రాజధాని అమరావతిపై ఈనాడు అధినేత రామోజీరావుకు ఎంత ప్రేమో అందరికీ తెలుసు. అంతెందుకు టీడీపీ అధికారంలోకి వచ్చిన కొత్తలో రాజధాని ఎక్కడ పెట్టాలనే అంశంపై సీరియస్‌గా చర్చ సాగుతున్నప్పుడు …ఇదే రామోజీ పత్రిక ఈనాడులో అమరావతి అయితే బాగుంటుందని వ్యాసాలు రాశారు. అమరావతి ప్రాంత చారిత్రక విశిష్టతను తెలియజేస్తూ … అప్పట్లో ఆ ప్రాంతమే రాజధాని అనే భావనలోకి ప్రజలను మానసికంగా తీసుకెళ్లడంలో ఈనాడు సక్సెస్ అయింది.
జగన్ సర్కార్ మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చిన తర్వాత …అమరావతిలో కేవలం శాసన రాజధాని మాత్రమే ఉంటుందనే సరికి రామోజీ తీవ్రంగా మదనపడుతున్నారు. దీంతో ఎలాగైనా అమరావతిలోనే పూర్తిస్థాయి రాజధాని కొనసాగేలా చేయాలని రామోజీ తన పత్రిక ఈనాడు, ఈటీవీని అడ్డుపెట్టుకొని జగన్ సర్కార్‌పై యుద్ధమే చేస్తున్నారు. ప్రతిరోజూ అమరావతి లోనే రాజధాని కొనసాగాలనే తన ఆకాంక్షలకు అనుగుణంగా పలువురి ముఖ్యుల అభిప్రాయాలను ఈనాడులో ప్రచురించడం చూస్తున్నాం.
తాజాగా సోమవారం సంచికలో “అణచివేతకు అదరక ఆంక్షలకు బెదరక” శీర్షికతో ఓ చక్కటి కథనాన్ని ఈనాడు క్యారీ చేసింది. ఈ కథనానికి వాడిన ఉపశీర్షికలు చదివితే …ఇక వార్తను చదవాల్సిన అవసరం రాదు.
సామాన్య మహిళల అసామాన్య పోరా టం, రాజధాని అమరావతి ప్రాంత రైతుల ఆవేదనను జాతీయస్థాయి వేదికలపైకి తీపుకెళ్లిన వైనం, ఈనాడు ముఖాముఖిలో వారి ఆవేదనను కళ్లకు కట్టిన ఉద్యమకారిణులు… ఇదన్న మాట అసలు సారాంశం. ఇటీవల రాజధాని మార్పుపై తమ అభ్యంతరాన్ని జాతీయస్థాయి నేతల దృష్టికి తీసుకెళ్లేందుకు కొంత మంది మహిళలు ఢిల్లీ వెళ్లారు.
ఢిల్లీకి వెళ్లిన నారీమణుల అభిప్రాయాలతో రామోజీ మానస పుత్రిక ఈనాడు ఓ “కమ్మ”ని కథనాన్ని ప్రచురించింది. ఆరుగురి మహిళల అభిప్రాయాలతో కథనాన్ని అచ్చోశారు. ముందుగా ఈనాడు మొదటి పేజీలో క్యారీ చేసిన ఆ కథనం సాగిన తీరు చూద్దాం.
“వారంతా ఇల్లు, వృత్తి తప్ప మరో ప్రపంచమే తెలియని సామాన్య మహిళలు. మూడు రాజధానుల నిర్ణయంతో రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయం , అమరావతి కోసం తమలాగే భూములిచ్చిన వేలాది మంది రైతులు పడుతున్న వేదన , ప్రభుత్వ అణచివేత చర్యల్ని చూసి చలించిపోయారు.
అమరావతి పరిరక్షణకు అహరహరం శ్రమిస్తున్న వీరంతా తమ ఉద్యమానికి జాతీయ స్థాయిలో మద్దతు కూడగట్టేందుకు రైతుల తరపున ప్రతినిధి బృందంగా ఇటీవల ఢిల్లీకి వెళ్లారు. పలువురు కేంద్రమంత్రులు, వివిధ పక్షాల నేతల్ని కలిసి అమరావతికి అండదండలు ఇవ్వాలని కోరారు. ఈ ప్రతినిధి బృందంలోని నారీమణులు, వారి ఉద్యమ అనుభవాలను “ఈనాడు”తో పంచుకున్నారు” …అని చక్కటి ఇంట్రో ఇచ్చారు.
ఈనాడు పేర్కొన్నట్టు ఇల్లు, వృత్తి తప్ప మరో ప్రపంచమే తెలియని ఆ ఆరుగురు సామాన్య మహిళలెవరంటే ….కంభంపాటి శిరీష, మువ్వా సుజాత, రాయపాటి శైలజ, సుంకర పద్మశ్రీ, అక్కినేని వనజ, తంగిరాల సౌమ్య. ఈ సామాన్య మహిళల గురించి ఈనాడు రాసిన పరిచయ వాక్యాల గురించి కూడా తప్పక తెలుసుకోవాలి.
