పెట్రోల్ పై కథనం.. టీవీ9 నుంచి మరో ‘ఆణిముత్యం’

నలుగురి దృష్టిని ఆకర్షించడం కోసం కావాలనే చేస్తారా లేక బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ టైపులో వ్యవహరిస్తారో తెలియదు కానీ.. టీవీ9 నుంచి ఈమధ్య కాలంలో వరుసగా ''ఆణిముత్యాలు'' దొర్లుతూనే ఉన్నాయి. మొన్నటికిమొన్న ఏకంగా…

నలుగురి దృష్టిని ఆకర్షించడం కోసం కావాలనే చేస్తారా లేక బాడీ ప్రజెంట్, మైండ్ ఆబ్సెంట్ టైపులో వ్యవహరిస్తారో తెలియదు కానీ.. టీవీ9 నుంచి ఈమధ్య కాలంలో వరుసగా ''ఆణిముత్యాలు'' దొర్లుతూనే ఉన్నాయి. మొన్నటికిమొన్న ఏకంగా టీవీ9 హెడ్ రజనీకాంతే “పోస్కో..పోస్కో” అన్నారు. 

ఏం పోస్కోవాలో అర్థంకాక జనాలు తలలుపట్టుకున్నారు. ఆ తర్వాత టీవీ9 స్టార్ యాంకర్ గా చెప్పుకునే దేవి, రుధిరాన్ని విరిచిపడేసి, తెలుగును భ్రష్టు పట్టించింది. ఇప్పుడు అదే యాంకర్ నుంచి మరో ''వైరల్ మాట'' బయటకొచ్చింది.

తాజాగా పెట్రోల్ పై కథనాన్ని ప్రసారం చేసింది టీవీ9. మెరుగైన సమాజం కోసమంటూ ప్రజెంటేషన్ ను కొత్తపుంతలు తొక్కించే ఈ ఛానెల్.. ఈ వార్తకు కూడా ఇద్దరు యాంకర్లను, మెడ్రన్ డ్రెస్సులతో దించేసింది. అయితే ఆ ప్రజెంటేషన్, ఆ వస్త్రాలంకరణ, గ్రాఫిక్స్ పై పెట్టిన దృష్టిని కంటెంట్ పై పెట్టినట్టు  కనిపించలేదు.

లీటరుకు వంద మిల్లీలీటర్లు.. ఇదీ తాజాగా టీవీ9 యాంకర్ చెప్పిన కొత్త లెక్క. “బంక్ కెళ్లి 100 మిల్లీలీటర్లు పెట్రోల్ కొట్టించుకున్నామని ఫుల్ జోష్ లో ఉన్నారా..? అయితే మీకు పోసింది హండ్రెడ్ ఎంఎల్ కాదు..” ఇలా సాగింది యాంకరమ్మ వ్యాఖ్యానం. ఇలా పోసిన 100 ఎంఎల్ లో 50 మిల్లీలీటర్లు బంకులో నొక్కేస్తున్నాయని ఆమె ధారాళంగా చెప్పేసింది. అంటే ఆమె దృష్టిలో బైక్ ట్యాంక్ లో పడింది 50 మిల్లీలీటర్ల పెట్రోలే అని అర్థం.

ఇదే యాంకర్ గతంలో వరదలొచ్చినప్పుడు తన తెలుగు పాండిత్యం మొత్తం చూపించింది. పాపం ఆవిడ రుధిరం అంటే ఆకాశం అనుకుంది. హైదరాబాద్ లో భారీ వర్షాలు కురిస్తే.. రుధిరం విరుచుకుపడింది, రుధిరం పగబట్టింది అంటూ ఏదేదో మాట్లాడేసింది. అదే టైమ్ లో సాక్ష్యాత్తూ స్టార్ యాంకర్, ఛానెల్ హెడ్ రజనీకాంత్.. పోక్సో చట్టాన్ని.. పోస్కో..పోస్కో అని చదివి మరోసారి సోషల్ మీడియాకు టార్గెట్ అయ్యారు.

ఇలా టీవీ9 యాంకర్ల నుంచి మినిమం గ్యాప్స్ లో ఇలాంటి ''ఆణిముత్యాలు' దొర్లుతూనే ఉన్నాయి. సోషల్ మీడియాలో సంచలనాల కోసం కావాలని ఇలా చేస్తున్నారా లేక మారిన సిబ్బంది చేతివాటం వల్ల వచ్చిన తిప్పలా అనేది వాళ్లకే తెలియాలి.