రాజు తలచుకుంటే వరాలకు కొరతా అన్న సామెత ఉండనే ఉంది. ఇక ముఖ్యమంత్రి జగన్ స్వయంగా హామీ ఇచ్చాక పదవి దానంతట అదే తోసుకుంటూ రాకుండా పోతుందా. శ్రీకాకుళం జిల్లాలోని వైసీపీ యువ నేత విక్రాంత్ అలాగే జాక్ పాట్ కొట్టేసాడు అంటున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఒడిషా పర్యటనలో భాగంగా ముందుగా పాతపట్నం వెళ్ళి అక్కడ వైసీపీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి కుమార్తె వివాహ రిసెప్షన్ లో పాల్గొన్నారు. అక్కడికి వచ్చిన డీసీసీబీ మాజీ చైర్మన్ పాలవలస విక్రాంత్ ను ఉద్దేశించి మంచి ముహూర్తం చూసుకుని క్యాంప్ ఆఫీస్ కి రావాలని జగనే స్వయంగా చెప్పడంతో ఆయనతో పాటు అక్కడ ఉన్నవారంతా ఆశ్చర్యపోయారు.
ఏపీలో ప్రస్తుతం 14 ఎమ్మెల్సీ పదవులు ఖాళీ అయ్యాయి. వాటిలో ఒకదాని కోసం విక్రాంత్ తన ప్రయత్నాలు తాను చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో జగనే తానుగా ఆయనను ఆశీర్వదించారని అంటున్నారు.
జిల్లాలో తూర్పు కాపు సామాజికవర్గానికి విక్రాంత్ జిల్లాలో పేరు గడించిన రాజకీయ కుటుంబం నుంచి వచ్చారు. ఆయన తండ్రి పాలవలస రాజశేఖరం శ్రీకాకుళం జిల్లా ఎంపీగా అప్పట్లో పనిచేశారు.
ఇక రెడ్డి శాంతి కూడా ఆయన సోదరి. మొత్తానికి ఎమ్మెల్సీ పదవుల కోసం ఎందరో ఆశావహులు ఎదురుచూస్తుండగా విక్రాంత్ కి జాక్ పాట్ తగిలేసింది అంటున్నారు.