ఇటీవలే గాంధీ జయంతి సందర్భంగా గాడ్సే భక్తులపై ధ్వజమెత్తాడు బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ. గాంధీని హత్య చేసిన గాడ్సేకు జిందాబాద్ లు కొట్టే వారిపై ఆయన మండి పడ్డారు. అయితే అపర కాషాయధారులే గాడ్సేకు జై కొడుతున్నారనేది బహిరంగ సత్యం.
కమలం పార్టీకి బాగా దగ్గర కావాలనుకునే వారికి కూడా గాడ్సేను ప్రశంసించడం ఫ్యాషన్ గా మారింది. మరి కొన్నాళ్లలో గాడ్సేకు ఏ భారతరత్నో ఇవ్వాలని వాట్సాప్ యూనివర్సిటీ నుంచి పెద్ద ఉద్యమం సాగినా పెద్ద ఆశ్చర్యం లేదు. ఇలాంటి తరుణంలో ఒక బీజేపీ ఎంపీ బాహాటంగా గాడ్సే భక్తులపై విరుచుకుపడ్డారు. ఆ పద్ధతిపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
ఇక యూపీలో రైతులపై కేంద్ర మంత్రి, ఆయన తనయుడి గారి కాన్వాయ్ దూసుకు వెళ్లి దారుణంగా హతమార్చడంపై.. కూడా వరుణ్ గాంధీ తీవ్రంగా స్పందిస్తున్నారు. ఈ సంఘటనను ఆయన ఖండిస్తున్నారు. అంతే కాకుండా.. అందుకు సంబంధించిన వీడియోలను కూడా వరుణ్ గాంధీ వరసగా పోస్టు చేస్తున్నారు.
బీజేపీ కథనం ప్రకారం.. ఇది హత్యాకాండ కాదు. కేంద్రమంత్రిగారి ప్రకారం.. ఆయన తనయుడు అందులో లేడు. అది రైతులపై ప్రతీకారం కాదు. హత్యాకాండ అస్సలే కాదు. అందులో విచారించేందుకు కూడా ఏమీ లేదు1 ఇలాంటి నేపథ్యంలో వరుణ్ గాంధీ స్పందిస్తూ.. హత్యలతో రైతుల నోళ్లు మూయించలేమని అంటున్నారు. ఈ దారుణంపై జవాబుదారీ అవసరం. పరిస్థితులు మరింత విషమించకముందే.. న్యాయం జరగాలన్నట్టుగా వరుణ్ గాంధీ ట్వీట్ చేశారు.
అలాగే ఆ ఘాతుకానికి సంబంధించిన వీడియోను కూడా వరుణ్ మరోసారి పోస్టు చేశారు. అసలేం జరగలేదు.. అన్నట్టుగా బీజేపీ భక్తులు స్పందిస్తున్నారు. అయితే ఒక బీజేపీ ఎంపీ, ఆ పార్టీ సీనియర్ నేతేమో.. ఇలా నోళ్లు మూయించలేరు, న్యాయం చేయండంటున్నారు. మరి ఇక వరుణ్ గాంధీ కుటుంబ మూలాలను ఉద్దేశించి దుమ్మెత్తిపోయటమే వాట్సాప్ యూనివర్సిటీ తదుపరి పని కాబోలు!