్‌రాజ్ జాతీయ జర్నలిస్టుల ఫొటోలకు బదులు రామోజీ, ఆర్కే, మూర్తి, సాంబశివరావు, వీకేల ఫొటోలతో ఓ ఇమేజ్ను తన ట్విటర్ ఖాతాలో పెట్టి… ‘‘చట్టబద్దమైన హెచ్చరిక.. వీరు తప్పుడు వార్తల్ని అమ్ముకోవడానికి మీడియాను కొనుగోలు చేస్తున్నారు, పనిచేస్తున్నారు’’ అని రాస్తే సరిపోతుంది. ఎందుకంటే చంద్రబాబు కోసం గత కొన్నేళ్లుగా వీళ్లు చేస్తున్న పని ఇదే కాబట్టి.