ఆంధ్రప్రదేశ్‌లో కరోనా సెకెండ్ వేవ్ అంతకంతకూ పెరుగుతుండడం, మరోవైపు థర్డ్, ఫోర్త్ వేవ్‌ల గురించి హెచ్చరికలు వస్తున్న నేపథ్యంలో జనం వ్యాక్సిన్ వేయించుకునేందుకు తహతహలాడుతున్నారు. మొదట్లో రకరకాల భయాలతో వ్యాక్సిన్ వేయించు కునేందుకు నిరాకరించారు.
అయితే వ్యాక్సిన్ వేయించుకోవడం వల్ల కరోనా బారి నుంచి రక్షించుకోవచ్చని వైద్య నిపుణులు పదేపదే చైతన్యపరుస్తుండడం జనంలో మార్పు తీసుకొచ్చింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు మొదటి డోస్ టీకా వేయించుకున్నారు. తాజాగా ప్రభుత్వం ఫస్ట్ డోస్ వేయడాన్ని నిలిపివేసింది.
తమ వద్ద ఉన్న టీకాను మొదటి విడత వేయించుకున్న వారికి వేసేందుకు నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో నేడు రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ఆరోగ్య కేంద్రాల వద్ద వ్యాక్సిన్ వేస్తున్నట్టు ముందే అధికారులు ప్రకటించారు. దీంతో రెండో డోస్ కోసం జనం ఒక్కసారిగా క్యూ కట్టారు.
తిరుపతి లాంటి పెద్ద నగరంలో వ్యాక్సిన్ వేయించుకునే క్రమంలో తోపులాట జరిగింది. కొందరు మహిళలు, వృద్ధులు కింద పడ్డారు. గుంటూరులో నో స్టాక్ అంటూ ఆరోగ్య కేంద్రాల వద్ద బోర్డులు వెలశాయి.
కడప జిల్లా బద్వేలు, ప్రొద్దుటూరు తదితర చిన్నపెద్ద పట్టణాల్లో రెండో సారి టీకా వేయించుకునేందుకు కిలోమీటర్లు చొప్పున క్యూ కట్టారు. అసలే అంతంత మాత్రమే ఉన్న టీకాను ప్రతి ఒక్కరికీ అందించలేని పరిస్థితుల్లో ప్రజాగ్రహాన్ని అధికారులు ఎదుర్కోవాల్సి వచ్చింది.
కొన్ని చోట్ల రాజకీయ సిఫార్సు ఉన్న వాళ్లకే టీకా వేస్తున్నారని ప్రజలు ఆందోళనకు దిగారు. మొత్తానికి టీకా కోసం జనం ఎగబ డుతున్నప్పుడు అందించలేని స్థితిలో పాలకులు ఉండడం గమనార్హం.