తిరుపతిలో జనసేనది విచిత్ర పరిస్థితి. ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడా లేని విధంగా తిరుపతిలో జనసేనకు బలమైన కేడర్ ఉంది. కానీ నాయకుల కొరత పీడిస్తోంది. జనసేనాని పవన్‌కల్యాణ్ నిలకడలేని తనం కూడా ఆ పార్టీ వైపు బలమైన నాయకులు వెళ్లేందుకు భయపడుతున్నారు. అంగట్లో అన్నీ ఉన్నా అల్లుని నోట్లో శని అనే చందంగా తిరుపతిలో జనసేన పరిస్థితి తయారైంది.
పవన్ రాజకీయ పంథా అర్థం కాకపోవడంతో కొందరు కాపు నాయకులు ఎటూ తేల్చుకోలేక సందిగ్ధంలో ఉన్నారు. కొందరు కాపు నాయకులు మనసు చంపుకుని టీడీపీలో కొనసాగుతున్నారు. ప్రజారాజ్యం అధినేత ,మెగాస్టార్ చిరంజీవి 2009లో తిరుపతి, పాలకొల్లులో పోటీ చేసిన సంగతి తెలిసిందే.
పాలకొల్లు చిరంజీవి అత్తగారి నియోజకవర్గం. నాలుగు దశాబ్దాలుగా చిరంజీవి సామాజిక వర్గం వారే అక్కడ గెలుపొందుతూ వచ్చారు. ఆ ధైర్యంతోనే ఆయన అక్కడ నిలబడ్డారు. కానీ చిరంజీవి విషయానికి వస్తే… అక్కడ ఓటమి మూటకట్టుకోవాల్సి వచ్చింది. కాంగ్రెస్ అభ్యర్థి బి.ఉషారాణి చేతిలో 5 వేలకు పైబడి ఓట్ల తేడాతో చిరంజీవి ఓటమి రుచి చూశారు.
ఇదే తిరుపతి విషయానికి వస్తే చిరంజీవి దాదాపు 16 వేల ఓట్లతో గెలుపొందారు. దీన్ని బట్టి మెగా బ్రదర్స్ సామాజిక వర్గం తిరుపతిలో ఎంత బలంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. అంతెందుకు 2019 ఎన్నికల్లో జనసేన తరపున నిలిచిన చదలవాడ కృష్ణమూర్తికి కూడా 12 వేల ఓట్లు వచ్చాయి. ఆ ఎన్నికల్లో ఆయన పెద్దగా ప్రచారం చేసిన దాఖలాలు కూడా లేవు.
తిరుపతిలో బలిజ సామాజిక వర్గానికి చెందిన ప్రముఖ నిర్మాత ఎన్వీ ప్రసాద్, టీడీపీ నాయకుడు వూకా విజయ్‌కుమార్, టీటీడీ మాజీ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ తదితరులు తమ సామాజికవర్గంలో మంచి పట్టు కలిగి ఉన్నారు. ఎన్వీ ప్రసాద్ సినీ రంగంపై ఎక్కువ శ్రద్ధ పెట్టడం వల్ల ఆయన రాజకీయంగా రాణించలేకపోతున్నారు.
ఇక వూకా విజయ్‌కుమార్ విషయానికి వస్తే సరైన వ్యక్తి అయినప్పటికీ, టీడీపీలో ఉండడంతో ఆయనకు తగిన ప్రాధాన్యం లభించడం లేదు. ఎంతసేపూ టీడీపీకి ఆయన ఉపయోగపడుతున్నారే తప్ప, తన నాయకత్వాన్ని బలోపేతం చేసుకునేందుకు సరైన పార్టీని ఎంచుకోలేదని బలిజలు వాపోతున్నారు. రైట్ పర్సన్…రాంగ్ పార్టీ అని బలిజలు అంటున్నారు.
చిన్నంగారి రమణ విషయానికి వస్తే… రాజకీయ ఆకాంక్ష ఉన్నప్పటికీ, తగిన నిర్ణయం తీసుకోవడంలో వెనకాముందూ ఆలోచి స్తున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇలాంటి వ్యక్తి జనసేనలో ఉంటే మాత్రం తిరుపతిలో కథ వేరేగా ఉంటుందని కార్యకర్తలు అంటున్నారు. ఇప్పటికే జనసేనలో ఉన్న హరిప్రసాద్ వల్ల పార్టీకి ఒనగూరిన ప్రయోజనం ఏదీ లేదని కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పార్టీని బలోపేతం చేసే ఏ ఒక్క చర్య హరిప్రసాద్ చేపట్టలేదని జనసేన కార్యకర్తలు విమర్శిస్తున్నారు. కిరణ్‌రాయల్ విషయానికి వస్తే… మీడియాలో సౌండ్ తప్ప, ఆయన పార్టీలో వెలుగు నింపుతున్న దాఖలాలు లేవంటున్నారు. ఈ నేపథ్యంలో పార్టీకి ఓ పెద్ద దిక్కు అంటూ వుంటే మాత్రం తిరుపతిలో మంచి ఫలితాన్ని ఆశించొచ్చని జనసేన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.
తిరుపతిలో పార్టీని నడిపించే జనసేనాని కావాలనేది కార్యకర్తలందరి మాట. ఆ దిశగా జనసేన అధిష్టానం ఆలోచించి తిరుపతిలో పరపతి పెంచుకునేందుకు దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది.