సహజంగా ప్రేమ అంగీకరించలేదని ప్రియురాలిపై ప్రియుడు కత్తితో లేదా యాసిడ్ దాడికి పాల్పడటాన్ని మీడియా ద్వారా తెలుసుకుంటుంటా. కానీ తనను పెళ్లి చేసుకోవాలని ఓ యువకుడిని యువతి ఒత్తిడి చేయడం, తన ప్రతిపాదనను తిరస్క రించిన కారణంగా ఆ యువతి కత్తితో దాడికి తెగబడడం సంచలనం రేకెత్తిస్తోంది. ఈ సంఘటన కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజ కవర్గం చల్లపల్లి మండలం వక్కలగడ్డ గ్రామంలో సోమవారం సాయంత్రం చోటు చేసుకుంది.
మచిలీపట్నానికి చెందిన మాగంటి నాగలక్ష్మి ఓ ప్రైవేట్ జూనియర్ కళాశాలలో లెక్చరర్. గూడూరుకు చెందిన గొరిపర్తి పవన్ కుమార్ పెడన తహసీల్దార్ కార్యాలయంలో ఔట్ సోర్సింగ్ విభాగంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా పని చేస్తున్నాడు. రెండేళ్ల క్రితం వీళ్ల మధ్య పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా పవన్‌పై నాగలక్ష్మి మనసులో ప్రేమగా మారింది. అతనంటే బాగా ఇష్టాన్ని పెంచుకుంది.
దీంతో కొంత కాలంగా తనను పెళ్లి చేసుకోవాలని పవన్‌కుమార్‌పై నాగలక్ష్మి ఒత్తిడి తెస్తోంది. ఇంట్లో ఒప్పుకోరనే కారణం చెబుతూ ఆమె ప్రతిపాదనను తిరస్కరిస్తూ వస్తున్నాడు. అయితే ఆమె మాత్రం పట్టు వీడలేదు. ఒకసారి కలిసి మాట్లాడుకుందామంటూ అతనికి ఫోన్ చేసింది. అనంతరం చల్లపల్లి మండలం వక్కలగడ్డలోని తన స్నేహితురాలి ఇంటికి పవన్‌కుమార్‌ను నాగలక్ష్మి వెంట తీసుకెళ్లింది.
ఆ ఇంట్లో కూడా మళ్లీ తనను పెళ్లి చేసుకోవాలని నాగలక్ష్మి గొడవకు దిగింది. పవన్‌కుమార్ ససేమిరా అన్నాడు. దీంతో తీవ్ర ఆగ్రహానికి లోనైన నాగలక్ష్మి ఒక్కసారిగా కత్తి తీసి అతనిపై దాడికి పాల్పడింది. ఆపై తానూ నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. వీళ్లిద్దరి కేకలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఘటన స్థలానికి చేరుకున్న చల్లపల్లి పోలీసులు అపస్మారక స్థితిలో ఉన్న నాగలక్ష్మినీ, గాయాలతో ఉన్న పవన్‌కుమార్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే నాగలక్ష్మి పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మచిలీపట్నం ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
పిచ్చిగా ప్రేమించిన వ్యక్తి తనను పెళ్లి చేసుకునేందుకు అంగీకరించని కారణంగా చివరికి ప్రాణాలు తీసేందుకు కూడా వెనుకాడని పరిస్థితి. అలాగే తన ప్రాణాలను కూడా తీసుకునేందుకు ఏ మాత్రం ఆలోచించని యువతిని చూశాం. జీవితం అంటే ప్రేమ ఒక్కటే కాదని ఒక్క నిమిషం ఆలోచించినా ఇలాంటి పనికి లెక్చరర్ అయిన నాగలక్ష్మి పాల్పడి ఉండేది కాదు.