గ్రామ వాలంటీర్ వ్యవస్థపై టీడీపీ నేతలు దారుణమైన విమర్శలు చేస్తున్నారు. జన్మభూమి కమిటీల లాగే వాలంటీర్ వ్యవస్థ ఉంటుందని, పేరు మార్చి వైసీపీ కార్యకర్తలకు జీవనోపాధి చూపిస్తున్నారని, ప్రతి గ్రామంలో మరో అధికార కేంద్రం ఏర్పాటు చేసుకుంటున్నారని దుయ్యబడుతున్నారు. అయితే టీడీపీ విమర్శల్లోనే వారి తప్పు తెలుస్తోంది. టీడీపీ హయాంలో జన్మభూమి కమిటీలతో అక్రమాలు చేయించామని, అవినీతి, ఆశ్రిత పక్షపాతానికి పాల్పడ్డామని వారు చెప్పకనే చెబుతున్నారు.
తాజాగా ప్రతి జిల్లాలో కార్యవర్గ సమావేశం పెట్టుకుని మరీ వాలంటీర్ వ్యవస్థపై దుమ్మెత్తి పోస్తున్నారు టీడీపీ నేతలు. ఎమ్మెల్యేలు టోకెన్లిస్తే వాలంటీర్ పోస్ట్ లు ఇస్తున్నారని, ఇంటర్వ్యూలు పారదర్శకంగా జరగడంలేదనేది వీరి వాదన. పోనీ అదే నిజం అనుకుందాం. వాలంటీర్ పోస్ట్ లకు వయో పరిమితి ఉంది, విద్యార్హత తప్పని సరి. జన్మభూమి కమిటీలకు అవి రెండూ లేవు కదా. అందినకాడికి, అడ్డగోలు సంపాదనకు అలవాటు పడ్డవారినే కమిటీల్లో వేసుకుని ప్రభుత్వ పథకాలన్నిటినీ పక్కదారి పట్టించింది టీడీపీ. సో.. ఇక్కడ వాలంటీర్ వ్యవస్థకు, జన్మభూమి కమిటీలకు పోలికే లేదు. చదువుకున్నవారు, యువత మాత్రమే వాలంటీర్లుగా ఎంపికయ్యారు, వీరికి ఎలాంటి రాజకీయ నేపథ్యం లేదు.
ఇక మరో ప్రధాన కంప్లయింట్.. జన్మభూమి కమిటీలు రూపాయి ఆశించకుండా ఉచిత సేవ చేశాయట, అదే జగన్ మాత్రం తమ వారికి నెలకు 5వేల రూపాయలు ప్రభుత్వ సొమ్ము ధారపోస్తున్నారట. ఇది పసలేని వాదన. వాలంటీర్ గా పనిచేసే వ్యక్తి, ఇంటింటికీ రేషన్ సరుకులు పంపిణీ చేయాలి, ప్రభుత్వ పథకాలకు ప్రజల తరపున అర్జీలు తీసుకెళ్లి ఇవ్వాలి, వాటిని ఫాలోఅప్ చేయాలి, నికరంగా 50 కుటుంబాలకు జవాబుదారీగా ఉండాలి.
ఈ పనులన్నింటికీ భృతి ఇస్తేనే వాలంటీర్లు లంచాలు ఆశించకుండా పనిచేస్తారు, ప్రజలు కూడా మీరు జీతాలు తీసుకుంటున్నారు కదా అని ప్రశ్నించే అవకాశం ఉంటుంది. ఈ సదుద్దేశంతోటే జగన్ జీతాలిచ్చి పనిచేయించుకుంటామని చెప్పారు. ఈమాత్రం కూడా ఆలోచించకుండా పసలేని ఆరోపణలు చేస్తున్నారు తెలుగుదేశం నేతలు. ఇక వాలంటీర్ల విధులు కూడా క్లియర్ గా ఉన్నాయి. ఏడాది వరకే కాంట్రాక్ట్ ఉంటుంది, మధ్యలో ఎక్కడ తోక జాడించినా ఉన్నఫళంగా ఉద్యోగంలో నుంచి తీసేస్తామని ఉద్యోగ నియామక పత్రాలపై సంతకాలు తీసుకుంటున్నారు.
ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి జగన్ కూడా పదేపదే ప్రకటించారు. సో.. జన్మభూమి కమిటీ వేరు, గ్రామ వాలంటీర్ వ్యవస్థ వేరు. టీడీపీ విమర్శలకు అర్థంలేదు. ఈ విషయాన్ని ఆ పార్టీ నేతలు గ్రహించకపోయినా, ప్రజలు మాత్రం అర్థం చేసుకున్నారు.