అదేంటో విశాఖ అనగానే చాలా రకాలుగా కధలు అలా ప్రచారంలో ఉంటూనే ఉంటాయి. ఆ మధ్యన ఒక మీడియ విశాఖకు సముద్ర భూకంపం ముప్పు పొంచి ఉందని రాసి హడలుకొట్టింది. ఇక విశాఖలో చుట్టుపక్కల పెద్ద ఎత్తున రసాయనిక పరిశ్రమలుఉన్నాయి, కాబట్టి ఏదో రోజున ఉఫ్ అని ఊదేసినట్లుగా సిటీ అంతా బూడిద అవుతుందని కూడా వణికించారు.
ఇక విశాఖకు సునామీ ప్రమాదం ఉందని అంటున్న వారూ ఉన్నారు. అయినా సరే ఈ నగరం శతాబ్దాల నుంచి అలాగే ఉంది. ఇపుడు తాజాగా విశాఖకు మరో ముప్పు అంటున్నారు. అది కేవలం విశాఖకు మాత్రమే కాదు, దేశంలో తీర ప్రాంతాలలో ఉన్న పన్నెండు నగరాలతో పాటు విశాఖకు కూడా ఆ ప్రమాదం ఉందని ప్రపంచ వ్యాప్తంగా సముద్రపు మట్టాల మార్పులపై అధ్యయనం చేసే ఐపీసీసీ నాసా పరిశీలన తర్వాత ఈ నివేదికను వెల్లడించింది.
ఆ నివేదిక ప్రకారం మరో యాభై నుంచి ఎనభి ఏళ్ళలో విశాఖ సహా ఈ పన్నెండు నగరాలు సముద్రం అడుగున ఉంటాయని చెబుతోంది. 2050 తర్వాత నుంచి ప్రతి ఆరు నుంచి తొమ్మిదేళ్లలోనే సముద్రపు మట్టాల్లో మార్పులు చోటు చేసుకుంటాయని తెలిపింది.
అధిక ఉష్ణోగ్రతల వల్ల మంచు కరిగి సముద్ర నీటి మట్టాలు ఎన్నడూ లేని విధంగా రానున్నకాలంలో పెరిగిపోతాయని ఆ నివేదిక చెబుతోందిట. అంతే కాదు, ఆసియా దేశాలలోనే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు.
మొత్తానికి విశాఖ సహా తీర ప్రాంత నగరాలకు ముప్పు ఉందని గ్లోబల్ వార్నింగ్ ఇస్తున్నట్లుగా ఉంది. అయితే దీని మీద వాతావరణ పరిశోధకులు మాత్రం సరైన నివారణ చర్యలు తీసుకుంటే ఈ ఉత్పాతాలను అధిగమించవచ్చు అని చెబుతున్నారు. మరి ఆ దిశగా ఆలోచనలు రానున్న కాలంలో చేస్తారేమో చూడాలి.