తమ్మినేని సీతారాంని కోడెలతో పోల్చగలమా.?

అధికారపక్షం అసెంబ్లీలో చర్చ జరగాలనుకుంటే.. సభ నడుస్తుంది. ఆ ఉద్దేశ్యం అధికార పార్టీకి లేకపోతే, సభ నడవదు. గడచిన ఐదేళ్ళలో ఇదేతంతు చూశాం. అధికార పార్టీకి చెందిన మంత్రిగారో, ప్రభుత్వ విప్‌ పదవిలో వున్నవారో..…

అధికారపక్షం అసెంబ్లీలో చర్చ జరగాలనుకుంటే.. సభ నడుస్తుంది. ఆ ఉద్దేశ్యం అధికార పార్టీకి లేకపోతే, సభ నడవదు. గడచిన ఐదేళ్ళలో ఇదేతంతు చూశాం. అధికార పార్టీకి చెందిన మంత్రిగారో, ప్రభుత్వ విప్‌ పదవిలో వున్నవారో.. చిన్న సైగ చేస్తే, అసెంబ్లీ అప్పటికప్పుడు అర్థాంతరంగా వాయిదా పడిపోయేది. అలాంటి పరిస్థితులు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో కొనసాగుతున్నాయా.? అంటే, ఖచ్చితంగా లేదనే చెప్పాలి.

151 మంది ఎమ్మెల్యేలతో అసెంబ్లీలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార పక్షంగా తిరుగులేని బలంతో వున్నప్పుడు, 23 మంది మాత్రమే సభ్యులున్న తెలుగుదేశం పార్టీ, మొత్తం అసెంబ్లీని శాసించాలనుకోవడమేంటి.? ఓసారి, గత అసెంబ్లీ సమావేశాల తాలూకు రికార్డుల్ని చంద్రబాబు పరిశీలించినా.. ఆనాటి పరిస్థితుల్ని గుర్తుకు తెచ్చుకున్నా.. ప్రస్తుతం నడుస్తున్న అసెంబ్లీ సమావేశాలపై చంద్రబాబు విమర్శలు చేసే పరిస్థితి వుండదు. కానీ, చంద్రబాబు ఎప్పుడూ గతాన్ని గుర్తుపెట్టుకోరు.

పార్టీకి చెందిన శాససభ్యులు, శాసనమండలి సభ్యుల్ని వెంటేసుకుని, అసెంబ్లీ ప్రాంగణంలో చంద్రబాబు అండ్‌ టీమ్‌ పెద్ద 'షో' చేసింది ఈరోజు. ముఖ్యమంత్రి కనుసన్నల్లో అసెంబ్లీ నడుస్తోందంటూ చంద్రబాబు అమాయకంగా ఆవేదన వ్యక్తం చేసేశారు. కానీ, గతంలో చంద్రబాబు ఏం చేశారట.? కనీసం ప్రతిపక్షానికి మాట్లాడే టైమ్‌ కూడా ఇవ్వడంలేదు. ఇప్పుడు పరిస్థితి అదికాదు. 'ప్రతిపక్షానికి వీలైనంత సమయం ఇద్దాం..' అని పదే పదే ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ నినదిస్తున్నారు.

ఐదేళ్ళు వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద టీడీపీ అసెంబ్లీ సాక్షిగా బురద జల్లినప్పుడు లేనిది.. ఇప్పుడు, అధికార పార్టీగా వున్న వైసీపీ, ప్రతిపక్షంలో వున్న టీడీపీని ఇరకాటంలో పెట్టేలా మాట్లాడితే అన్యాయం.. అక్రమం అంటే ఎలా చంద్రబాబుగారూ.! 'మేం తలచుకుంటే, టీడీపీకి ప్రతిపక్షం హోదా కూడా లేకుండా చేయగలం' అని వైఎస్‌ జగన్‌ మాటలతో చెప్పి ఊరుకున్నారు.. చేతలదాకా వెళితే, అసెంబ్లీలో గట్టిగా ఆందోళన చేయడానికి చంద్రబాబు వెంట ఎవరూ కన్పించకపోవచ్చు.

మొత్తమ్మీద, అసెంబ్లీ సమావేశాలకు సంబంధించినంతవరకు మాజీ స్పీకర్‌తో ప్రస్తుత స్పీకర్‌ని పోల్చలేం. మాజీ ముఖ్యమంత్రితో, ప్రస్తుత ముఖ్యమంత్రిని పోల్చలేం. ఒకవేళ పోల్చాల్సి వస్తే, తమ్మినేనిదే పైచేయి స్పీకర్‌గా. వైఎస్‌ జగన్‌ సంగతి సరే సరి.!  

ఫిల్మ్ నగర్ అయిపోయే.. ఇప్పుడు వయా ముంబై

ఎవరిది పిచ్చోడి చేతిలో రాయి పాలన అవుతుంది!