ఎవరేమన్నా తన దారి తనదే అన్నట్టుగా వ్యవహరించే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, డబ్ల్యూహెచ్వోకు ఇటీవలే జారీ చేసిన హెచ్చరికను అప్పుడే అమల్లో పెట్టేశాడు. కరోనా వైరస్ విషయంలో డబ్ల్యూహెచ్ వో వ్యవహరించిన తీరును ట్రంప్ తప్పు పట్టిన సంగతి తెలిసిందే. డబ్ల్యూహెచ్ వో చాలా వరకూ చైనా సెంట్రిక్ గా వ్యవహరిస్తోందని ట్రంప్ వ్యాఖ్యానించారు. కరోనా వైరస్ విషయంలో డబ్ల్యూహెచ్వో మొదట్లో చైనాను వెనకేసుకు వచ్చింది. ఇప్పుడు కూడా చైనా తప్పొప్పులను ప్రస్తావించడం లేదు డబ్ల్యూహెచ్ వో. ఈ నేపథ్యంలో సర్వత్రా ఆ సంస్థపై విమర్శలు చెలరేగాయి.
అందరికన్నా ట్రంప్ ముందే స్పందించారు. డబ్ల్యూహెచ్వోకు అమెరికా ఇక నిధులు ఇవ్వదని ట్రంప్ తేల్చారు. అంతే కాదు.. అప్పుడే ఆ కోత అమల్లోకి కూడా వచ్చేసినట్టుగా తెలుస్తోంది. వరల్ఢ్ హెల్త్ ఆర్గనైజేషన్ కు ప్రధాన ఆదాయ వనరుల్లో అమెరికా ఇచ్చే నిధులు కూడా ముఖ్యమైనవి. ఆ సంస్థకు వచ్చే మొత్తం నిధుల్లో 15 శాతం అమెరికా నుంచినే వస్తాయట!
మిగిలిన ప్రపంచ దేశాలు, దాతలు కలిసి 85 శాతం నిధులను ఇస్తున్నాయని సమాచారం. 15 శాతం వాటాతో అమెరికా టాప్ పొజిషన్లో ఉందట. ఈ క్రమంలో ఆ నిధులను అమెరికా పూర్తిగా ఆపేసినట్టుగా తెలుస్తోంది. ట్రంప్ ప్రకటించిన వారం పది రోజుల్లోనే ఆ ప్రభావం మొదలైందట. అయితే అమెరికా తీరును యూనైటెడ్ నేషన్స్ తప్పు పట్టింది. డబ్ల్యూహెచ్వోకు వనరుల కోత విధించాల్సిన సమయం ఇది కాదని ఐక్యరాజ్యసమితి అభిప్రాయపడింది. ఈ మాటలను ట్రంప్ లెక్క చేస్తాడా?