కరోనా కేసులకు సంబంధించి ఆయా దేశాల ప్రభుత్వాలు, ఆయా దేశాల్లోని వైద్య సంస్థలు వేసిన లెక్కలు ఇవి. నిన్నటి శనివారానికి అందిన సమాచారం ఇది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల్లో టాప్ టెన్లో ఉన్న దేశాల జాబితా ఇది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతూ ఉంది. దీంట్లో ఏ దేశానికీ మినహాయింపు కనిపించడం లేదు. ఎక్కడి స్థాయికి తగ్గట్టుగా అక్కడ పెరుగుదల చోటు చేసుకుంటూ ఉంది. తేడా ఒక్కటే.. నియంత్రణ చర్యలు. నియంత్రణ చర్యలు తీసుకున్న దేశాల్లో కరోనా వైరస్ కాస్త తక్కువ వేగంతో అంటుకుంటూ ఉంది. నియంత్రణ చర్యలు తక్కువగా ఉన్న దేశాల్లో వేగంగా ఈ వైరస్ అంటు కుంటూ ఉంది. దాదాపు అంతర్జాతీయ విమాన సర్వీసులు బంద్ అయ్యాయి. ఆయా దేశాల్లోని వ్యక్తుల నుంచి ఇప్పుడు ఆయా దేశాల్లోని వ్యక్తులకు కరోనా సోకుతూ ఉన్న దశలో ఉంది. ఈ నేపథ్యంలో కరోనా కేసుల్లో టాప్ టెన్ దేశాల జాబితాను గమనిస్తే..
అమెరికా నంబర్ వన్ పొజిషన్లో ఉంది. అక్కడ కరోనా కేసుల సంఖ్య లక్ష దాటిన కొద్ది గంటల్లోనే మరో 23 వేల మందికి కరోనా పాజిటివ్ అని తేలిందట. యూఎస్ లో కరోనా మరణాలు కూడా రెండు వేలను దాటాయి.
ఇక కరోనాను బారిన తీవ్రంగా పడిన ఇటలీలోనూ ఆ వైరస్ తీవ్రత ఎక్కువగానే కొనసాగుతూ ఉంది. ఇప్పటి వరకూ 92 వేల కరోనా పాజిటివ్ కేసులు అక్కడ రిజిస్టర్ అయ్యాయి. ఇటలీలో మరణాలు 10 వేలను దాటాయి, పరిణామాలు ఆందోళన కరంగా కొనసాగుతూ ఉన్నాయి.
కరోనా పుట్టిల్లు చైనాలో కేసుల సంఖ్య 80 వేలు దాటింది. ఆ తర్వాత అక్కడ వైరస్ మందకొడిగా ప్రబలుతూ ఉంది. స్పెయిన్, జర్మనీ, ఫ్రాన్స్ లలో కూడా కరోనా ప్రభావం తీవ్రంగానే కనిపిస్తూ ఉంది. స్పెయిన్ లో మరణాలు ఐదు వేలను దాటాయి. జర్మనీలో కేసుల సంఖ్య చాలానే ఉన్నా, మిగతా దేశాలతో పోలిస్తే మరణాల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఫ్రాన్స్, ఇరాన్, యూకేలు కూడా అనేక రకాల తంటాలుపడుతూ ఉన్నాయి. ఇప్పటికే కరోనా నంబర్లు సర్వత్రా ఆందోళన రేపుతున్నాయి. ఈ నంబర్లు ఇంకా ఏ స్థాయికి చేరతాయనేది మరింత ఆందోళన కరమైన అంశంగా మారుతోంది.