కరోనా నియంత్రణలో ఏపీ సీఎం జగన్ తీసుకుంటున్న చర్యలు ప్రశంసలు అందుకుంటున్నాయి. అందులోనూ ప్రతిపక్ష నేతల నుంచి ప్రశంసలు జగన్ సర్కార్‌కు ఎంతో నైతిక స్థైర్యాన్ని ఇస్తున్నట్టైంది. రెండురోజుల క్రితం జనసేనాని పవన్‌కల్యాణ్ కరోనా నియంత్రణలో జగన్ తీసుకుంటున్న చర్యలను అభినందించిన విషయం తెలిసిందే.
తాజాగా తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి కూడా ఆ జాబితాలో చేరారు. కరోనా నియంత్రణకు ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అద్భుతంగా పని చేస్తున్నారని ప్రశంసించారు. అంతేకాదు, తమ ముఖ్యమంత్రి కేసీఆర్ కరోనా నివారణలో విఫలమ య్యారని ఆయన విమర్శించారు. ఏపీలో కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చారని ఉత్తమ్‌కుమార్‌రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణలో కరోనా నిర్ధారణ పరీక్షలపై ఆ రాష్ట్ర హైకోర్టు కూడా అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే.
ఇటీవల తెలంగాణ కాంగ్రెస్ పార్లమెంట్ సభ్యుడు రేవంత్‌రెడ్డి కూడా జగన్ సర్కార్‌ను అభినందనలతో ముంచెత్తారు. కరోనా నియంత్రణలో పొరుగు రాష్ట్ర సీఎం జగన్‌ను చూసి నేర్చుకోవాలని ఆయన హితవు పలికిన విషయం తెలిసిందే. కరోనా నిర్ధారణ పరీక్షల్లో ఏపీ 10 లక్షల మార్క్ దాటి దూసుకుపోతోంది. ఏ మాత్రం కరోనా లక్షణాలు కనిపించినా వెంటనే వైద్య పరీక్షలు చేయించేందుకు ఏపీ ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకొంది. అలాగే వాలంటీర్లు, సచివాలయ వ్యవస్థ ఏర్పాటుతో ఏపీ సర్కార్ దేశంలోనే ఆదర్శంగా నిలిచింది. ఈ ఏర్పాట్లతో కరోనా అరికట్టడంలో ఎంతో సులువైంది.