తమిళనాడు భారతీయ జనతా పార్టీ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గా నియమితం అయ్యింది విద్యా వీరప్పన్. 29 యేళ్ల వయసున్న ఈమె గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ కు సొంత కూతురు. 150 మంది హత్యలకు కారణం అయ్యాడనే కేసులున్నాయి వీరప్పన్ మీద. వీరప్పన్ చేత హతమైన వారిలో పోలీసు ఉన్నతాధికారులతో సహా సామాన్య పోలిసులు, సామాన్యులు కూడా ఉన్నారు. అలాగే వంద ఏనుగులను చంపి వాటి దంతాలను అపహరించిన నేరాలు కూడా వీరప్పన్ ఖాతాలో ఉన్నాయి. ఇక వెస్ట్రన్ ఘాట్స్ లో గంధపు చెక్కల స్మగ్లింగ్ సరేసరి!
దశాబ్దాల పాటు కర్ణాటక- తమిళనాడు రాష్ట్రాలను గడగడలాడించిన నేరగాడు వీరప్పన్. అలనాటి కన్నడ స్టార్ హీరో రాజ్ కుమార్ ను అపహరించి తన డిమాండ్లను నెరవేర్చుకోగలిగాడు. కర్ణాటక, తమిళనాడు పోలీసులు ఎంతగానో వేటాడగా 2004లో వీరప్పన్ ను కాల్చి చంపగలిగారు. అంతటితో వీరప్పన్ ముఠా శకానికి కూడా తెరపడింది.
ఇప్పుడు వీరప్పన్ కూతురు తమిళనాడు రాజకీయాల్లో రాణించే ప్రయత్నం చేస్తోంది. ఆమె బీజేపీ స్టేట్ యూత్ వింగ్ వైస్ ప్రెసిడెంట్ గా నియమితం అయ్యింది. కృష్ణగిరి లో స్థానిక విద్యార్థుల కోసం ఒక స్కూల్ నడుపుతోందట విద్య. తన జీవితంలో ఒక్కసారే తన తండ్రిని చూసినట్టుగా ఆమె చెబుతోంది. తనకు ఆరేడేళ్ల వయసు ఉండగా.. ఒకసారి ఆయనను చూసినట్టుగా విద్య చెబుతోంది. బాగా చదువుకొమ్మని, డాక్టర్ అయ్యి పేదలకు సేవ చేయాలని ఆయన తనకు సూచించాడని విద్య చెబుతోంది.