కోవిడ్-19 కేసులు పెరగుతూ ఉన్నా కేంద్ర ప్రభుత్వం అన్ లాకింగ్ ప్రక్రియను కొనసాగిస్తూ ఉంది. ఆగస్టు ఐదు నుంచి అన్ లాకింగ్ 3 ప్రక్రియ మొదలుకానుంది. ఈ క్రమంలో కేంద్రం తాజా గైడ్ లైన్స్ ను విడుదల చేసింది. వాటి ప్రకారం.. ప్రస్తుతం ఓపెనప్ అయినవి యథారీతిన కొనసాగుతాయి. వాటితో పాటు జిమ్ లకు, యోగా సెంటర్లకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. వాటి కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చని ప్రకటించింది.
లాక్ డౌన్ నేపథ్యంలో అమల్లో ఉండిన నైట్ కర్ఫ్యూను కేంద్రం ఎత్తేసింది. ఇవి మాత్రమే చెప్పుకోదగిన మినహాయింపులు. ముందుగా ప్రచారం జరిగినట్టుగా థియేటర్ల ఓపెన్ కు మాత్రం కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదు. ఆగస్టు ఒకటి నుంచి థియేటర్లు, సినిమా హాల్స్ ఓపెన్ అవుతాయనే ప్రచారం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చే సాహసం చేయలేదు కేంద్ర ప్రభుత్వం.
ఆగస్టులో స్వతంత్ర దినోత్సవం నిర్వహణకు కూడా కేంద్రం గైడ్ లైన్స్ విడుదల చేసింది. భౌతిక దూరం పాటిస్తూ స్వతంత్ర దినోత్సవం నిర్వహించుకోవచ్చని ప్రకటించింది.
థియేటర్లు, మెట్రో రైళ్లు, స్విమ్మింగ్ పూల్స్, ఆడిటోరియమ్స్, ఎంటర్ టైన్ మెంట్ పార్క్స్, బార్లు, అసెంబ్లీ హాల్స్.. లకు యథారీతిన అనుమతి లేదని స్పష్టం చేశారు.
రాజకీయ, సామాజిక, క్రీడా, వినోద, విద్య, సాంస్కృతి, మత కార్యక్రమాలను జనసందోహంతో నిర్వహించడంపై కేంద్రం నిషేధాన్ని కొనసాగిస్తూ ఉంది. ఈ కార్యక్రమాలు తప్ప వేరే ఏమైనా ఉంటే నిర్వహించుకోవచ్చని, అది కూడా కంటైన్మెంట్ జోన్లలో ఎలాంటి గేదరింగ్స్ కూ అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది.