భారత అత్యున్నత న్యాయస్థాన ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ కీలక వ్యాఖ్యలు చేశారు. న్యాయ స్థానాల పనితీరుతో పాటు న్యాయశాస్త్రాల లోపాలపై ఆయన మాట్లాడారు.
సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రవీంద్రన్ రాసిన ఎనమిలీస్ ఇన్ లా అండ్ జస్టిస్ పుస్తకాన్ని శనివారం చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడిన అంశాలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
న్యాయ శాస్త్రంలోని లోపాలను సరి చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందని ఆయన అన్నారు. ప్రజా విశ్వాసం కోసం న్యాయ స్ధానాలు పని చేయాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ పిలువునివ్వడం గమనార్హం.
సామాన్య ప్రజలకు న్యాయాన్ని అందించడంలో అందరూ సహకరించాలని కోరారు. న్యాయస్థానాలపై సామాన్యులకు నమ్మకం పెరిగేలా.. అనేక విషయాలను జస్టిస్ రవీంద్రన్ తన పుస్తకంలో ప్రస్తావించారని సీజేఐ తెలిపారు.
ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టిన రోజు జస్టిస్ రవీంద్రన్ రాసిన లేఖను జస్టిస్ రమణ గుర్తు చేసుకున్నారు. ఆ లేఖలో జస్టిస్ రవీంద్రన్ ప్రస్తావించిన ప్రతి అంశాన్ని ప్రామాణికంగా తీసుకున్నట్టు ఎన్వీ రమణ తెలిపారు.
న్యాయశాస్త్రంలో లోపాలున్నాయని ఎన్వీ రమణ గుర్తించడంతో పాటు నిజాయితీగా అంగీకరించడం ప్రశంసలు అందుకుంటోంది. అలాగే ప్రజా విశ్వాసాన్ని న్యాయస్థానాలు చూరగొనాలని అత్యున్నత స్థాయి న్యాయమూర్తిగా ఆకాంక్షించడం ప్రజాభిప్రాయాన్ని ప్రతిబింబించిందని చెప్పొచ్చు.