ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్న కరోనా వైరస్ మాట వింటే చాలు ప్రతి ఒక్కరూ వణికిపోతున్నారు. కంటికి కనిపించని ఆ సూక్ష్మజీవి అంతమెన్నడో, ఈ సమస్యకు పరిష్కారం ఎన్నడో తెలియక సామాన్యులు మొదలుకుని కుబేరుల వరకు బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతున్నారు. కరోనాకు మందు లేకపోవడంతో, దానికి దూరంగా ఉండటం ఒక్కటే పరిష్కార మార్గమని ప్రతి ఒక్కరూ హెచ్చరిస్తున్నారు. అందుకే కేంద్రప్రభుత్వం జనాలను కట్టడి చేసేందుకు లాక్డౌన్ ప్రకటించింది. అయినా జనసంచారం ఆగడం లేదు.
ఈ నేపథ్యంలో ఏసియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ చైర్మన్, ప్రముఖ జీర్ణకోశ వ్యాధి నిపుణులు డాక్టర్ నాగేశ్వరరెడ్డి చాలా విలువైన విషయాలను చెబుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు ధైర్యాన్ని నూరిపోస్తున్నారు. వివిధ మాధ్యమాల ద్వారా ఆయన చెబుతున్న అంశాలు వైరల్ అవుతున్నాయి. భారత్ మీద కరోనా మిగిలిన దేశాలతో పోల్చుకుంటే పెద్ద ప్రభావం చూపకపోవచ్చని చెబుతున్నారు. అంతేకాదు కరోనా జన్యువులో సానుకూల మార్పు కూడా మనకు కలిసి వచ్చే అంశమని ఆయన చెబుతుండటంతో మన వాళ్లు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇంకా ఆయన ఏమేమి చెబుతున్నారంటే…
కరోనా వైరస్ కొమ్ములు బాధితుల శరీరంలోని లోపల కణాలకు అంటుకోవడం లేదని, ఇది మన భారతీయులకు ఎంతో రిలీఫ్ ఇచ్చే విషయమన్నారు. భారత్, చైనా, అమెరికా, ఇటలీలోని కరోనా వైరస్ జన్యువు పరిణామంపై పరిశోధనలు జరిపారన్నారు. ఒక్క ఇటలీ మినహా మిగిలిన మూడు దేశాల్లోని జన్యువులు దాదాపు ఒకేలా ఉన్నట్టు తేలిందన్నారు. ఇటలీలో మాత్రం జన్యు పరిణామ క్రమంలో మూడు విధాలుగా మార్పు కనిపించినట్టు డాక్టర్ నాగేశ్వరరెడ్డి వివరించారు.
అందువల్లే ఇటలీలో ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉందన్నారు. అయితే మన దేశంలో మాత్రం కరోనా జన్యు పరిణామ క్రమంలో మార్పు సానుకూలంగా ఉందన్నారు. ఢిల్లీలోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ జీనోమిక్ సైన్స్ శాస్త్రవేత్తలు భారత్‌లోని వైరస్ జీనోమ్ మొత్తాన్ని అధ్యయనం చేశారన్నారు. ఈ వైరస్‌లో కొమ్ముల్లాంటి భాగంలో అసాధారణ పరిణామ క్రమం జరగడం వల్ల అది భారతీయుల శరీర అంతర్భాగాల్లోకి చొచ్చుకెళ్లలేక పోతోందన్నారు. ఇది మన అదృష్టమన్నారు.
అంతేకాకుండా భారతీయుల రోగ నిరోధక శక్తి ఎక్కువన్నారు. దీనికి తోడు ఇక్కడి ఉష్ణోగ్రతలో వేడి ఉండటం కూడా వైరస్ వ్యాప్తిని నిరోధించగలుగుతోందన్నారు. వీటికి తోడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పకడ్బందీగా లాక్డౌన్ పాటించడం కూడా కరోనా వ్యాప్తిని కంట్రోల్ చేయగలిగాయన్నారు.
ఇతర దేశాల్లో మరణాలతో పోల్చుకుంటే మనదేశంలో రెండు శాతం చావులుండవచ్చని ఓ అంచనా అని ఆయన చెప్పారు. కానీ తన లెక్క ప్రకారం మనదేశంలో మరణాల శాతం కేవలం 0.9 మాత్రమే అని ఆయన తెలిపారు. కరోనా గురించి భయపడనవసరం లేదని, ముందు జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి ఒక్కరూ సాధారణ జీవితం గడపవచ్చన్నారు.
సామాజిక దూరం అనడం సరైంది కాదని డాక్టర్ నాగేశ్వరరెడ్డి అన్నారు. దీన్ని భౌతిక దూరం అని పిలవాలని ఆయన సూచించారు. చేతులు ఎప్పుడూ శుభ్రం చేసుకుంటూ…ఇప్పట్లాను భౌతిక దూరం పాటించాలని ఆయన కోరారు. దీనివల్ల కరోనా సామాజిక వ్యాప్తిని అరికట్టవచ్చన్నారు.
ఇటీవల అమెరికాలోని మాసాచుసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్లు విడుదల చేసిన పత్రంలో చాలా విలువైన అంశాలున్నాయన్నారు. 32 డిగ్రీల కంటే ఎక్కువ ఉష్ణోగ్రత ఉంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందే అవకాశం తక్కువ ఉంటుందన్నారు. అయినంత మాత్రాన పూర్తిగా పోతుందని కూడా చెప్పలేమని వెల్లడించారన్నారు. ఎండాకాలంలో తగ్గిపోయినా….తిరిగి వాతావరణంలో మార్పులు వస్తే వెంటనే తన ప్రతాపం చూపుతుందని ఆ పరిశోధన పత్రంలో తేల్చి చెప్పారన్నారు. అయితే వచ్చే ఏడాదికి టీకా వస్తుందని, అంత వరకు జాగ్రత్తలు తప్పని సరి అని ఆయన హెచ్చరించారు.
కరోనా వైరస్ అనేది గాలి ద్వారా ఎట్టి పరిస్థితుల్లోనూ వ్యాప్తి చెందదని ఆయన చెప్పారు. ప్లాస్టిక్, స్టీల్, సెల్‌ఫోన్‌పై 48 నుంచి 72 గంటల వరకు ఉంటుందన్నారు. అందువల్ల సెల్‌ఫోన్‌ను శానిటైజర్స్‌తో ఎప్పటికప్పుడు శుభ్రపరచుకోవాలని ఆయన సూచించారు.