భారత్ అతి పెద్ద దేశం. శాంతి కాముక దేశం. అయితే తన జోలికి ఎవరూ రానంతవరకే భారత్ సహనం పాటిస్తుంది. వచ్చారో వారి అంతు చూసేందుకు తగిన శక్తి సామర్ధ్యాలు భారత్ కి నిండుగా మెండుగా ఉన్నాయి. ఈ నేపధ్యంలో భారత్ అమ్ముల పొదిలో సరైన బ్రహ్మాస్త్రం ఇపుడు సిద్ధంగా ఉంది.
సరికొత్త యుద్ధ నౌక భారత నావికాదళంలో చేరింది. పూర్తి దేశీయ పరిజ్ఞానంతో రూపకల్పన చేసిన ఈ యుద్ధ నౌకను కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాధ్ సింగ్ ఈ రోజు జాతికి అంకితం చేశారు. ఐఎన్ఎస్ విశాఖపట్నం యుద్ధనౌక ఇపుడు భారత్ రక్షణలో అతి కీలకమైన పాత్ర పోషించనుంది. ఈ యుద్ధ నౌక ఈ రోజు విశాఖపట్నంలో జలప్రవేశం చేసింది. ఈ యుద్ధనౌక నుంచి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్షిపణులతో సహా పలురకాల క్షిపణులను ప్రయోగించవచ్చు.
శత్రు మూకల పనిని పట్టేలా ఈ యుద్ధ నౌక అరవీర భయంకరంగా రూపుదిద్దుకుంది. ఈ నౌక కదలికలను శత్రుదేశాల రాడార్లు గుర్తించలేని విధంగా అధునాతన పరిజ్ఞానాన్ని ఉపయోగించారు. జలాంతర్గాములను కూడా గుర్తించి దాడి చేయడానికి వీలుగా శక్తిమంతమైన టోర్పెడోలను పొందుపరిచారు.
అదేవిధంగా ఇందులో రెండు మల్టీరోల్ హెలికాప్టర్లు ఉంటాయి. నౌక శిఖర భాగంలో ఏర్పాటు చేసే ముద్రలో విశాఖలోని డాల్ఫిన్నోస్ కొండ, దానిపై ఉండే దీపస్తంభానికి స్థానం కల్పించారు.
ఇక విశాఖ కేంద్రంగా పాకిస్థాన్ తో జరిగిన యుద్ధంలో ఘన విజయం సాధించి నాలుగు దశాబ్దాలు పూర్తి అయిన సందర్భంగా అంతకు పదిరెట్లు రక్షణా సామర్ధ్యంతో ఈ యుద్ధ నౌక విశాఖలో గస్తీ కాయడం విశేషంగానే చూడాలి.