ఉప ఎన్నికైనా సరే పథకం తేవాల్సిందే

ఎన్నికలు వస్తేనే పథకాలు వస్తాయి. ఇదీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పాఠం. ఈ విధంగా జనాల కళ్ళు తెరిపించాడు ఆయన. పథకాలు ప్రకటించడానికి యేవో ఎన్నికలు రావాలి. చివరకు ఒక్క ఉప ఎన్నికైనా…

ఎన్నికలు వస్తేనే పథకాలు వస్తాయి. ఇదీ తెలంగాణా ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పిన పాఠం. ఈ విధంగా జనాల కళ్ళు తెరిపించాడు ఆయన. పథకాలు ప్రకటించడానికి యేవో ఎన్నికలు రావాలి. చివరకు ఒక్క ఉప ఎన్నికైనా చాలు. ప్రజల్లో ఏదో సామాజిక వర్గానికి మేలు జరుగుతుందని అర్ధమవుతోంది. కాబట్టి ఏదో కారణంగా రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగాలి. సాధారణంగా ఉప ఎన్నికలు రెండు విధాలుగా వస్తాయి. ప్రస్తుత అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే లేదా ఎంపీ మరణిస్తే లేదా ఏదో కారణం వల్ల పదవికి రాజీనామా చేస్తే ఉప ఎన్నిక జరుగుతుంది.

ఒకప్పుడు అధికార పార్టీలు అంటే పాలన సాగిస్తున్న పార్టీ ఉప ఎన్నికను పెద్దగా పట్టించుకునేవి కాదు. కానీ కేసీఆర్ అలా కాదు. ఉప ఎన్నికను కూడా చాలా సీరియస్ గా తీసుకుంటాడు. తెలంగాణలో ఆయనకు ఉప ఎన్నికల స్పెషలిస్టు అనే పేరుంది. తెలంగాణా ఉద్యమంలో ఆయన ఎన్నోసార్లు ఉప ఎన్నికలు తెప్పించాడు. అలా పనిగట్టుకొని ఉప ఎన్నికలు తెప్పించడం తన సత్తా చాటుకోవడానికే. ఇక అధికారంలోకి వచ్చాక కూడా తన గ్రాఫ్ పడిపోకూడదనే లక్ష్యంతో ఉప ఎన్నికలను కూడా జనరల్ ఎలక్షన్లంతా సీరియస్ గా తీసుకుంటున్నాడు.

ఏం చేసైనా సరే గెలవడమే ఆయన టార్గెట్. గెలవడం కోసం ఎంత దూరమైనా వెళతాడు. ఉప ఎన్నికలో ఓడిపోయినంత మాత్రాన ఆయన ప్రభుత్వం పడిపోదు. కానీ ఉప ఎన్నికల్లోనైనా సరే టీఆర్ఎస్ ఓడిపోతే ప్రతిపక్షాలు రెచ్చిపోతాయి. తన అహం దెబ్బ తింటుంది. తన ఆధిపత్యం బీటలు వారుతుంది. ఇదీ ఆయన భయం. అందుకే చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలనేది కేసీఆర్ సిద్ధాంతం. అందుకోసం ఆయన ఏ దారినైనా ఎంచుకుంటాడు. హుజూరాబాద్ లో గెలవకపోతే కేసీఆర్ పరువు పోతుంది. 

తాను మెడ పట్టి బయటకు గెంటేసినోడు తన పార్టీని ఓడగొడితే అంతకంటే అవమానం ఉండదు కదా. ఇదీ ఆయన భయం. ఇప్పటికే కేసీఆర్ ఎన్నో పథకాలు అమలు చేస్తున్నాడు. గొప్పగా ప్రచారం చేసుకుంటున్నాడు. ఇంత చేస్తున్నా ప్రజలు టీఆర్ఎస్ ను ఓడిస్తారనే భయం ఉంది. అందుకే దళితుల ఓట్లను ఆకర్షించడానికి దళిత బంధు పథకం తెచ్చాడు. కేసీఆర్ దళిత బంధు పథకాన్ని తీసుకొస్తున్నట్టు ప్రకటించిన తర్వాత గులాబీ గ్యాంగ్ పాలాభిషేకాలు చేస్తున్న వీడియోలు బాగా వైరల్ అయ్యాయి. 

