కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు సీరియస్ అయింది. తమ సహనాన్ని కేంద్ర ప్రభుత్వం పరీక్షిస్తోందని, అలా చేయవద్దని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి, తెలుగు తేజం జస్టిస్ ఎన్వీ రమణ తీవ్రంగా హెచ్చరించడం చర్చకు దారి తీసింది. ట్రైబ్యునళ్లలో ఖాళీలు, నియామకాల్లో కేంద్ర ప్రభుత్వ అలసత్వం సుప్రీంకోర్టుకు ఆగ్రహం తెప్పించింది. అంతేకాదు తమ ఆదేశాలు పాటించిక జరగబోయే పరిణామాలను కూడా లెక్క కట్టి మరీ హెచ్చరించడం తీవ్ర చర్చకు దారి తీస్తోంది.
ట్రైబ్యునళ్లలో నియామకాలకు సంబంధించిన పిటిషన్లపై జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన ఎన్సీఎల్టీ (నేషనల్ కంపెనీ లా ట్రైబ్యునల్), ఎన్సీఎల్ఏటీ (నేషనల్ కంపెనీ లా అప్పీలేట్ ట్రైబ్యునల్) వంటి కీలక ట్రైబ్యునళ్లలో ఖాళీలున్నాయని ధర్మాసనం పేర్కొంది. ఇవే కాకుండా సాయుధ బలగాలు, వినియోగదారుల ట్రైబ్యునళ్లలోనూ చాలా ఖాళీలు ఉన్నాయని ధర్మాసనం తెలిపింది. తగిన సిబ్బంది లేకపోవడంతో కేసులను వాయిదాలు వేయాల్సిన పరిస్థితి వస్తోందని ధర్మాసనం వాపోయింది.
కేంద్రం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదిస్తూ… రెండు నెలల్లోగా నియామకాలు చేపడతామని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తుషార్ మెహతా సమాధానంపై సుప్రీం ధర్మాసనం అసహనం, ఆగ్రహం వ్యక్తం చేసింది.
‘గత రెండేళ్లలో ఒక్క నియామకం లేదు. నియమాకాలు చేపట్టకుండా మీరు ట్రైబ్యునళ్లను బలహీనపరుస్తున్నారు. గతంలో కోర్టు ఇచ్చిన ఆదేశాలు, ఉత్తర్వులను కేంద్రం గౌరవించట్లేదు. ఇది చాలా విచారకరం. మేం కేంద్రంతో ఘర్షణకు దిగాలనుకోవట్లేదు. కానీ మీరు మా సహనాన్ని పరీక్షిస్తున్నారు’ అని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారంలో తమ వద్ద కేవలం మూడు ఆప్షన్లు మాత్రమే ఉన్నాయని చీఫ్ జస్టిస్ తెలిపారు.
1. కేంద్రం తెచ్చిన ట్రైబ్యునళ్ల సంరస్కరణల చట్టంపై స్టే ఇవ్వడం.
2. ట్రైబ్యునళ్లను రద్దు చేసి హైకోర్టులకు అధికారాలివ్వడం.
3. కోర్టు స్వయంగా ట్రైబ్యునళ్లలో నియామకాలు చేపట్టడం.. వీటితో పాటు కేంద్రంపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపట్టే ఆప్షన్ను కూడా పరిగణించాల్సి వస్తుందని చీఫ్ జస్టిస్ తీవ్రంగా హెచ్చరించారు.
నియామకాల కోసం వారం గడువు ఇస్తున్నట్టు సుప్రీంకోర్టు వెల్లడించింది. కేంద్ర ప్రభుత్వంపై సుప్రీంకోర్టు హెచ్చరికలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. ఇటీవల కరోనాతో మృతి చెందిన వారికి నష్టపరిహారం చెల్లింపు విషయంలోనూ సుప్రీంకోర్టు ధర్మాగ్రహం ప్రదర్శించిన సంగతి తెలిసిందే.