తమ్ముడు అలా.. అన్నయ్యేంటి ఇలా.?

సోదరుడి హఠాన్మరణంతో తీవ్రమైన విషాదంలో మునిగిపోయిన మంత్రి కన్నబాబుని సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి పరామర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కన్నబాబు, ఒకప్పుడు చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు…

సోదరుడి హఠాన్మరణంతో తీవ్రమైన విషాదంలో మునిగిపోయిన మంత్రి కన్నబాబుని సినీనటుడు, మాజీ కేంద్రమంత్రి చిరంజీవి పరామర్శించడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కన్నబాబు, ఒకప్పుడు చిరంజీవికి అత్యంత సన్నిహితుడు. చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినప్పుడు ఆయన వెన్నంటే వున్నారు.. ఎమ్మెల్యేగానూ ప్రజారాజ్యం పార్టీ నుంచి గెలిచారు. అయితే, చిరంజీవిని రాజకీయంగా వెన్నుపోటు పొడిచింది కన్నబాబేనని ఇటీవల పవన్‌ కళ్యాణ్‌, ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారం సందర్బంగా సెటైర్లు దంచారు. అప్పట్లో కన్నబాబు చాలా హర్ట్‌ అయ్యారు కూడా.

ఆ రాజకీయ రచ్చ సంగతి పట్టించుకోకుండా కన్నబాబు ఇంట విషాదం నెలకొనడంతో, పెద్దమనిషి తరహాలో తనకు అత్యంత ఆప్తుడైన కన్నబాబు ఇంటికి వెళ్ళి పరామర్శించి వచ్చారు చిరంజీవి. ఇప్పుడిది పవన్‌కళ్యాణ్‌ అభిమానుల్లో ఒకింత ఆగ్రహానికి కారణమవుతోంది. చిరంజీవి, తన తమ్ముడికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారంటూ పవన్‌ అభిమానుల్లో కొందరు సోషల్‌ మీడియా వేదికగా నానా రచ్చా చేసేస్తున్నారు.

ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా.. అటు చిరంజీవి అభిమానులకీ, ఇటు పవన్‌కళ్యాణ్‌ అభిమానులకీ మధ్య అస్సలేమాత్రం పొసగడంలేదన్నది నిర్వివాదాంశం. ఒకప్పటి పరిస్థితి వేరు. చిరంజీవి అభిమానుల్లోనే, పవన్‌ అభిమానులుండేవారు. ఇప్పుడు పరిస్థితులు అవి కాదు. అయినా, 'అన్నయ్యను కొంతమంది వెన్నుపోటు పొడిచారు.. వారికి ఖచ్చితంగా గుణపాఠం చెబుతాను..' అని చెప్పి, ఇటీవలి ఎన్నికల్లో చేతులు కాల్చుకున్న పవన్‌ కళ్యాణ్‌ని ఆయన అభిమానులు సైతం ఇప్పుడంత సీరియస్‌గా తీసుకునే పరిస్థితి లేదనుకోండి.. అది వేరే విషయం.

రాజకీయం వేరు.. మానవత్వం వేరు. పాత పరిచయాల నేపథ్యంలో, ఒకప్పటి సాన్నిహిత్యం నేపథ్యంలో చిరంజీవి, కన్నబాబుని పరామర్శించడంలో రాజకీయ కోణాన్ని చూడలేం. ఇక్కడ తమ్ముడికి అన్నయ్య వ్యతిరేకంగా పావులు కదుపుతున్నారనీ భావించడానికి వీల్లేదు. అలా పవన్‌ అభిమానులు భావిస్తున్నారంటే, అందుక్కారణం వారిలోని అభద్రతాభావమే కావొచ్చు.

సందీప్ చెప్పినట్లే సినిమా ఉందా? అపజయాల నుంచి బయటపడేనా?