కంభంపాటి శిరీష – రాయపూడికి చెందిన సాధారణ గృహిణి. ఎస్సీ వర్గానికి చెందిన ఆమె కుటుంబం రాజధాని నిర్మాణానికి 2.30 ఎకరాల భూమి ఇచ్చింది. రాజధాని ఉద్యమం మొదలయ్యే వరకు ఆమెకు కుటుంబ బాధ్యతలు తప్ప మరే ప్రపంచమే తెలియదు.
మువ్వా సుజాత – అనంతవరంలోని బీసీ వర్గానికి చెందిన సాధారణ గృహిణి. ఆమె కుటుంబం రాజధానికి నాలుగు ఎకరాలు ఇచ్చింది. ఎన్నడూ గడప దాటి ఎరుగని ఆమె … ఢిల్లీ వెళ్లి రైతుల గళాన్ని జాతీయ నాయకులకు వినిపించారు.
రాయపాటి శైలజ – గుంటూరుకు చెందిన వారు. వృత్తిరీత్యా వైద్యురాలు. రాజధాని అమరావతి మహిళల పోరాటాన్ని చూసి చలించారు. ఉద్యమంలో తొలి నుంచి భాగస్వామ్యమయ్యారు.
సుంకర పద్మశ్రీ – కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర సమన్వయ కమిటీ సభ్యురాలు. గన్నవరం సమీపంలోని ఆత్కూరు స్వగ్రామం. మూడు రాజధానులతో రాష్ట్ర భవిష్యత్‌కి జరిగే నష్టాన్ని అడ్డుకోవాలన్న లక్ష్యంతో ఉద్యమంలోకి వచ్చారు.
అక్కినేని వనజ – సీపీఐ నాయకురాలు. పలు రాజకీయ, ప్రజా ఉద్యమాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. మూడు రాజధానుల నిర్ణయం రాష్ట్ర ప్రగతికి గొడ్డలి పెట్టుగా భావించి అమరావతి ఉద్యమానికి బాసటగా నిలిచారు.
తంగిరాల సౌమ్య –కృష్ణా జిల్లాలోని నందిగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే. టీడీపీ నాయకురాలు. రాజధాని ప్రాంత రైతులు పడుతున్న ఆవేదన చూసి చలించి ఉద్యమంలో భాగస్వాములయ్యారు.
ఈ ఆరుగురు మహిళల్లో కంభంపాటి శిరీష, మువ్వా సుజాతలను సామాన్య మహిళలంటే ఎవరైనా నమ్ముతారు. అలాగే వీళ్లిద్దరి గురించి మాత్రమే ప్రత్యేకంగా కులం కోణంలో హైలెట్ చేయడంలో ఈనాడు ఉద్దేశం ఏంటి? అమరావతి కేవలం కమ్మ సామాజిక వర్గానిదే కాదు … అన్ని కులాల భాగస్వామ్యం ఉందని చెప్పడానికే ఈనాడు తన “కమ్మ”ని బుద్ధిని ప్రదర్శించిందనే అభిప్రా యాలు వ్యక్తమవుతున్నాయి.
కులం గురించి రాయని వాళ్లంతా కమ్మ వాళ్లనుకోవాలా? అనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అసలు ఏ ఒక్కరి గురించి కుల ప్రస్తావన లేకుండా రాస్తే ఎలాంటి సమస్య రాదు. కానీ ఆరుగురిలో ఒకరు ఎస్సీ, మరొకరు బీసీ అని చెప్పడం ద్వారా మిగిలిన వాళ్లంతా అగ్రకులాలు … అందులోనూ కమ్మ వాళ్లదే ఆధిపత్యం అని ఈనాడు పరోక్షంగా ప్రస్తావించినట్టైంది.
ఈ ఆరుగురిలో రాయపాటి శైలజ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన మహిళ. మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు రాయపాటి సాంబశివరావు సోదరి కుమార్తే శైలజ. వృత్తిరీత్యా ఈమె వైద్యురాలు. ఇటీవల విజయవాడలో స్వర్ణ ప్యాలెస్‌లో అగ్ని ప్రమాద దుర్ఘటనలో ఈమె పోలీసుల విచారణకు హాజరయ్యారు.
అక్కినేని వనజ కూడా వామపక్ష ఉద్యమాలతో గాఢమైన అనుబంధం కలిగిన నాయకురాలు. ఈమెది కమ్మ సామాజిక వర్గం. కమ్యూనిస్టులు కులమతాలకు అతీతంగా ఉంటారు. కానీ అమరావతి విషయం వచ్చే సరికి కార్మికుల్లారా ఏకం కండి అనే నినాదం పక్కకు పోయి….కమ్మల్లారా ఏకమవుదాం అనే ఐక్యత చూడొచ్చు.
