మరో రెండేళ్లలో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ సమీకరణలు మారుతున్నాయి. ఎప్పట్లాగే వైసీపీ పొత్తుల్లేకుండానే ఎన్నికల బరిలో నిలవనుంది. జగన్‌ను ఢీకొట్టాలంటే అందరూ ఏకం కావాలని జనసేనాని పవన్‌కల్యాణ్ ఇటీవల బహిరంగంగానే ప్రకటించారు. అందరూ ఏకం కావాలనే పిలుపుపై టీడీపీ మినహా మిగిలిన ప్రతిపక్షాల నుంచి సానుకూల స్పందన రాలేదు.
రానున్న ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసి ప్రయాణించడం దాదాపు ఖాయమైందనే విస్తృత చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ, జనసేన ఎన్నెన్ని సీట్లలో పోటీ చేస్తుందనే అంశంపై భిన్నవాదనలు వినిపిస్తున్నాయి. జగన్‌ను అధికారం నుంచి దించేందుకు త్యాగాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చిన నేపథ్యంలో జనసేన ఎక్కువ సీట్లు ఆశించదనే చర్చ కూడా జరుగుతోంది. ఇదే సందర్భంలో మరో ఆసక్తికర అంశం తెరపైకి వచ్చింది.
జనసేనాని పవన్‌కల్యాణ్ మనసు స్థిరంగా ఉండదని, ఎప్పుడెలా వ్యవహరిస్తారో ఆయనకే తెలియదని బాబు అనుమానిస్తున్నారని సమాచారం. అందువల్ల భవిష్యత్‌లో ఇబ్బందులు తలెత్తకుండా చంద్రబాబు మాస్టర్ ప్లాన్ వేస్తున్నట్టు తెలిసింది. జనసేనకు కేటాయించే 25 లేదా 30 సీట్లలో కూడా మెజార్టీ వంతు తమ నాయకులనే నిలబెట్టాలనే ఎత్తుగడకు చంద్రబాబు తెరలేపారని అత్యంత విశ్వసనీయ సమాచారం.
ఏదో ఒక సాకుతో జనసేనలోకి తమ పార్టీ నుంచి పంపి, పోటీ చేయించాలనే కోణంలో చంద్రబాబు కసరత్తు ప్రాంభించారని తెలిసింది. తమ పార్టీలో టికెట్ ఇవ్వరనే ప్రచారం చేసి, అటు వైపు పంపి, అక్కడ టికెట్ దక్కించుకునే ప్లాన్ చేస్తున్నట్టు తెలిసింది.
దీంతో ఒక్క దెబ్బకు రెండు పిట్టలనే చందంగా, సొంత వాళ్లకే జనసేనలో టికెట్ ఇప్పించుకోవడంతో పాటు నమ్మకమైన నాయకులను పక్క పార్టీలో పెట్టుకున్నట్టు అవుతుందని చంద్రబాబు భావన. చంద్రబాబు రాజకీయాలను మొదటి నుంచి గమనిస్తున్న వాళ్లు… తాజా ప్లాన్ కొత్తేమీ కాదని అంటున్నారు.
బీజేపీ లాంటి పార్టీలోకి తన వాళ్లను పంపి, ఇప్పటికీ తన ఎజెండానే జాతీయ పార్టీ మోస్తున్న విషయాన్ని రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. 2014లో తన సామాజిక వర్గానికి చెందిన నాయకుడిని బీజేపీ తరపున గెలిపించుకుని, ఆ తర్వాత మిత్రపక్షం కోటాలో మంత్రి పదవి ఇవ్వడాన్ని మరికొందరు గుర్తు చేస్తున్నారు.
జాతీయ పార్టీనే బోల్తా కొట్టిస్తున్న చంద్రబాబుకు, జనసేన ఓ లెక్కా? అనే మాట వినిపిస్తోంది. కావున రానున్న రోజుల్లో జనసేన తరపున కూడా 80 శాతం టీడీపీ నేతలే పోటీ చేస్తారనేది వాస్తవం. చంద్రబాబుతో పొత్తా, మజాకా? హీరో పవన్‌కల్యాణ్‌కే సినిమా చూపించగల ఘనుడు చంద్రబాబు అని మరికొందరు అంటున్నారు.