ట్రేడ్ టాక్: జాతిరత్నాలకు దారిచ్చిన ఆణిముత్యాలు

జాతిరత్నాలకు మరో వీకెండ్ దొరికింది. ఈ వారం విడుదలైన 3 సినిమాల్లో ఏదీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో.. ఆల్రెడీ స్వింగ్ లో ఉన్న జాతిరత్నాలు మూవీ ఈ వారాంతం కూడా మంచి వసూళ్లు రాబట్టడం ఖాయంగా…

జాతిరత్నాలకు మరో వీకెండ్ దొరికింది. ఈ వారం విడుదలైన 3 సినిమాల్లో ఏదీ పెద్దగా ఆకట్టుకోకపోవడంతో.. ఆల్రెడీ స్వింగ్ లో ఉన్న జాతిరత్నాలు మూవీ ఈ వారాంతం కూడా మంచి వసూళ్లు రాబట్టడం ఖాయంగా కనిపిస్తోంది. ముందుగా ఈ వారం విడుదలైన సినిమాల సంగతి చూద్దాం.

ఓ మోస్తరు అంచనాలతో వచ్చిన చావు కబురు చల్లగా సినిమా ఆ అంచనాల్ని అందుకోలేకపోయింది. ''మంచి సినిమా.. దర్శకుడు బాగా తీశాడు'' లాంటి కాంప్లిమెంట్స్ తప్పితే ఈ సినిమాకు కాసులు రాలే అవకాశాలు తక్కువని ట్రేడ్ తేల్చేసింది. ఇంకా చెప్పాలంటే ఈ సినిమా పరిస్థితి ''ఆపరేషన్ సక్సెస్.. పేషెంట్ డైడ్'' లాంటిదన్నమాట.

ఇక చావుకబురు చల్లగా సినిమాతో వచ్చిన మోసగాళ్లు మూవీ, టైటిల్ కు తగ్గట్టే ప్రేక్షకుల్ని మోసం చేసింది. కథ-కథనం కంటే టెక్నికల్ వ్యవహారాలు ఎక్కువగా చెప్పి జనాల్ని విసుగెత్తించింది ఈ మూవీ. మామూలుగానే మంచు విష్ణు సినిమాలకు ఓపెనింగ్స్ తక్కువ. 

ఇక మొదటి రోజు టాక్ తో 'మోసగాళ్లు' నిలువునా మునిగిపోయారు. ఇక ఆది సాయికుమార్ నటించిన శశి సినిమా సహనానికి పరీక్ష పెట్టింది. రొటీన్ స్క్రీన్ ప్లే, రొట్ట సన్నివేశాలతో ఈ సినిమా తాబేలు నడకను తలపించింది.

ఇలా శుక్రవారం రిలీజైన 3 ఆణిముత్యాలు, జాతిరత్నాలకు దారిచ్చినట్టయింది. ఇప్పటికే డబుల్ ప్రాఫిట్స్, ఓవర్ ఫ్లోస్ తో నడుస్తున్న ఈ సినిమా మరోవారం వసూళ్లు అందుకోబోంది. ఏపీలో ఈ సినిమాకు ఆక్యుపెన్సీ తగ్గినప్పటికీ, తెలంగాణలో మాత్రం జోరు తగ్గలేదు. అటు ఓవర్సీస్ లో కూడా జాతిరత్నాలు దూసుకుపోతుండడం విశేషం.