తెలంగాణలో ఇతర పార్టీల నుంచి టీఆర్ఎస్ పార్టీలో చేరిన వారంతా కామన్ గా ఒకటే కథ వినిపిస్తారు. కూడబలుక్కునట్లు ఒక విధమైన కథే వినిపిస్తారు. ఇదే ఆవు కథ. ఇతర పార్టీల వారు టీఆర్ఎస్ లో చేరడానికి అనేక కారణాలు ఉంటాయి. కానీ అవి బయటకు చెప్పరు. నిజానికి టీఆరెస్ పార్టీ నాయకుల్లో ఒరిజినల్ టీఆర్ఎస్ నాయకులు తక్కువనే చెప్పుకోవాలి.
తెలంగాణా ఉద్యమ నాయకులూ తక్కువే. బంగారు తెలంగాణా బ్యాచే ఎక్కువ. ఇలాంటి నాయకులను ప్రతిపక్ష నాయకులు, టీఆర్ఎస్ వ్యతిరేక మీడియా బీటీ బ్యాచ్ అని అంటూ ఉంటారు.
బీటీ బ్యాచ్ అంటే రాష్ట్రాన్ని బంగారు తెలంగాణా చేయడం కోసమే టీఆర్ఎస్ లో చేరామని చెప్పుకునే నాయకులన్న మాట. అలాంటి నాయకుల్లో తాజాగా బీజేపీ నుంచి గులాబీ పార్టీలో చేరిన నాయకుడు ఇనగాని పెద్ది రెడ్డి. ఒకప్పుడు టీడీపీలోని సీనియర్ నాయకుల్లో ఒకడు.
టీడీపీ హయాంలో మంత్రిగా కూడా పనిచేశాడు. ఆ పార్టీ నుంచి బీజేపీలో చేరాడు. ఈటల బీజేపీలో చేరినప్పటినుంచి పెద్ది రెడ్డి రగిలిపోతున్నాడు. ఈటలది, పెద్దిరెడ్డిది ఒకటే జిల్లా. హుజూరాబాద్ కు ఉప ఎన్నిక వస్తుందని పెద్దిరెడ్డి అనుకోలేదు.
ఈటల రాజీనామా కారణంగా ఉప ఎన్నిక వచ్చింది. ఆ స్థానంలో తనను పోటీ చేయిస్తారని అనుకున్నాడు. వాస్తవానికి అది ఈటల నియోజకవర్గం. కాబట్టి ఆయన్నే పోటీ చేయించాలని పార్టీ నిర్ణయించింది. అప్పటినుంచి పెద్ది రెడ్డి మండిపడుతున్నాడు. తనతో సంప్రదించకుండా ఈటలను పార్టీలో ఎలా చేర్చుకుంటారని ప్రశ్నించాడు.
చివరకు పెద్దిరెడ్డికి కోపం ముదిరిపోయి గులాబీ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నాడు. చాలా కాలం నుండి కేసిఆర్ తనను ఆహ్వానిస్తున్నారని చెప్పాడు పెద్దిరెడ్డి. మంత్రి వర్గం నుండి తొలగించినా ఈటల ఎమ్మెల్యేగా రాజీనామా చేయకుండా కొనసాగి ఉంటే ఉప ఎన్నిక వచ్చేది కాదన్నాడు.
నియోజకవర్గ అభివృద్ది, ప్రజల శ్రేయస్సు కోసమే తాను టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నట్లు చెప్పాడు. అధికార టీఆర్ఎస్ గెలిస్తేనే నియోజకవర్గంలో అభివృద్ధి జరుగుతుందని, ఈటల గెలిస్తే అభివృద్ధి కుంటుపడుతుందని, ప్రజలు నష్టపోతారని చెప్పుకొచ్చాడు.
ఎటువంటి హామీ లేకుండా టీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నాననీ, పార్టీ ఏ బాధ్యత అప్పగించినా కార్యకర్తగా పని చేస్తానని అన్నాడు. పార్టీ ఎవరికి టికెట్ ఇచ్చినా గెలుపునకు కృషి చేస్తానని పెద్దిరెడ్డి చెప్పాడు. టికెట్ కోసం పార్టీలో చేరడం లేదనీ, బీజేపీలో ఇమడలేకనే టీఆర్ఎస్ లో చేరుతున్నానని చెప్పాడు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విధానపరమైన విషయాల్లో అధికార పక్షంపై విమర్శలు చేశానని అన్నాడు. బీజేపీ పట్ల తనకు ఎటువంటి ద్వేష భావం లేదనీ, జాతీయ పార్టీగా గౌరవిస్తామని చెప్పాడు. నియోజకవర్గంలో అభివృద్ధి కొనసాగాలంటే అధికార పార్టీ అభ్యర్థే గెలవాలని, ఈ విషయాన్ని ప్రజల్లోకి తీసుకువెళతామని చెప్పాడు.
ఈటల గెలిస్తే అధికార పార్టీపై గెలిచానని గొప్పగా చెప్పుకోవచ్చుగానీ తప్ప నియోజకవర్గానికి జరిగే ప్రయోజనం ఉండదని అన్నాడు. పెద్ది రెడ్డి కూడా ఆవు కథ చెప్పేసి బంగారు తెలంగాణా బ్యాచ్ లో చేరిపోయాడు.