దళిత మేధావులంతా కేసీఆర్ ను పొగిడారు. అద్భుత పథకమన్నారు. వాస్తవానికి ఈ పధకంలో ప్రత్యేకత ఏమీలేదు. డబ్బులు పంచుడే. నిజానికి ఈ డబ్బులు పంచే పథకాన్ని ఎప్పుడో చేయొచ్చు. కానీ హుజూరాబాద్ ఎన్నిక సమయంలోనే చేశాడు. ఈ పథకం ప్రకటించగానే ఇది ఉప ఎన్నిక కోసమే తెచ్చిన పథకమని ప్రతిపక్షాలు గ్రహించాయి. కానీ చివరకు కేసీఆర్ ఏ మూడ్ లో వున్నాడోగానీ ఈ పథకాన్ని హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే తెచ్చానని తెగించి చెప్పేశాడు.

“హుజురాబాద్‌లో ఎలక్షన్ ఉందని దళిత బంధు పెట్టారంటూ విమర్శలు వస్తున్నయి. ఎన్నికల కోసమే పెట్టారని అంటున్నరు. ఎన్నికలుంటే పెట్టమా మరి! ఎందుకు పెట్టం? టీఆర్ఎస్ ఏమన్నా సన్నాసుల మఠమా? డెఫినెట్‌గా ఇది రాజకీయ పార్టే. కచ్చితంగా స్కీం పెడితే రాజకీయ లాభం కోరుకుంటం. వంద శాతం అంతే. అధికారంలో ఉన్నం కాబట్టి పెడతం. ఈ స్కీమ్‌ను ఏడనో ఒక చోట పెట్టాల్సిందే. రైతుబంధు లాగనే ఇప్పుడు హుజురాబాద్‌లోనే దళితబంధును పెడుతున్నం” -అంటూ కుండా బద్దలు కొట్టారు కేసీఆర్.

'ఏమీ చేయనోడు లాభం జరగాలని కోరుకున్నప్పుడు ఆ పథకాన్ని ప్రవేశపెట్టి లాభం జరగాలని ఎందుకు కోరుకోకూడదు?' అని వ్యాఖ్యానించారు.ఎన్నడూ లేని విధంగా దళితులపై వరాల వర్షం కురిపించడాన్ని చూసి ప్రజలు తెగ నవ్వుకుంటున్నారని కేసీఆర్ ప్రత్యర్థులు విమర్శలు చేస్తున్నారు. అధికారంలోకి  వచ్చిన మొదటి రోజే దళిత ముఖ్యమంత్రి హామీని తుంగలో తొక్కి పీఠమెక్కిన కేసీఆర్.. ఏడేళ్ల తర్వాత నిద్రలేచి దళిత బంధు పథకంతో వారికి ఎరవేస్తున్న వైనాన్ని చూసి గతాన్ని గుర్తు చేసుకుంటున్నారు.

కారణం చెప్పకుండా ఓ దళిత డిప్యూటీ సీఎంని అవమానించి, అర్ధాంతరంగా కేబినెట్ నుంచి బయటకు పంపినప్పుడు “దళిత బంధు” గుర్తుకు రాలేదా అని ప్రశ్నిస్తున్నారు. దళితులకు మూడెకరాల భూమి పంపిణీ హామీ గుర్తు చేస్తున్నారు. ఏది ఏమైనా, ఉప ఎన్నిక వచ్చినా ఏదో ఒక పథకం వస్తుందని ప్రజలకు తెలిసింది. ఈ పథకం అధికార పార్టీలు ఎంతవరకు ప్రయోజనం కలిగిస్తుందో చూడాలి.