కాకుమాని జయశ్రీ…. కడప జిల్లాలో ఈ పేరు తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. నోరు లేని వారి నోరు, హక్కుల దిక్సూచి, మానవ హక్కుల మానస పుత్రిక…ఆమె గురించి ఎన్నెన్ని ఉపమానాలో! మరీ ముఖ్యంగా హక్కుల హననం అత్యంత శరవేగంగా సాగుతున్న ప్రస్తుత తరుణంలో ఆమె శాశ్వత నిద్రలోకి వెళ్లిపోవడం సమాజానికి తీరని లోటు. అనారోగ్యంతో హైదరాబాద్లో చికిత్స పొందుతూ గత రాత్రి గుండెపోటుతో జయశ్రీ (60) కన్నుమూశారు.
కడప జిల్లా ప్రొద్దుటూరు జయశ్రీ స్వస్థలం. ఆమె న్యాయవిద్యనభ్యసించారు. ప్రజా ఉద్యమాలే ఊపిరిగా ఆమె జీవితాన్ని మలుచుకున్నారు. ప్రముఖ హక్కుల ఉద్యమకారుడు బాలగోపాల్తో కలిసి పౌరుహక్కుల సంఘంలో కడప జిల్లా వేదికగా ఆమె దళితులు, పేదలు, ఏ దిక్కూలేని వారి కోసం పని చేస్తూ వచ్చారు. ఎక్కడ ఏ సమస్య ఉన్నా… తానున్నానంటూ అక్కడ వాలిపోయేవారు. అసాంఘిక శక్తులు, రౌడీలకు ఆమె సింహ స్వప్నం. ఖాకీలు, ఖద్దరు రూపంలోని రౌడీయిజానికి ఎదురొడ్డిన ఆమె ధైర్యసాహసాలు…జయశ్రీకి ప్రత్యేక గుర్తింపు, గౌరవం తెచ్చాయి.
ముఖ్యంగా మహిళలకు సంబంధించి వరకట్న వేధింపులు, అత్యాచారాలు, ప్రేమ పేరుతో వంచనలు, దళితుల అణచివేత, కుల వివక్ష, పోలీసుల వేధింపులపై ఆమె అభాగ్యుల గళమయ్యారు. గండికోట ప్రాజెక్టుల నిర్వాసితుల హక్కుల కోసం కృష్ణా జలాల్లో దీక్షకు దిగడం ఆమెకే చెల్లింది. తుది శ్వాస వరకూ ప్రజల పక్షానే నిలవడం ఆమె నిబద్ధతకు నిదర్శనం. ఇటీవల ప్రొద్దుటూరులో టిప్పు సుల్తాన్ విగ్రహం నెలకొల్పడంపై బీజేపీ వివాదం చేస్తున్న సంగతి తెలిసిందే.
బీజేపీ వైఖరిపై మూడు రోజుల క్రితం ఆమె తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఇదే ఆమె చివరి ప్రెస్మీట్. రాయలసీమను పట్టి పీడిస్తున్న సాగు, తాగునీటి సమస్యలు, విభజన చట్టంలో పొందుపరిచిన కడప స్టీల్ ప్లాంట్, అలాగే వెనుకబడిన ప్రాంతాల ప్రత్యేక ప్యాకేజీ తదితర ప్రజా సమస్యలను గాలికి వదిలేసి… మతపరమైన విద్వేషాలను రెచ్చగొట్టే పనులేంటని బీజేపీకి పట్టిన తుప్పు వీడేలా విమర్శలతో చితక్కొట్టారు.
ఇటీవల ఆమెకు హార్ట్ పంపింగ్ ఎక్కువైంది. ఒకవైపు అనారోగ్య సమస్యతో బాధపడుతూనే, మరోవైపు ప్రజాసమస్యలపై మాట్లాడకుండా ఉండలేని జయశ్రీ లాంటి నిబద్ధత గల వ్యక్తులు అరుదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. “ఎక్కడికీ కదల కుండా ఇంట్లోనే ఉండమన్నారమ్మా.. ఇంగ బతకడం ఎందుకు” అని తమతో చెప్పడాన్ని సన్నిహితులు గుర్తు చేసుకుంటూ కన్నీటి పర్యంతమవుతున్నారు.
ఆమె మరణం… పీడిత, బడుగు బలహీన వర్గాలు, పేద ప్రజలకు ఓ ధైర్యం పోగొట్టిందని చెప్పొచ్చు. ముఖ్యంగా కడప జిల్లా ప్రజలకు ఆమె లేని లోటు ఎవరూ పూడ్చలేనిది.