దెబ్బ ర‌ఘురాముడికి, నొప్పి ప్ర‌తిప‌క్షాల‌కు!

న‌రసాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు కాళ్లు వాచిపోయేలా కొడితే, ఆ నొప్పి మాత్రం ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు భ‌రిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అయితే ఏడ్వ‌డం ఒక్క‌టే త‌క్కువ‌. పాపం ఆయ‌న…

న‌రసాపురం ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజు కాళ్లు వాచిపోయేలా కొడితే, ఆ నొప్పి మాత్రం ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌లు భ‌రిస్తున్నారు. మ‌రీ ముఖ్యంగా బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు అయితే ఏడ్వ‌డం ఒక్క‌టే త‌క్కువ‌. పాపం ఆయ‌న అంత‌గా బాధ‌ప‌డిపోతున్నారు. 

ఇంత‌కాలం ర‌ఘురామ‌కృష్ణంరాజుకు ఎవ‌రూ లేర‌ని విమ‌ర్శిస్తున్న వాళ్ల‌కు, నిన్న‌మొన్న ఎపిసోడ్స్‌తో ర‌ఘురామ‌కృష్ణంరాజు ఒంట‌రి కాద‌ని తేలిపోయింది. ఆయ‌న‌కు చంద్ర‌బాబు, లోకేశ్ లాంటి అగ్ర‌నేత‌లే అభిమానుల‌ని స్పష్ట‌మైంది.

ప్ర‌జాభిమానం సంగ‌తి ప‌క్క‌న పెడితే, నాయ‌కుల్లో , ఒక వ‌ర్గం జ‌ర్న‌లిస్టుల్లో మాత్రం అభిమానం చూస్తుంటే …ఆయ‌న‌కు గుడి క‌ట్టినా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఇంత‌గా నాయ‌కాభిమానం సంపాదించుకున్న ర‌ఘుర‌ఘురామ‌కృష్ణంరాజు జీవితం ధ‌న్య‌మ‌నే చెప్పాలి.  ఎందుకంటే అది కూడా ప్ర‌తిప‌క్ష నాయ‌కుల నుంచి ప్రేమ‌ను చూర‌గొన‌డం. బ‌హుశా ర‌ఘురామ‌కృష్ణంరాజుకు జ‌గ‌న్ స‌ర్కార్ క‌క్ష‌పూరిత కేసు, కాళ్ల‌కు లాఠీ దెబ్బ‌లు …ఇవ‌న్నీ వారి అభిమానం ముందు చాలా చిన్న‌విగా క‌నిపిస్తాయ‌ని చెప్పొచ్చు.

ర‌ఘురాముడి కందిపోయిన కాళ్ల‌ను చూడ‌గానే చంద్ర‌బాబునాయుడు, అచ్చెన్నాయుడు, లోకేశ్ మ‌న‌సులు ఎంత‌గా విల‌విల‌లాడాయో అంద‌రూ చూశారు. త‌మ‌పైనే దెబ్బ ప‌డినంత‌గా వారి మ‌న‌సు క్షోభించింది. ప్ర‌తిప‌క్ష నాయ‌కులంతా మౌన రోద‌న చేశారు. జ‌గ‌న్ నిరంకుశ విధానాల‌ను , అవినీతిని ప్ర‌శ్నించినందుకే దుర్మార్గంగా వ్య‌వ‌హ‌రించార‌ని అచ్చెన్నాయుడు వాపోయిన సంగ‌తి తెలిసిందే.  

ర‌ఘురాముడిని అంత‌మొందించే కుట్ర జ‌రుగుతోంద‌ని అచ్చెన్నాయుడు తీవ్ర ఆందోళ‌న చేశారంటే … ఆయ‌న ఎంత‌గా వేద‌న చెందుతున్నారో తెలుసుకోవ‌చ్చు. ఒక ఎంపీని అక్ర‌మంగా అరెస్ట్ చేయ‌డ‌మే కాకుండా ఆయ‌న‌పై థ‌ర్డ్ డిగ్రీ ప్ర‌యోగించార‌ని లోకేశ్ త‌ల్ల‌డిల్లారు. 

ఏపీలో ఐపీసీ సెక్ష‌న్ల బ‌దులు వైసీపీ సెక్ష‌న్లు అమ‌ల‌వుతున్నాయ‌నే పంచ్ డైలాగ్‌లు పుట్టుకురావ‌డానికి ర‌ఘురామ‌కృష్ణంరాజు అరెస్టే కార‌ణం. ఇక బీజేపీ మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఆవేద‌న వ‌ర్ణ‌న‌కు అంద‌నిది. మొన్న ర‌ఘురామ‌కృష్ణంరాజు అరెస్ట్ అయిన‌ప్ప‌టి నుంచి ఆయ‌న కంటిమీద కునుకు కూడా క‌రువైన‌ట్టుంది. గ‌త రెండురోజులుగా విరామం లేకుండా త‌న మ‌న‌సులోని ఆవేద‌న‌ను మీడియాతో పంచుకుంటూనే ఉన్నారు.

ఆదివారం ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ కొత్త విష‌యాన్ని క‌నుగొన్నారు. ర‌ఘురామ‌కృష్ణంరాజుపై దాడి వాస్త‌వ‌మే అని నివేదిక వ‌స్తే… దాని అర్థం వైసీపీ ఎమ్మెల్యేలు ఎవ‌రైనా నోరు విప్ప‌తితే బొక్క‌లు వేసి, నాలుగు ఉతికి పంపిస్తామ‌ని ఓ సంకేత‌మ‌ట‌! బ‌హుశా ప్ర‌భుత్వానికి ఈ ఆలోచ‌న ఉందో లేదో తెలియ‌దు కానీ, విష్ణుకుమార్ రాజు చెప్పిన త‌ర్వాత ఆ దిశ‌గా ఓ లుక్ వేస్తారేమో చెప్ప‌లేం.

సొంతపార్టీలో ఉన్నవాళ్లకే ఇలా చేస్తే, ఇక ప్రతిపక్ష నేతల పరిస్థితి రాష్ట్రంలో ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చ‌ని విష్ణుకుమార్‌రాజు అన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అరెస్ట్ చేస్తారా? అసలు రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా? అని విష్ణుకుమార్‌రాజు ప్రశ్నించడం గ‌మనార్హం. తాము చేయ‌ని ప‌ని ఒక్క రఘురామ‌కృష్ణంరాజే చేశార‌ని, అలాంటి వ్య‌క్తిని స‌న్మానించ‌కుండా ప్ర‌భుత్వం చేస్తున్న ప‌నేంట‌ని ప్ర‌తిప‌క్ష నేత‌ల విమ‌ర్శ‌ల సారాంశంగా ఉంది.

ఇలా ప్ర‌తిప‌క్షాల నుంచి మ‌ద్ద‌తు కూడ‌గ‌ట్ట‌డంతో ర‌ఘురామ‌కృష్ణంరాజు స‌క్సెస్ అయ్యార‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మవుతున్నాయి. ఇంత మంది నాయ‌కుల అభిమానం ద‌క్కించుకున్న ర‌ఘురాముడి రాజ‌కీయ జీవితాన్ని భ‌విష్య‌త్‌లో ఎవ‌రైనా ఆద‌ర్శంగా తీసుకునే అవ‌కాశం లేక‌పోలేదు.