అప్పుడు షరీఫ్.. ఇప్పుడు రమేష్.. ఏందబ్బా ఇది

“విచక్షణాధికారం.. ఏందబ్బా ఇది. ఈమధ్య ఈ విచక్షణాధికారాలు ఎక్కువయ్యాయి. ఎవరికి నచ్చింది వారు చేసుకుంటున్నారు”. Advertisement జగన్ ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ లో చాలా అర్థం దాగుంది. ఇలా విచక్షణాధికారం పేరిట గతంలో…

“విచక్షణాధికారం.. ఏందబ్బా ఇది. ఈమధ్య ఈ విచక్షణాధికారాలు ఎక్కువయ్యాయి. ఎవరికి నచ్చింది వారు చేసుకుంటున్నారు”.

జగన్ ఇచ్చిన ఈ స్టేట్ మెంట్ లో చాలా అర్థం దాగుంది. ఇలా విచక్షణాధికారం పేరిట గతంలో జరిగిన ఓ సంఘటన వల్ల తాను ఎంత ఇబ్బంది పడ్డాననే విషయాన్ని కూడా పరోక్షంగా గుర్తుకుతెచ్చారు జగన్.  మూడు రాజధానుల బిల్లుని శాసన మండలి సెలక్ట్ కమిటీకి పంపే సందర్భంలో కూడా ఈ విచక్షణాధికారం అనే మాట వినపడింది. తనకున్న విచక్షణాధికారం మేరకు మండలి చైర్మన్ షరీఫ్, బిల్లుని సెలక్ట్ కమిటీకి పంపిస్తున్నానని చెప్పారు.

ఆ నిర్ణయంపై జగన్ కు కాలి ఏకంగా మండలినే రద్దుచేస్తూ అసెంబ్లీలో తీర్మానం చేసి పార్లమెంట్ ఆమోదం కోసం పంపారు. అప్పుడు షరీఫ్ “విచక్షణాధికారం” జగన్ ని ఎంతలా ఇబ్బంది పెట్టిందో… ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ విచక్షణాధికారం కూడా అంతే అసహనానికి గురి చేసింది. అందుకే తొలిసారి ప్రెస్ మీట్ పెట్టి మరీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.

ముఖ్యమంత్రిని కాదని, 151మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్న ప్రభుత్వాన్ని కాదని, ఇలా ఎవరికి వారు నిర్ణయాలు తీసుకుంటూ పోతే, ఇక సీఎం ఎందుకు అని ప్రశ్నించారు. నిజమే. ఐదేళ్లు మమ్మల్ని పాలించండి, మీరే అధికారంలో ఉండండి, మీ నిర్ణయాలతో ప్రభుత్వాన్ని నడపండి అని వైసీపీకి ఓట్లేసి గెలిపించారు ప్రజలు. మరి ప్రజల కోసం తీసుకునే నిర్ణయం ఏదైనా ఈ ప్రజా ప్రతినిధులకు తెలిసే జరగాలి కదా. ప్రజల ఓట్లతో గెలిచిన శాసన సభ చేసిన తీర్మానాన్ని కుతంత్రంతో అడ్డుకునే అధికారం మండలికి ఎక్కడిది. పోనీ ఇప్పుడు రమేష్ కుమార్ చేసిందేమైనా సబబుగా ఉందా. కనీసం తమకు సమాచారం ఇవ్వకుండా ఏకపక్షంగా ఎన్నికల్ని వాయిదా వేయడం ఏంటనేది సీఎం ప్రశ్న.

ఆరోగ్యశాఖ కార్యదర్శిని అయినా సంప్రదించకుండా రాష్ట్రంలో కరోనా ప్రభావాన్ని ఎన్నికల కమిషనర్ ఎలా అంచనావేశారనేదే జగన్ లేవనెత్తిన పాయింట్. వీటన్నిటినీ పక్కనపెట్టి విచక్షణాధికారం అనే పదం వాడి.. జగన్ కి మరింత ఆగ్రహం తెప్పించారు. ఈ రెండు విషయాల్లోనూ సీఎం జగన్ తీవ్ర అసహనానికి గురయ్యారు. ప్రజాభీష్టం మేరకు పనులు జరక్కుండా వ్యవస్థలు అడ్డుకోవడం సరికాదని అన్నారు. అందుకే ఏందబ్బా ఈ విచక్షణాధికారం అంటూ ప్రెస్ మీట్లో మండిపడ్డారు జగన్మోహన్ రెడ్డి.

ఎలక్షన్ అధికారిపై జగన్ ఫైర్.