టాలీవుడ్లో ఆమె లేడీ అమితాబ్. రాజకీయ రంగంలో ఆమె ఫైర్‌బ్రాండ్. ఆమే బీజేపీ మహిళా నేత విజయశాంతి. కేసీఆర్ పాలన ఆమెలో రోజురోజుకూ అశాంతిని కలిగిస్తోంది. దీంతో సమయం, సందర్భం చూసుకుని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై ఆమె విరుచుకుపడుతుంటారు.
తాజాగా హుజూరాబాద్ ఉప ఎన్నిక తెలంగాణలో కాక రేపుతోంది. హుజూరాబాద్‌లో దళిత బంధు పథకాన్ని సీఎం కేసీఆర్ ప్రారంభించిన సందర్భంగా చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి సోషల్ మీడియా వేదికగా ఘాటుగా స్పందించారు. తన ఫేస్బుక్లో విజయశాంతి చేసిన పోస్ట్ గురించి తెలుసుకుందాం.
“హుజూరాబాద్‌లో దళిత బంధు పథకం పై కేసీఆర్ గారు మాటలు, నవ్వి పోదురు గాక నాకేమి సిగ్గు అన్న చందంగా ఉంది. ఎన్నికల్లో గెలవాలంటే దళిత బంధు ప్రకటించాలి అని చెప్పడం ద్వారా హుజూరాబాద్‌లో గెలవలేని పరిస్థితులున్నట్లు స్వయంగా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. అట్లానే గెలవలేని పార్టీలు హామీలు ఇయ్యంగ లేంది TRS ఇస్తే తప్పేంది అన్నారు.
మరి హుజూర్ నగర్, GHMC, నాగార్జున సాగర్ ఎన్నికల హామీలు యాడపాయ? తెలంగాణ అంతా దళిత బంధు అమలు చేస్తానంటున్న ఈ ముఖ్యమంత్రి అందుకు నిధులేడకేల్లి కేటాయించునున్నారో చెప్పాలి. ఇంకా కేసీఆర్ గారిని విశ్వసించటమంటే తుపాకీ రాముడు మాటలకు, తుగ్లక్ వాగ్దానాలుకు చెవొగ్గే మూర్ఖత్వమే” అని తనదైన స్టైల్లో కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు.
ఇంకా హుజూరాబాద్ ఉప ఎన్నికకు సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోయినప్పటికీ రాజకీయ పార్టీలు సన్నద్ధం కావడం గమనార్హం. తెలంగాణలో ప్రతి ఎన్నికను ఏ స్థాయిలో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నాయో హుజూరాబాద్ ఉప ఎన్నిక ఓ ఉదాహరణ మాత్రమే. 2023 అసెంబ్లీ ఎన్నిలకు ఇప్పటి నుంచే అన్ని రాజకీయ పార్టీలు కత్తులు నూరుతుండడం విశేషం.