80లలో మధ్యతరగతి జీవితాల గురించి చూడచక్కని సినిమాలను రూపొందించిన దర్శకుడు, రచయిత, నటుడు విసు. పూర్తి పేరు మీనాక్షి సుందరం రామస్వామి విశ్వనాథన్. 75వ యేట ఆయన తుదిశ్వాస విడిచారు. తెలుగు వారికి ఈయనతో పరిచయం తక్కువే కానీ, ఈయన తమిళంలో రూపొందించిన సినిమాలు తెలుగులో రీమేక్ అయ్యి కల్ట్ హిట్ అయ్యాయి. అలాంటి వాటిలో ముందు వరసలో నిలుస్తుంది సంసారం ఒక చదరంగం. గొల్లపూడి మారుతీరావు ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాకు మూలం తమిళ సినిమా 'సంసారం ఒరు మిన్సరం' . తమిళంలో ఈ సినిమాకు విసు సొంతంగా దర్శకత్వం వహించి, తనే ప్రధాన పాత్రలో నటించారు. ఆ సినిమా కూడా తెలుగులోకి డబ్ అయ్యింది. ఆ తర్వాత తెలుగులో ఈ సినిమా ఎస్పీ ముత్తురామన్ దర్శకత్వంతో ఏవీఎం వాళ్లే రూపొందించారు. ఇప్పటికీ టీవీల్లో అనునిత్యం ప్రదర్శితం అవుతూనే ఉంటుంది ఆ సినిమా.
దిగ్ధదర్శకుడు బాలచందర్ కు అసిస్టెంట్ గా విసు సినీ ప్రస్థానం మొదలైంది. అయితే చాలా తొందరగానే ఆయన నటుడిగా, రచయితగా పేరు తెచ్చుకున్నారు. తమిళనాట ఇంటిల్లిపాదికీ దగ్గరయ్యారు. వివిధ కుటుంబ కథా చిత్రాలను రూపొందిస్తూ వచ్చారు. ఆ పై టీవీ షోలూ, సామాజిక చర్చాకార్యక్రమాలు చేపట్టారు. తెలుగులోనూ నటించడంతో పాటు దర్శకత్వం కూడా వహించారు.
విసు కు తమిళంలో బాగా పేరు తెచ్చిపెట్టిన 'కుటుంబం ఒరు కదంబం' తెలుగులో 'మనిషికోచరిత్ర' గా రీమేక్ అయ్యింది. అలాగే ఆయన తెలుగులో స్వయంగా దర్శకత్వం వహించి ఒక సినిమాలో నటించారు. అదే ఆడదే ఆధారం. కామెడీ టచ్ తో మధ్యతరగతి బాంధవ్యాలను, ప్రేమద్వేషాలను చూపించడంలో విసుది అందె వేసిన చేయి. ఈ విషయంలో బాలచందర్ ట్రాజెడీ మార్గాలను అనుసరిస్తే, విసు మాత్రం కథ చివరికి సుఖాంతం అయ్యేలా, సమస్యలు పరిష్కారం అయ్యే ప్రేక్షకుడిని సంతృప్తి పరిచేలా తన సినిమాలను రూపొందించారు.
కొన్ని డబ్బింగ్ సినిమాలతోనూ తెలుగువారికి గుర్తుండిపోతారు విసు. అందులో ఒకటి రజనీకాంత్ 'అరుణాచలం' ఆ సినిమాలో ఆయన హీరోయిన్ రంభ తండ్రి రంగాచారి పాత్రను తనదైన స్టైల్లో పండించారు.
'సంసారం ఒక చదరంగం'లో కీలక పాత్ర పోషించిన నటుడు, రచయిత గొల్లపూడి మారుతీరావు ఇటీవలే మరణించారు. ఆ పాత్రను ఒరిజినల్ గా తీర్చిదిద్ది, పోషించిన విసు నిన్న ఆదివారం మరణించడం యాదృచ్ఛికమేమో!