ఈ కథనంలో వనజ అభిప్రాయం చదివితే … నిజంగా ఇలాంటి అభిప్రాయం ఈమె చెప్పారా? లేక ఈనాడే తనకు తానుగా రాసిందా? అనే అనుమానం రాక మానదు. “ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజధానులు మారుస్తారా? పరిపాలన రాజధానిని ఉత్తరాంధ్రకు తీసుకెళ్తే రాయల సీమ ప్రజలు ఎందుకు ఊరుకుంటారు? ప‌్రత్యేక రాయలసీమ డిమాండ్ లేవనెత్తరా?” అని వనజ ప్రశ్నించారు. ఇవే ప్రశ్నలు అమరావతిని ఏకపక్షంగా నిర్ణయిస్తున్నప్పుడు కమ్యూనిస్టులు, వనజ ఎందుకు ప్రశ్నించలేదో అర్థం కాదు.
అమరావతిలో పరిపాలన రాజధాని ఉంటే మాత్రం రాయలసీమ ప్రజలు ఊరుకుండాలా? అప్పుడు మాత్రం రాయలసీమ డిమాండ్ లేవనెత్తరా? ….విశాఖలో పరిపాలన రాజధాని ఏర్పాటును జీర్ణించుకోలేని వనజకు …అకస్మాత్తుగా రాయలసీమ గుర్తు రావడం ఆశ్చర్యం కలిగిస్తోంది. మరి అమరావతిలో పరిపాలన రాజధాని ఉంటే మాత్రం రాయలసీమ ఎందుకు ఇంత కాలం గుర్తు రాలేదో ఆమే చెప్పాలి. ఆమె కమ్యూనిస్టుగా గాకుండా “కమ్మ”నిస్టుగా మాట్లాడారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
సహజంగా కమ్యూనిస్టులు వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని కాంక్షిస్తారు. అదేంటో కానీ అమరావతి విషయంలో కమ్యూనిస్టులకు ఆర్థిక అసమానతల కంటే కులమే ఎక్కువైంది. ఈ ఆరోపణలకు వనజ అభిప్రాయమే నిలువెత్తు నిదర్శనం.
సుంకర పద్మశ్రీ విషయానికి వస్తే …ఈమె కాపు సామాజిక వర్గానికి చెందిన మహిళ. అసలు తనకు రాజధానితో సంబంధమే లేదని చెప్పుకున్నారు. కానీ మూడు రాజధానులతో రాష్ట్రానికి ఏదో కీడు జరుగుతుందనే ఆందోళనతో ముందుకొచ్చినట్టు చెప్పుకోవడం గమనార్హం. కృష్ణా జిల్లా నందిగామ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. ఈమె టీడీపీ నాయకురాలు. ఈమెకు కూడా రాజధాని ప్రాంతంతో అసలు సంబంధమే లేదు. కానీ రాజధాని ప్రాంత రైతులు పడుతున్న ఆవేదన చూసి చలించి ఉద్యమంలో భాగస్వాములైనట్టు ఈనాడు రాసుకొచ్చింది.
అసలు రాజధాని ప్రాంతానికి, ఢిల్లీ వెళ్లిన మహిళలకు ఎలాంటి సంబంధమూ లేదని ఈనాడు కథనం మరోసారి కళ్లకు కట్టింది. ఈ కథనంలో శిరీష 2.30 ఎకరాలు, అలాగే మువ్వా సుజాత నాలుగెకరాల భూమి రాజధానికి ఇచ్చినట్టు రాశారు.
మరి మిగిలిన నలుగురి కులాలు, వాళ్లు రాజధాని కోసం త్యాగం చేసిన భూమి ఎంతో ఎందుకు ప్రస్తావించలేదు? ఎవరిని మభ్యపెట్టేందుకు ఈ కథనం? ఇంత కాలం వివిధ పక్షాలు విమర్శిస్తున్నట్టు … అక్కడ కృత్రిమ ఉద్యమం చేస్తున్నది కేవలం ఒక సామాజిక వర్గం ప్రయోజనాల కోసమే అనే వాదనకు బలం చేకూర్చేలా ఈ కథనం ఉందని చెప్పక తప్పదు.
రాజధాని ప్రాంతానికి సంబంధం లేని వ్యక్తులంతా ఉద్యమకారులుగా తెర మీదకు వస్తున్నారు. ఇలా రావడానికి తెర వెనుక ఉన్న అసలు కారణాలేంటో జనం అర్థం చేసుకోలేని అమాయకులేం కాదు. ఈ కథనంలో తమ అభిప్రాయాల్ని వెల్లడించిన అక్కినేని వనజ, రాయపాటి శైలజ, సుంకర పద్మశ్రీ, తంగిరాల సౌమ్యలకు అసలు అమరావతితో ఎలాంటి సంబంధం లేదు.
నిజంగా నష్టపోయిన వాళ్లు ఎందుకు ఉద్యమించడం లేదు? తమ ఆవేదనను ఢిల్లీ పెద్దలకు చెప్పుకోవడానికి రాజధాని ప్రాంత బాధిత మహిళల్లో ఒకరిద్దరు తప్ప …మరెవరూ లేరా? ప‌్రపంచమే తెలియని మహిళలంతా ఉద్యమిస్తున్నారని రాస్తూనే … అదే కథనంలో వాళ్ల రాజకీయ నేపథ్యం రాయడం ఒక్క ఈనాడుకే చెల్లింది. అందుకే ఇది ఈనాడు “కమ్మ”ని కథనం అయింది.