న‌వ్వుకునేవాళ్ల‌కు…న‌వ్వుకున్నంత‌!

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు నేల విడిచి సాము చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీని బ‌లోపేతం చేయాల‌ని అధిష్టానం సోము వీర్రాజుకు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానే వీర్రాజు హ‌డావుడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి,…

ఏపీ బీజేపీ అధ్య‌క్షుడు సోము వీర్రాజు నేల విడిచి సాము చేస్తున్నారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీని బ‌లోపేతం చేయాల‌ని అధిష్టానం సోము వీర్రాజుకు బాధ్య‌త‌లు అప్ప‌గించింది. బాధ్య‌త‌లు స్వీక‌రించ‌డానే వీర్రాజు హ‌డావుడి చేశారు. మెగాస్టార్ చిరంజీవి, ప‌వ‌ర్‌స్టార్ ప‌వ‌న్‌క‌ల్యాణ్ త‌దిత‌ర కాపు సామాజిక వ‌ర్గ ప్ర‌ముఖుల‌ను క‌లుసుకున్నారు. అలాగే కొన్ని రోజులు మీడియాలో దూకుడు ప్ర‌ద‌ర్శించారు.

రాన్రాను సోము వీర్రాజు క‌మెడియ‌న్‌లా త‌యార‌య్యార‌నే విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. ఇటీవ‌ల విజ‌య‌వాడ‌లో ప్ర‌జాగ్ర‌హ స‌భ‌తో సోము వీర్రాజు ప‌రువు మ‌ద్యంలో క‌లిసిపోయింది. ప‌నిలో ప‌నిగా బీజేపీని కూడా నిండా ముంచారు. చీప్‌లిక్క‌ర్‌ను రూ.50కే ఇస్తామ‌ని, కావున కోటి మంది మందుబాబులు త‌మ‌కే ఓట్లు వేయాల‌నే అభ్య‌ర్థ‌న‌తో దేశ వ్యాప్తంగా బీజేపీ అభాసుపాలైంది. సీరియ‌స్ పొలిటీషియ‌న్ అనుకున్న సోము వీర్రాజు…కేఏ పాల్‌ను మ‌రిపించార‌నే సెటైర్స్ వెల్లువెత్తాయి. వీర్రాజు టాలెంట్ ఏంటో తెలుసుకోడానికి, ఆయ‌న అధ్య‌క్షుడు కావాల్సి వ‌చ్చింద‌నే వాళ్లు లేక‌పోలేదు.

ఈ నేప‌థ్యంలో మ‌రోసారి ఆయ‌న న‌వ్వు తెప్పించే కామెంట్స్ చేశారు. బీజేపీకి అధికారం ఇస్తే అమరావతిని రాజధానిగా చేయడంతోపాటు అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని సోము వీర్రాజు స్పష్టం చేశారు. కృష్ణా జిల్లా వత్సవాయి మండలం గోపినేని పాలెంలో సోమ‌వారం ప‌ర్య‌టించిన సోము వీర్రాజు అమ‌రావ‌తిపై వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి. ముందుగా అధికారంలోకి రావ‌డానికి ఏం చేయాలో సోము వీర్రాజు ఆలోచిస్తున్న‌ట్టు లేదు.

ఏపీలో బీజేపీని అభివృద్ధి చేయ‌వ‌య్యా అని అధిష్టానం పంపితే, అస‌లు ప‌ని వ‌దిలేసి కొస‌రు సంగ‌తుల‌పై మాట్లాడ్డం ఆయ‌న‌కే చెల్లింది. పెళ్లి కావాలంటే ముందు పిచ్చి కుద‌రాల‌ని పెద్ద‌లు చెబుతారు. కానీ మ‌న వీర్రాజు మాత్రం పిచ్చి పోగొట్ట‌డం గురించి ఆలోచించ‌డం లేదు.

ఇప్ప‌టికైనా బీజేపీని బ‌లోపేతంపై దృష్టి పెట్టి, ఆ త‌ర్వాత అమ‌రావ‌తి గురించి ఆలోచిస్తే మంచిద‌ని సొంత పార్టీ నేత‌లు హిత‌వు చెబుతున్నారు. ఉట్టికి ఎగరలేనమ్మా స్వర్గానికి ఎగురుతా అన్న చందంగా…  సోము వీర్రాజు ప్ర‌గ‌ల్భా లున్నాయ‌ని ప్ర‌త్య‌ర్థులు ఘాటు విమ‌ర్శ‌లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తానికి సీరియ‌స్ పాలిటిక్స్ న‌డుస్తున్న ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో మ‌న‌సుకు ఆహ్లాదాన్ని పంచేందుకు వీర్రాజు కామెడీ చేస్తున్నార‌నే వ్యంగ్య కామెంట్స్ సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌వుతున్నాయి. వీర్రాజు పాండిత్యంతో న‌వ్వుకునే వాళ్ల‌కు న‌వ్వుకున్నంత కామెడీ అనే విసుర్లు.