అమెరికాలోని ప్రతిష్ఠాత్మక టెక్సాస్ మెడికల్ బోర్డులో తెలుగు తేజం, ప్రవాసాంధ్రులు, రాయలసీమలోని అనంతపురం జిల్లాకు చెందిన ‘డాక్టర్ జయరామ్ నాయుడు’ మరోసారి అవకాశం దక్కించుకున్నారు. మొత్తం ఏడుగురు సభ్యులతో కూడిన ఈ బోర్డును టెక్సాస్ గవర్నర్ గ్రెగ్ ఎబాట్ నియమించారు.
ఏడుగురు సభ్యుల్లో అదా బూత్ ఎం.డి., ఎబొనీ టాడ్, పునర్నియామకం పొందిన మైఖేల్ కొకినాస్, కాండేస్ ఫార్మర్ డీ.ఓ., మోర్గాన్ ఎం.డి., జయరామ్ నాయుడు ఎం.డి., షరీఫ్ జాఫ్రాన్ ఎం.డి. ఉన్నారు. ఈ బోర్డు 2027, ఏప్రిల్ 13 వరకు పనిచేయనుంది. టెక్సాస్ వైద్య అవసరాలు, ఇతర వైద్య సంబంధమైన సేవల విషయంలో ఈ బోర్డు కీలకంగా వ్యవహరించనుంది.
కృషి-పట్టుదలే.. విజయ రహస్యం!
టెక్సాస్ మెడికల్ బోర్డులో స్థానం సంపాయించుకున్న తెలుగు తేజం, ‘డాక్టర్ జయరామ్ నాయుడు’ వైద్య రంగంలో సుదీర్ఘ కాలంగా ఎంతో కృషి చేస్తున్నారు. పట్టుదల,ఓర్పు,సహజసిద్ధంగా తొణికిసలాడే ‘డాక్టర్ జయరామ్ నాయుడు’ కు అవే విజయ రహస్యాలనడంలో ఎలాంటి సందేహం లేదు.
టెక్సాస్ పశ్చిమ ప్రాంతమైన ఒడెస్సాలో ఫిజీషియన్‌గా ఆయన సేవలందిస్తున్నారు. అదేసమయంలో నాయుడు క్లినిక్ అధ్యక్షులుగా, టెక్సాస్ టెక్ యూనివర్సిటీ హెల్త్ సైన్సెస్ సెంటర్ అసిస్టెట్ క్లినికల్ ప్రొఫెసర్‌గా సేవలు అందిస్తున్నారు. సుమారు 40 ఏళ్లపాటు వైద్య నిపుణులుగా ఆయన ప్రైవేటు ప్రాక్టీస్ చేశారు.
టెక్సాస్ మెడికల్ అసోసియేషన్ సభ్యులుగా కూడా ‘డాక్టర్ జయరామ్ నాయుడు’ వ్యవహరించారు. అదేవిధంగా ఎక్టార్ కౌంటీ మెడికల్ సొసైటీ, టెక్సాస్ టెక్ హెల్త్ సైన్సెస్ సెంటర్ సలహా బోర్డు సభ్యునిగా కూడా ఉన్నారు. గతంలో ఒడెస్సా ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులుగా ఉన్నారు. అలాగే, 2010-2013 మధ్య గవర్నర్ రిక్ పెర్రీ, డాక్టర్ జయరామ్‌ను’ క్రానిక్ కిడ్నీ డిసీజ్ టాస్క్ ఫోర్స్’ సభ్యులుగా నియమించారు. 2017-22 వరకు టెక్సాస్ మెడికల్ బోర్డు సభ్యులుగా నియామకం పొందారు. తాజాగా ఈ బోర్డులో మరోసారి నియామకం పొందడం విశేషం.
ఇంతింతై.. అన్నట్టుగా!
‘డాక్టర్ జయరామ్ నాయుడు’ ఇంతింతై అన్నట్టుగా, వైద్య రంగంలో వికసించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లాకు చెందిన ఆయన 1966లో గుంటూరు మెడికల్ కాలేజీలో వైద్య శాస్త్రంలో పట్టా(డిగ్రీ) పొందారు. అనంతర కాలంలో అమెరికాకు చేరుకున్న ఆయన న్యూయార్స్‌లోని ఏ.సీ. లగాన్ మెమోరియల్ హాస్పిటల్‌లో రెసిడెన్సీ ఇంటర్నరల్ మెడిసిన్ పూర్తి చేశారు.
బోర్డు విధులు ఇవే..
టెక్సాస్ మెడికల్ బోర్డుకు కొన్ని విధులు ఉన్నాయి. వీటిలో ప్రజారోగ్య భద్రత, పరిరక్షణలకు పెద్దపీట వేయాలి. నిబంధనలను తూ.చ. తప్పకుండా పాటించేలా చూడాల్సి ఉంటుంది. టెక్సాస్ ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందేలా పర్యవేక్షించాలి.