కరోనాతో ఫారిన్ ముచ్చట పూర్తిగా తీరిపోయింది. బతికుంటే బడ్డీకొట్టు పెట్టుకుని బతకొచ్చంటూ చాలామంది సొంత ప్రాంతాలకు తిరిగొచ్చేశారు, ఇక హైదరాబాద్ కలలు కూడా దారుణంగా కరిగిపోయాయి. లాక్ డౌన్ ఎత్తేసే వరకు హైదరాబాద్ లో చిక్కుకుపోయిన చాలామంది, రవాణా పెరిగాక సొంతూళ్లకు వచ్చేశారు. స్కూళ్లు, కాలేజీలు, స్టడీ సెంటర్లు లేకపోవడంతో విద్యార్థులెవరూ ఇప్పుడు హైదరాబాద్ లో లేరు. అలా హాస్టళ్లు, బ్యాచిలర్స్ రూమ్స్, మెస్ లు అన్నీ ఖాళీ అయిపోయాయి.
నెల రోజులుగా కుటుంబాలకు కుటుంబాలే భాగ్యనగరం నుంచి తరలిపోతున్నాయి. తెలంగాణ పల్లెల నుంచి హైదరాబాద్ వలస వచ్చి ఉండిపోయినవారంతా ఇప్పుడు సొంతూళ్లకు వెళ్లిపోతున్నారు. ఉద్యోగం ఉన్నోళ్లు, జీతాలిచ్చే కంపెనీళ్లు పనిచేసేవాళ్లు మినహా.. చిరు వ్యాపారులు, లాక్ డౌన్ తో మూతపడిన కంపెనీల్లో పనిచేసేవారంతా.. తిరిగి ఏపీకి వచ్చేస్తున్నారు.
దీంతో భాగ్యనగరంలో టు-లెట్ బోర్డులు ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. వలస జీవులు ఎక్కువగా ఉండే వనస్థలిపురం, ఎల్బీనగర్, ఈఎస్ఐ, కూకట్ పల్లి, పటాన్ చెరు వంటి ప్రాంతాల్లో ప్రతి పది పోర్షన్లలో ఐదింటి ముందు టు-లెట్ బోర్డులు కనిపిస్తున్నాయి. కొంతమంది రెంట్లు తగ్గించేయడంతో.. అటు ఇటు మారేవారి సంఖ్య బాగా పెరిగింది. మరికొంతమంది భార్యా పిల్లల్ని సొంతూళ్లకు పంపించి.. చిన్న చిన్న రూమ్స్ లోకి అడ్జస్ట్ అయిపోతున్నారు. దీంతో చాలా ఇళ్లు ఖాళీ అవుతున్నాయి.
అప్పు చేసి హైదరాబాద్ లో ఇల్లు కట్టినా.. అద్దెలతో ఈఎంఐ కట్టుకోవచ్చనే భరోసా ఉండేది. కానీ కరోనా దెబ్బతో ఇలాంటివారందరూ పూర్తిగా మోసపోయారు. ఇళ్లు ఖాళీ అయిపోవడంతో.. ఈఎంఐలు కట్టలేక చాలామంది హౌజ్ ఓనర్లు ఇబ్బందులు పడుతున్నారు.
ఏ ఉపద్రవం జరుగుతుందని భయపడి.. భాగ్యనగరంలో కరోనా లెక్కలపై ప్రభుత్వం గుంభనంగా ఉందో.. ఆ ప్రమాదం ఇప్పుడు ముంచుకొచ్చేసింది. నిన్నమొన్నటి వరకూ పరీక్షలు చేయకుండా మేనేజ్ చేస్తూ వచ్చిన సర్కారు, అనివార్యంగా కరోనా టెస్ట్ ల సంఖ్య పెంచింది. దీంతో రోగుల సంఖ్యా పెరుగుతోంది. ఉత్తరాదిలో ఢిల్లీ, ముంబై తరహాలో.. దక్షిణాదిన కరోనా బాధిత నగరాల్లో హైదరాబాద్ కూడా చేరిపోయింది. దీంతో ఇప్పటివరకు నగరంలో ఉన్న కుటుంబాలు కూడా ఇప్పుడిప్పుడే తట్టాబుట్టా సర్దేస్తున్నాయి.