తెలంగాణ వచ్చి ఏడేళ్లు పూర్తయ్యాయి. కేసీఆర్ 2 సార్లు ముఖ్యమంత్రి అయ్యారు. ఈ దశలో అధికార పక్షం అభివృద్ధిలో అదరగొట్టామని చెప్పుకుంటుంటే.. ప్రతిపక్షాలన్నీ అభివృద్ధి జాడేదని ప్రశ్నిస్తున్నాయి. ప్రత్యేక రాష్ట్రం వచ్చినా అభివృద్ధి ఫలాలు ప్రజలకు అందలేదనే విమర్శ సహజంగా వినిపించేదే. అయితే బీజేపీ నేత విజయశాంతి వ్యాఖ్యలు మాత్రం ఇప్పుడు కాస్త కామెడీగా తోస్తున్నాయి.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి కారణం బీజేపీయేనని చెప్పుకుంటున్నారు విజయశాంతి. అది నిజమే కావొచ్చు, పార్లమెంట్ లో బిల్లు పాస్ అయ్యేందుకు బీజేపీ సహకరించి ఉండొచ్చు. అయితే ఏళ్లు గడుస్తున్నా ఇంకా పాత గొప్పలు చెప్పుకోవడమే కాస్త విచిత్రంగా తోస్తోంది.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేసీఆర్ పాలనను విమర్శించిన విజయశాంతి.. రాష్ట్ర ఏర్పాటు క్రెడిట్ అంతా బీజేపీ ఖాతాలోనే వేయాలని చెప్పారు. తెలంగాణ రాష్ట్ర ఆలోచన మొదట బీజేపీకే వచ్చిందని, ఒక ఓటు, రెండు రాష్ట్రాలు తమ నినాదం అని అన్నారు విజయశాంతి. తెలంగాణ ఉద్యమంలోకి టీఆర్ఎస్ లేట్ గా వచ్చిందని చెప్పుకొచ్చారు.
ప్రత్యేక రాష్ట్రం ఏర్పడి ఏడేళ్లవుతున్నా ఇంకా ఆ ఘనత మాదేనని చెప్పుకోవడం నిజంగానే విడ్డూరంలా తోస్తుంది. తెలంగాణ ఇచ్చే సమయంలో కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా ఆ విషయాన్ని మరచిపోయిన వేళ, విజయశాంతి డప్పు కొట్టుకోవడం మాత్రం కాస్త వింతగా అనిపిస్తోంది.
అయితే విజయశాంతి ఏ పార్టీలో ఉన్నా కూడా.. మా పార్టీయే తెలంగాణ ఇచ్చిందని చెప్పుకుంటారని, అంతలా ఆమె అన్ని పార్టీలను చుట్టేశారని నెటిజన్లు సెటైర్లు పేలుస్తున్నారు.
రాములమ్మ పంచ్ డైలాగులు..
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా పాత ముచ్చట్లు చెప్పుకున్నా.. పంచ్ డైలాగులతో మాత్రం ఆకట్టుకున్నారు రాములమ్మ. తెలంగాణలో విద్యా రంగం కోమాలో ఉందని, వైద్యం వెంటిలేటర్ పై ఉందని, రైతులు చనిపోతున్నారని, ప్రజలు అల్లాడిపోతున్నారని కేసీఆర్ ప్రభుత్వంపై సెటైర్లు పేల్చారామె.
పనిలో పనిగా కరోనా వల్ల తెలంగాణలో బీజేపీ స్పీడ్ తగ్గిందని జోక్ చేశారు కూడా. బీజేపీ అధికారంలోకి వస్తేనే తెలంగాణ బాగుపడుతుందని, కేసీఆర్ పై మరో ఉద్యమం చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.
భౌగోళికంగా తెలంగాణ వచ్చినా, సామాజిక తెలంగాణ ఇంకా రాలేదన్నారు విజయశాంతి. కేసీఆర్ దొర పాలన పోవాలని, తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆయన కుటుంబం మాత్రమే బాగుపడిందని ఓ రొటీన్ డైలాగ్ వదిలారు.