తిట్టు..తిట్టించుకో..ఇదే ట్రెండ్

ఆంధ్రలో భలే రాజకీయ సినిమా నడుస్తోంది. ఈ సినిమా టైటిల్..తిట్టు..తిట్టించుకో. ప్రస్తుతం ఆంధ్రలో క్రియాశీలక రాజకీయం నడవడం లేదు. కేవలం తిట్లు మాత్రమే. తెల్లవారితే ఎవరి మద్దతు పత్రికల్లో వారి తిట్లు పతాక శీర్షికల్లో…

ఆంధ్రలో భలే రాజకీయ సినిమా నడుస్తోంది. ఈ సినిమా టైటిల్..తిట్టు..తిట్టించుకో. ప్రస్తుతం ఆంధ్రలో క్రియాశీలక రాజకీయం నడవడం లేదు. కేవలం తిట్లు మాత్రమే. తెల్లవారితే ఎవరి మద్దతు పత్రికల్లో వారి తిట్లు పతాక శీర్షికల్లో రావాలి. పైగా మీడియాకు కూడా గాట్టిగా హెడ్డింగ్ పెట్టి బ్యానర్ లో వేయడానికి బలమైన తిట్లు కావాలి. 

కొడాలి నాని ఎప్పుడు ప్రెస్ మీట్ పెడతారా? మాంచి రంజుగా ఎప్పుడు మాట్లాడతారా? అని ఓ మీడియా చూస్తుంది. కొడాలి నానిపై ఎవరిని ఎగసం దోసి, నాలుగు మాటలు మాట్లాడనీయాలని మరో మీడియా చూస్తుంది.

లోకేష్ ను విజయసాయి తిడతారు. ఆయనపై లోకేష్ విమర్శలు లంకించుకుంటారు. మరోపక్క ఆ మూలన అవంతి శ్రీనివాస్ నేను వున్నాను అంటారు. నేను కూడా అంటూ వెల్లంపల్లి శ్రీనివాస్ గళం ఎత్తుతారు. 

మీరు ఇలా అంటారా అంటూ తేదేపా వైపు నుంచి అచ్చెం నాయుడో, యనమలో, ఉమానో, ఇలా పెద్ద తలకాయలు, పిల్ల తలకాయలు బయటకు లేస్తాయి. మధ్య మధ్యలో చంధ్రబాబు అసలు తాను అధికారంలో లేకపోవడంతో ఆంధ్ర అంతా ఎంత అధోగతిలోకి దిగిపోతోందో, జనాలు ఎంత అన్యాయం అయిపోతున్నారో? అంటూ తెగ వాపోతుంటారు. 

రైతులకు అన్యాయం జరుగుతోందంటారు. కానీ ఆయన కూడా జాతీయ స్థాయిలో రైతులు చేస్తున్న ఆందోళన గురించి పట్టించుకోరు. మధ్యలో అప్పుడప్పుడు పవన్ కళ్యాణ్ రంగంలోకి దిగుతుంటారు. 

ఎవరూ ఏమీ అనకుండానే తనను ఎవరూ ఏమీ చేయలేరంటారు. తనను ఎవరూ బెదిరించకుండానే తనకు తానే చెప్పుకుంటారు. ఎవరూ భయపడకపోయినా, తనంటే భయమని ఆయనకు ఆయనే అనేసుకుంటూ వుంటారు. ఈక్రమంలో ఆయన కూడా ఆయన స్టయిల్ లో కొన్ని తిట్లు విసురుతుంటారు.

ఇవన్నీ ఇలా వుంటే తామేం తక్కువ తినలేదంటూ భాజపా జనాలు అప్పుడప్పుడు ఒంటికాలి మీద లేస్తుంటారు. వాళ్లది మరీ చిత్రమైన వ్యవహారం. ఆ మధ్య ఎర్రచొక్కాల జనాలు కూడా కాస్త నోరు చేసుకునేవారు. కానీ ఈ మధ్య తగ్గించారు. 

ఈ తిట్టు, తిట్టించుకో స్కీములోకి రాని ఒకే ఒక్కడు వైఎస్ జగన్. ఆయన నెలకో, పక్షానికో ఓ సమావేశంలోనో, ఒపెనింగ్ లోనో మాట్లాడతారు. అప్పుడు తాను చెప్పాల్సినవి చెప్పేసి వదిలేస్తారు. ఆపై మళ్లీ టోటల్ జనాలు గొంతెత్తడం ప్రారంభిస్తారు. 

జనాలతో సంబంధం లేని, జనాల సమస్యలతో సంబంధం లేని, ఓట్లు తీసుకురావడానికి పనికిరాని, కేవలం మీడియా కాలక్షేపానికి మాత్రమే పనికి వచ్చే ఈ వ్యవహారం ఇలా కోన్నాళ్లు సాగుతూనే వుంటుందేమో?

రాజకీయ కామెడీ స్టార్ గా పవన్ కళ్యాణ్

కామెడీ ఒక్కటే కాదు నాకు సీరియస్ రోల్స్ చాలా ఇష్టం