యువతీయువకుడు సేఫ్.. అబ్బాయిపై మర్డర్ కేసు

విశాఖలో సంచలనం సృష్టించిన యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో అబ్బాయి, అమ్మాయి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో విశాఖకు చెందిన అమ్మాయి, తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన హర్షవర్థన్ కు తీవ్ర…

విశాఖలో సంచలనం సృష్టించిన యువతిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటనలో అబ్బాయి, అమ్మాయి ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడ్డారు. ఈ ఘటనలో విశాఖకు చెందిన అమ్మాయి, తెలంగాణలోని భూపాలపల్లికి చెందిన హర్షవర్థన్ కు తీవ్ర గాయాలైనప్పటికీ.. ప్రాణాలకు ముప్పు లేదని పోలీసులు ప్రకటించారు. 

ఈ కేసును దిశ పోలీస్ స్టేషన్ కు బదిలీ చేశారు. ప్రాధమిక విచారణలో హర్షవర్థన్ దే తప్పని నిర్థారణకొచ్చారు. ఈ మేరకు హర్షవర్థన్ పై మర్డర్ కేసు, ఆత్మహత్యయత్నం కేసులను నమోదు చేశారు. దీంతో పాటు బాధితురాలు ఇచ్చిన సమాచారం మేరకు లైంగిక వేధింపుల సెక్షన్లు కూడా జోడించారు.

ఇంతకీ ఏం జరిగింది..

విశాఖకు చెందిన అమ్మాయి, వరంగల్ కు చెందిన హర్షవర్థన్ కు చాన్నాళ్లుగా పరిచయం ఉంది. ఇద్దరూ పంజాబ్ లోని జలంధర్ లో బీటెక్ చదివారు. ఆ టైమ్ లోనే విశాఖ అమ్మాయికి, తన ప్రేమ విషయం చెప్పాడు హర్షవర్థన్. కానీ ఆమె నిరాకరించింది. ఇంజనీరింగ్ పూర్తిచేసుకొని సాఫ్ట్ వేర్ ఉద్యోగం సంపాదించిన యువతి… ప్రస్తుతం వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తోంది.

ఆమెను కలిసేందుకు వరంగల్ నుంచి విశాఖ వచ్చాడు హర్షవర్థన్. నగరంలోని సూర్యబాగ్ ప్రాంతంలోని ఓ హోటల్ లో దిగాడు. అతడి కోరిక మేరకు కలిసేందుకు యువతి హోటల్ కు వచ్చింది. ఆ టైమ్ లో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. హర్షవర్థన్ ప్రేమను యువతి మరోసారి తిరస్కరించింది. దీంతో ఆగ్రహంచెందిన హర్షవర్థన్, అప్పటికే తనతో తెచ్చుకున్న పెట్రోల్ ను ఆమెపై పోసి నిప్పంటించాడు. తర్వాత తను కూడా ఆత్మహత్యకు యత్నించాడు.

ఈ ఘటనలో యువతికి తీవ్ర గాయాలయ్యాయి. జీన్స్ ప్యాంట్ వేసుకోవడంతో నడుము నుంచి కిందభాగం వరకు పెద్దగా గాయాలవ్వలేదు. హర్షవర్థన్ కు మాత్రం చేతుల నుంచి కాళ్లు వరకు తీవ్రంగా గాయాలయ్యాయి. ప్రస్తుతం ఇద్దరికీ హాస్పిటల్ లో వైద్యం అందిస్తున్నారు. 

తనపై హత్యాయత్నం జరిగిన వెంటనే యువతి, తన తండ్రికి సమాచారం అందించింది. జరిగిన ఘటన మొత్తం ఫోన్ లోనే వివరించింది. ఆ ఫోన్ కాల్ ఆధారంగా కేసును ఫైల్ చేశారు పోలీసులు.