ఇచ్చిన మాటకు కట్టుబడి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆర్టీసీ విలీన ప్రక్రియ మొదలు పెట్టారు ముఖ్యమంత్రి జగన్. దీనికి సంబంధించి ఈరోజు అబ్జార్షన్ ఆఫ్ ఎంప్లాయిస్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ ఇన్ టు గవర్నమెంట్ సర్వీస్ యాక్ట్ -2019ని అసెంబ్లీలో ప్రవేశ పెట్టబోతున్నారు. అదే సమయంలో ఆర్టీసీ చార్జీలను స్వల్పంగా ప్రభుత్వం పెంచింది.
ఏపీ కంటే ముందే తెలంగాణలో ఆర్టీసీ చార్జీలు పెరిగాయి, కాస్త లేట్ గా ఏపీలో రేట్లు పెంచారు. తెలంగాణలో మినిమం చార్జి 10రూపాయలు అయితే, ఏపీలో 5రూపాయలుగానే ఉంది. ఇలాంటి తేడాలు అక్కడా ఇక్కడా చాలానే ఉన్నాయి. అయితే ఆర్టీసీ చార్జీల పెంపుని ఓ ప్రధాన అస్త్రంగా చేసుకుని అసెంబ్లీ లోపలా, బయటా గొడవ చేస్తున్నాయి ప్రతిపక్షాలు. ఆర్టీసీ చార్జీలతో సామాన్యుడి నడ్డి విరిగిందని, మధ్యతరగతి కుటుంబాలు కుదేలైపోయాయని, అసలు రాష్ట్రం అస్తవ్యస్తం అయిపోయిందని గొడవ చేస్తున్నాయి.
ఇలాంటి సందర్భాలలో ప్రజలకు వాస్తవం చెప్పాల్సిన బాధ్యత ఎవరిపై ఉంది. మమ్మల్ని ప్రభుత్వంలో కలపండి మహా ప్రభో అంటూ జగన్ చుట్టూ తిరిగిన యూనియన్ నాయకులు ఎక్కడికిపోయారు. చార్జీల పెంపుపై ప్రతిపక్షాలు చేస్తున్న రాద్ధాంతాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత వారిపై లేదా? కనీసం సంస్థ కష్టాల్లో ఉంది, అందకే చార్జీలు పెంచాల్సి వచ్చింది, ప్రజలంతా సహకరించండి అనే స్టేట్ మెంట్ కూడా ఎందుకు ఇవ్వలేకపోతున్నారు. ఇదేనా ఆర్టీసీ కార్మికులకు జగన్ పై ఉన్న కృతజ్ఞతాభావం.
ఆర్టీసీ చార్జీలు పెంచితే ఆ డబ్బులేవీ జగన్ జేబులోకి పోవు, కనీసం రవాణా శాఖకు కూడా వాటిపై హక్కు లేదు. చార్జీలు పెంచడం ద్వారా వచ్చిన సొమ్ము పూర్తిగా ఆర్టీసీ ఆదాయమే. ఆ సంస్థ ఉద్యోగులు, వారి సౌకర్యాలు, బస్సుల కోసమే దాన్ని ఖర్చుపెడతారు. మరి దీంట్లో జగన్ చేసిన తప్పేంటి? యూనియన్లు ఎందుకు పట్టించుకోవు?
మొత్తమ్మీద ఆర్టీసీ కార్మికులకు జగన్ చేసిన మేలు మరుగునపడిపోయి, చార్జీల పెంపు మాత్రమే పెద్ద తప్పుగా కనిపించడం ఖండించాల్సిన విషయం. ఇకనైనా దీన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మంత్రులు, ఎమ్మెల్యేలు తీసుకోవాలి. ఆర్టీసీ కార్మికులు కూడా ప్రజల్లో అవగాహన పెంచాలి. అనివార్య పరిస్థితులలోనే ఆర్టీసీ చార్జీలు పెంచారని వివరించాలి.