సౌత్ లో వివిధ దశల్లో స్టార్ హీరోయిన్లుగా వెలిగిన విజయశాంతి, కుష్బూ, నగ్మా.. వీళ్లందరూ ఇటీవలి కాలంలో కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా వ్యవహరించారు. కుష్బూ దాదాపు దశాబ్దకాలంగా కాంగ్రెస్ లో పని చేస్తూ వచ్చారు.
నగ్మా అంతకు ముందే కాంగ్రెస్ సభ్యత్వం తీసుకుని సౌత్ రాజకీయాల్లో కూడా కనిపించేది. విజయశాంతి కొన్నేళ్ల కిందట కాంగ్రెస్ లో చేరారు. అయితే వీళ్లెవ్వరికీ కాంగ్రెస్ ద్వారా పెద్ద పదవులు దక్కిందేమీ లేదు. కాంగ్రెస్ అంతర్గత పదవులు దక్కాయేమో కానీ కాంగ్రెస్ తరఫున చట్టసభల్లో వీళ్లకు స్థానం దక్కలేదు.
అదే సమయంలో వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఈ క్రమంలో కుష్బూ ఇటీవలే రాజీనామా చేశారు. తమిళనాట ఆమె కాంగ్రెస్ కు రాజీనామా చేసి, బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. బీజేపీది నియంతృత్వం అంటూ విమర్శించిన కుష్బూకు ఇప్పుడు కమలం పార్టీ ప్రజాస్వామ్యయుతంగా కనిపిస్తూ ఉంది.
కట్ చేస్తే.. విజయశాంతి విషయంలో ఇప్పుడు రాజీనామా ఊహాగానాలు మొదలయ్యాయి. తెలంగాణలో బలోపేతం కావడానికి ప్రయత్నిస్తున్న బీజేపీ చేరికలను ఆహ్వానిస్తున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో విజయశాంతిని చేర్చుకోవడానికి బీజేపీ పావులు కదుపుతోందట. ఇందు కోసం కేంద్ర హోంశాఖా సహాయ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా వెళ్లి విజయశాంతితో సమావేశం అయ్యారనే వార్తలు వస్తున్నాయి.
కాంగ్రెస్ పార్టీలో ఉన్నా లేనట్టుగా వ్యవహరిస్తున్నారు విజయశాంతి. ఇటీవలే ఆమె మళ్లీ సినిమాలకూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. స్టార్ హీరోల సినిమాల్లో నటించడానికి వెనుకాడేలా లేరు. మరిలాంటి సమయంలో ఆమె పార్టీ మారతారా? తను ఎప్పుడో ఒకప్పుడు కొన్నాళ్లు పని చేసిన బీజేపీలోకి తిరిగి చేరతారా? అనేది ఆసక్తిదాయకంగా మారింది.