రైతు రుణమాఫీని అమలు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ చేస్తున్న యాగీపై ఘాటుగా స్పందించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ వి.విజయసాయి రెడ్డి. తమ హయాంలో రైతు రుణమాఫీ జరిగిపోయినట్టుగా తెలుగుదేశం వాళ్లు చెప్పుకున్నారు. అదేంటో అధికారం నుంచి దిగిపోయాకా.. మళ్లీ రైతు రుణమాఫీని పూర్తి చేయాలంటున్నారు. మాఫీ జరిగిపోయిందని చెప్పింది వాళ్లే, ఇప్పుడు పూర్తి చేయాలని అంటున్నదీ వాళ్లే. ఈ నేపథ్యంలో విజయసాయి రెడ్డి స్పందించారు. ఇంకా వివిధ అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీలపై ఆయన విరుచుకుపడ్డారు.
''అనుభవం, ఆవకాయలని రాష్ట్రాన్ని దివాలా తీయించారు. అలవికాని హామీలిచ్చేసి ఇప్పుడు అవి నేరవేర్చడం జగన్ గారి బాధ్యతే అంటే ఎలా చంద్రబాబు గారూ? అయినా రుణమాఫీ పూర్తిగా చేశామని ఎల్లో మీడియాలో రాయించుకున్నారు గదా? ఏఎన్ఎమ్ ఉద్యోగినుల సమస్యలకు ఐదేళ్ల తమరి పాలనే కారణం బాబుగారు. ఇబ్బందులను ప్రభుత్వం దృష్టికి తెచ్చేందుకు వాళ్లేదో కొద్దిమంది ధర్నా చేస్తే లాఠీ ఛార్జీ జరగలేదని, గుర్రాలతో తొక్కించలేదని నిరాశ పడుతున్నట్టున్నారు మీరు. సీఎం జగన్ గారి ప్రభుత్వం మీలాగా క్రూరంగా వ్యవహరించదెప్పుడూ.
యనమల గారికి ఇప్పుడు స్వేచ్ఛ దొరినట్టుంది. ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు ఏం మాట్లాడాలన్నా కుటుంబరావు అనుమతి కావాల్సి వచ్చేదని చెబుతారు. ఇన్నాళ్లకి అదో-ఇదో అనే ఛాన్స్ దొరికింది. బాబు ప్రభుత్వంలో తన వియ్యంకుడు చేసిన కాంట్రాక్టులపై విచారణ కోరుతూ లేఖ రాసి తర్వాతే విమర్శలు చేయాలి. మన అదృష్టం బాగుండి ఇప్పుడు అధికారంలో లేరు గానీ, ఆర్టికల్ 370 తొలగించాక కశ్మీర్లో పెట్టుబడులు పెట్టేవారందరికీ తానే సంధానకర్తనని ప్రకటించకునే వారు బాబు. ఇన్సైడర్ ట్రేడింగులో తలపండిన వ్యక్తి కదా అమరావతిలో ‘గాయపడిన’ వారినందరిని ప్రత్యేక విమానాల్లో శ్రీనగర్ తరలించేవారు.
80 లక్షల మంది డ్వాక్రా మహిళల ఉత్పత్తులను వాల్మార్ట్, ఐటీసీ, మహీంద్రా, ఫ్యూచర్ గ్రుప్ వంటి కంపెనీలు ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ చేస్తాయని చంద్రబాబు గారు పెట్టుబడుల సదస్సుల్లో ఎంఓయూలు కుదుర్చుకున్నారు. ఈ కంపెనీలు కొనుగోలు చేస్తున్న వస్తువులేమిటో బాబు అండ్ కో చెప్పాలి.'' అంటూ విజయసాయి రెడ్డి విరుచుకుపడ్డారు.