చంద్రబాబు పాలన గుర్తు మరొకదాన్ని వైసీపీ ప్రభుత్వం చెరిపివేసింది. వైఎస్ కుటుంబానికి కట్టప్పగా చెప్పుకునే తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి ఆ పనిని విజయవంతంగా చేశారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమల, తిరుచానూరుకు ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు హయాంలో తిరుపతిలో ప్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు.
తిరుపతి స్మార్ట్ సిటీ, టీటీడీ సంయుక్త ఆధ్వర్యంలో 2018లో వారధి ప్రాజెక్టు కార్యాచరణకు నోచుకుంది. రూ.684 కోట్ల బడ్జెట్తో తిరుచానూరు మార్కెట్ యార్డు నుంచి కపిలతీర్థం వరకు 7 కి.మీ పొడవుతో ప్లైఓవర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. ఈ నిర్మాణం గరుడ వారధిగా ప్రాచుర్యం పొందింది. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలివేటెడ్ స్మార్ట్ కారిడార్ పేరిట వారధికి శంకు స్థాపన చేశారు. అయితే చంద్రబాబు పాలనకు సంబంధించి ఏ ఒక్క ఆనవాలు ఉండకుండా చేయాలని జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే అనధికార పాలనాపరమైన నిర్ణయంగా తీసుకుంది.
ఈ నేపథ్యంలో అందర్నీ ఆకర్షించే తిరుపతిలోని గరుడ వారధి ఇకపై కొత్త పేరుతో పిలిపించుకోనుంది. ఇంత వరకూ ఆ నిర్మాణానికి అధికారికంగా ఎలాంటి పేరు లేకపోవడంతో, తాము నామకరణం చేస్తున్నట్టు జగన్ ప్రభుత్వం ప్రకటిస్తోంది. ఈ క్రమంలో మంగళవారం తిరుపతి కార్పొరేషన్ పాలక మండలి సదరు వంతెనకు శ్రీనివాసుసేతు అనే నామకరణం చేయడం విశేషం. ఈ మేరకు తిరుపతి కార్పొరేషన్ కౌన్సిల్ సమావేశంలో తీర్మానించారు. దీనిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
శ్రీమహావిష్ణువు వాహనమైన గరుత్మంతునిపై ఇతరులు ప్రయాణం సాగించడమనే భావన… ఆ దేవదేవుని అవమానించినట్టేనని తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి అభిప్రాయం. త్రేతాయుగంలో సీతను రావణుని నుంచి రక్షించడానికి శ్రీరాముడు వానరసేన సహాయంతో వారధి నిర్మించారని, దానికి రామసేతు అని పేరు పెట్టారని భూమన తెలిపారు. ఆ స్ఫూర్తితో ప్రస్తుతం కష్టాలతో కలియుగ దైవం వేంకటేశ్వరస్వామి దర్శనానికి వస్తున్న భక్తులను ఆయన చెంతకు చేర్చడానికి శ్రీనివాస సేతు అని నామకరణ చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
ఈ నేపథ్యంలో సాక్ష్యాత్తు భగవంతుని పేరే పెట్టామని ఆయన చెప్పుకొచ్చారు. ఈ వంతెనకు ఎక్కడా వ్యక్తుల పేర్లు పెట్టకపోవ డాన్ని గుర్తించుకోవాలని ఆయన కోరారు. అంతే తప్ప, ఇందులో చంద్రబాబు పాలన గుర్తులను చెరిపేసే ప్రశ్నే ఉత్పన్నం కాదని స్పష్టం చేశారు.