శాస్త్రం తెలిసిన వాడు ఒకటే నామం పెట్టుకుంటాడు. కొత్తగా శాస్త్రం నేర్చుకున్న వాడు మాత్రం నలుగురికి తెలియడం కోసం ఒళ్లంతా పంగనామాలు పెట్టుకున్నాడనేది ఓ సామెత.
చంద్రబాబు విషయంలో ఇప్పుడిదే జరుగుతోందంటున్నారు ఎమ్మెల్యే వల్లభనేని వంశీ. బీజేపీతో కలిసేందుకు బాబు ఇప్పుడు కొత్తగా హిందుత్వ కార్డు పట్టుకున్నారని, ఒంటి నిండా పంగనామాలు వేసుకొని తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు.
“ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి మైలేజీ పెరిగితే తెలుగుదేశం పార్టీ ఉనికి పోతుంది. అందుకే చంద్రబాబు ఉన్నట్టుంది హిందుత్వవాది అయిపోయాడు. గబగబా మంత్రాలు నేర్చుకున్న స్వామి అయిపోయాడు. బీజేపీ, తెలుగుదేశం పార్టీని కబలించేస్తుందనే భయం బాబుకు పట్టుకుంది. అందుకే హిందుత్వ కార్డు పట్టుకున్నాడు.”
ఒక అబద్ధాన్ని పదేపదే చెబితే నిజం అయిపోతుందనే భ్రమలో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు వంశీ. రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తుందన్న బాబు వ్యాఖ్యల్ని తనదైన శైలిలో తిప్పికొట్టారు.
“రాష్ట్రంలో రాజారెడ్డి రాజ్యాంగం నడుస్తోందని చంద్రబాబు అంటున్నాడు. అంటే.. ఇంతకుముందు ఖర్జూర నాయుడు, కిస్మిస్ నాయుడు రాజ్యాంగాలు అమల్లో ఉన్నాయా? ఈ ప్రశ్నకు బాబు సమాధానం చెప్పాలి. ఏ హక్కుతో కరకట్టమీద అక్రమ కట్టడంలో బాబు ఉంటున్నారు? అది ఏ రాజ్యాంగం ఆయనకు ఇచ్చిన హక్కో చెప్పాలి.”
బాబు-కొడుకులిద్దరూ (చంద్రబాబు-లోకేష్) కరోనాకు భయపడి హైదరాబాద్ లో దాక్కుంటారని, ఆంధ్రప్రదేశ్ లో మాత్రం ఎన్నికలు పెట్టాలని డిమాండ్ చేయడం విడ్డూరంగా ఉందన్నారు వల్లభనేని.